Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగనున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్ విముఖత కనబరుస్తున్నది. గతంలో జరిగిన కీలక సదస్సులన్నింటికీ హాజరైన ఇరాన్ ఒకేసారి ప్రపంచ ఆర్థిక సదస్సుకు డుమ్మా కొట్టడం పట్ల నిర్వాహకులు నిర్ఘాంతపోయారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో దావోస్ సదస్సుకు హాజరుకాలేరని సోమవారం ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈనెల3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని కాన్వారుని లక్ష్యంగా చేసుకొని అమెరికా క్షిపణుల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సులేమాని మృతి చెందారు. ఈ ఘటన అనంతరం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరాక్‌లోని యూఎస్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 186 మంది యూఎస్ సైనికులు మృతిచెందినట్టు ఇరాన్ ప్రకటించగా, అమెరికా ఖండించింది. తమ సైనికులంతా సురక్షితమేనని ప్రకటించింది. 16 మంది గాయపడినట్టు మరోసారి ప్రకటించింది. ఒకవేళ ఈ సదస్సుకు ఇరాన్ హాజరైనట్టయితే ఇరాన్, అమెరికా దేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు జపాన్ సిద్ధంగా ఉన్నది. అందుకే, ఉద్దేశపూర్వకంగా ఈ సదస్సుకు ఇరాన్ దూరంగా ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా, ఇరాన్ ప్రయోగించిన క్షిపణి కారణంగా ఉక్రెయిన్‌కు చెందిన విమానంలోని 176 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దాడి ఇరాన్ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ ఈ దాడి అనంతరం ఇరాన్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ అంశం కూడా దావోస్ సదస్సులో చర్చకు వచ్చే అవకాశముందని ఇరాన్ అనుమానిస్తున్నది.