Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శనివారం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే క్రమం.. ఊహకందని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపించింది. శివసేనకు షాకిస్తూ... మోడీ - షా ద్వయం వేసిన పాచికకు ఎన్సీపీలో ముసలం పుట్టింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ... శాశ్వత శత్రువులు గాని ఉండరు. అధికారం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేటి రాజకీయం.. తాజాగా మహారాష్ట్రలో జరిగిన అనూహ్య పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. నైతిక విలువలు, స్వీయనియంత్రణను అధికార పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడం... కూటములుగా పోటీ చేసి అధికారం కోసం ప్లేట్ ఫిరాయించడం నిత్యకృత్యమైంది. మహారాష్ట్ర పరిణామాలు ఇందుకు అతీతం కాక పోయినప్పటికీ ముప్పై ఏండ్లుగా ఒకే సైద్ధాంతిక విధానానికి కట్టుబడి ఉన్న బీజేపీ, సేనలు అధికారం కోసం ప్రజల తీర్పును పక్కన పెట్టడం అనూహ్య పరిణామమే... కేంద్రంలో బీజేపీ రెండోసారీ పగ్గాలు చేపట్టిన తర్వాత దక్షణాది రాష్ట్రాలను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు, అధికారాన్ని నిలుపుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది అనడానికి మహారాష్ట్రనే ఉదాహరణ. నిన్న కర్ణాటక... నేడు మహారాష్ట్ర... రేపు తెలంగాణ, ఆంధ్రా వంతూ రావచ్చేమో.. తస్మాత్ జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
- ఊరగొండ మల్లేశం