Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో తల్లిమందలించిందని కూతురు ఆత్మహత్య......
సెల్‌ఫోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య....
ప్రేమవిఫలం అయిందని ప్రేమికుల ఆత్మహత్య...
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య....
సీట్ రాలేదనో పాస్ కాలేదననో విద్యార్థి ఆత్మహత్య......
ఇలా చూస్తే కారణం చిన్నదా, పెద్దదా అనిలేదు, పరిష్కారం అవుతదా, కాదా అనిలేదు... క్షణికావేశంలో ప్రాణం తీసుకుంటన్నవారు రోజు రోజుకు పెరుగుతున్నారు.
2016 ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం, భారతదేశంలో లక్షమంది జనాభాలో పురుషుల ఆత్మహత్యల రేటు 18.5గా ఉండగా, మహిళల ఆత్మహత్య రేటు 14.5గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం, ప్రతిసంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 16ఏండ్ల వయసు నుంచి 30ఏండ్ల వరకు మరణించిన యువతను పరిశీలిస్తే, అత్యధిక సంఖ్యలో మరణాలకు రోడ్డు ప్రమాదాలు కారణం కాగా, రెండవ స్థానంలో ఉన్నది ఆత్మహత్యలే. భావిజీవితం ఉన్న యువత ఆత్మహత్యలకు పాల్పడడం చాలా విచారకరం. 30ఏండ్ల నుంచి 45ఏండ్ల వారిలో ఆత్మహత్యలకు కారణం ఏంటని పరిశీలిస్తే వచ్చిన ఫలితాలలో చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సర్వేలలో తెలిసింది.
ప్రేమ, అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, నయంకాని జబ్బులు, తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, ఉద్యోగం దొరకక పోవడం, గౌరవాన్ని, సామాజిక హౌదాను కోల్పోవడం, నిరుద్యోగం, జన్యులోపాలు, కుటుంబంలో ఎవరి అండదండలు లేకపోవడం, వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం, మోసపోవడం, మతిస్థిమితం సరిగ్గా లేకపోవటం, మద్యానికి బానిస కావడం, గొడవలలో ఒకరినొకరు అర్థం చేసుకొకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు. కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నపుడు మందులతో తగ్గని జబ్బులేదని గుర్తించడంలేదు. అలాగే పొదుపు పాటిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించడం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, ఒకరిని చూసి ఒకరు దుబారా ఖర్చులకు, విలాసాలకు ఖర్చు చేసి అప్పులపాలై ఆపై ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందమైన జీవితాన్ని ఉన్నంతలో ఆనందంగా గడిపితే బాగుంటుంది.
కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరులపై పడుతోంది. ఎంతోమంది అనాథలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ విషయాలను ఒక్కక్షణం ఆలోచిస్తే ఆత్మహత్య నుంచి దూరం కావచ్చు. అలాంటి ఆలోచనలు రాకుండా బతకవచ్చు అనే విషయాన్ని గుర్తించాలి.
ఆత్మహత్యలను నిరోధించడానికి స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి సరియైన సూచనలు, సలహాలు అందిస్తే కొంతవరకు నివారించవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనే వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణం జీవితంలో ఉన్న ఆనందాన్ని తెలియచేయాలి. వారి అసలైన సమస్యఏంటో గుర్తించే ప్రయత్నం చేయాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలియచెప్పే ప్రయత్నం చేయాలి.
ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు కలిగి ఉండడం, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని మనం భావించాలి. అలాంటి వారితో మాట్లాడుతున్నప్పుడు జీవితములో కష్టాలనుంచి స్ఫూర్తి పొంది విజయం సాధించిన వారిగురించి, ఆ కుటుంబం కోల్పోతున్న పెద్ద దిక్కు గురించి, బతుకుపై ఆశలు కలిగేలా సూక్తులు, మంచి మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు, చిన్న విషయానికే ఆవేశం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి. బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత, ప్రేమ, పరిస్థితులు, జీవితం విలువ, మొదలగునవి గుర్తుకు తెచ్చుకోవాలి. సమస్యలను తల్లిదండ్రులు, మిత్రులు, ఆత్మీయులతో పంచుకోవాలి. ఇలాంటి వారు ఏ విధంగా మరణించాలో తరచుగా ఆలోచిస్తారు. కాబట్టి వారి ప్రవర్తనను గమనిస్తూ ఒంటరిగా ఉండకుండా చూడాలి. ఎక్కువగా పురుగు మందులు తాగడం, ఉరి వేసుకోవడం, ఒంటికి నిప్పంటించుకోవడం, నీళ్లలో మునిగిపోవడం ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వారిని ఒంటరిగా లేకుండా చూడడం వల్ల కొంతవరకు నివారింపవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆత్మహత్యలను పరిశీలించిన బృందం మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందులో ముఖ్యంగా వివాహితుల్లో భార్యల కన్నా భర్తలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేలింది. సమస్యనుంచి తప్పించుకోవడానికి చేసే ఆత్మహత్యలు, ఒక్క క్షణం పరిష్కారం కోసం ఆలోచించడం వల్ల కుటుంబ సభ్యులను కోల్పోకుండా చూడవచ్చు.
''వేల మంది జనం తమ బుద్ధి కుశలతను, తెలివితేటలను అసహనంతోనూ, తొందరపాటుతోను, దిగులుతోను వృథా చేస్తున్నారే తప్ప నిజమైన పనులలో ఉపయోగించడం లేదు.
భారతదేశంలో గంటకు 14ఆత్మహత్యలు జరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. హిందూ ధర్మశాస్త్రాలే కాకుండా ఇతర మత గ్రంథాలు కూడా ఆత్మ హత్యను మహాపాతకంగా తెలియచేసాయి. ఆత్మహత్యలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 45వ స్థానంలో ఉండగా, శ్రీలంక 12వ స్థానంలో ఉంది.
- రఘుపతిరావు గడప
సెల్:9963499282