Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయాన్ని కార్పొరేట్ వాళ్లకు అప్పజెబుదాం.. విద్యుత్‌ను ప్రయివేటీకరిద్దాం... రైళ్లు, విమానాలు, బ్యాంకులు, పోస్టల్... ఇలా అన్నింటినీ తాకట్టు పెడదాం. గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేద్దాం... పెట్రోల్ రేట్లను రోజుకోసారి, అవసరమైతే గంటకోసారి హైపీచ్‌లోకి తీసుకెళదాం... ఇదీ ఇవ్వాల్టి పాలకుల తీరు, తెన్నూ. ఇదేం పద్ధతంటూ కాస్త బుర్రున్న వారైవరైనా వీటి గురించి ప్రశ్నించారా..? ఇక వారి పని అయిపోయినట్టే. సామాజిక మాధ్యమాల్లో బండ బూతులు తిడుతూ నానా రభస చేయటం మామూలైపోయింది అరవీర భయంకర భక్తులకు. ఈ బాపతు వీరాధివీరులకు భిన్నంగా కొంత సాఫ్ట్ కార్నర్‌లో 'ఏం అమెరికావాడు, చైనా వాడే మనల్ని దోచుకోవాల్నా...? ఈ దేశంలో పుట్టి పెరిగిన అంబానీ, ఆదానీలు దోచుకుని దాచుకుంటే తప్పేంటి...' అంటూ మరికొందరు తమదైన శైలిలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాసి పారేస్తున్నారు. ఈ విశ్లేషణాధీశుల గురించి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యాలయంలో చర్చ జరిగినప్పుడు... అక్కడున్న ఒక సీనియర్ అధికారి అందుకుని... 'అవును, నిజమే ప్రయివేటీకరణ చేస్తే తప్పేంటి..? పర్మినెంట్ ఉద్యోగాలిచ్చి, లక్షలకు లక్షలు జీతాలిస్తుంటే ఎంతమంది నిజాయితీగా అంకితభావంతో పని చేస్తున్నారు. అదే ప్రయివేటు ఉద్యోగమైతే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తరు... అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి...' అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలువిని జర్నలిస్టులు అవాక్కయిన తరుణంలో మళ్లీ అదే ఆఫీసరు అందుకుని...' నేను చెప్పేదేమంటే... ప్రయివేటీ కరణ చేస్తే ఫలితాలు బావుంటాయి, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందంటూ మన ప్రభువులు చెబుతున్నారు కాబట్టి... అన్ని రంగాలతోపాటు పార్లమెంటును, అసెంబ్లీని కూడా ప్రయివేటీకరిద్దాం... ప్రయివేటు జాబుల్లో తక్కువ జీతాలు ఉంటాయి కాబట్టి, మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా రూ.30 వేలు, రూ.40 వేలే జీతాలిద్దాం. వారిలో పని చేయని వారు, ప్రజల బాధల గురించి, దేశం గురించి ఆలోచించని వారే అత్యధిక మంది ఉంటారు కాబట్టి... అలాంటి వారిని మన ఇష్టమొచ్చినప్పుడు జాబుల్లోంచి తొలగిద్దాం(రీకాల్). ఓ పనైపోతుంది...' అంటూ ముక్తాయింపునిచ్చారు. ఆయన మాటల్లోని సారాంశం అర్థమైన పాత్రికేయులు... 'సూపర్ సార్...' అనుకుంటూ అక్కడి నుంచి కదిలారు.
- బి.వి.యన్.పద్మరాజు