Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సరం జనవరి 24న అంటే జాతీయ బాలికా దినోత్సవం రోజున, ప్రజలందరూ దిగ్భ్రాంతిచెందే ఒక సంఘటన జరిగింది. అత్యంత విద్యావంతులైన తల్లిదండ్రులు, విద్యావంతులైన తమ కూతుళ్ళనిద్దరీ తలమీద మోది హత్యచేశారు. ఈ హత్యలకు ఆ ఆడపిల్లలిద్దరూ సహకరించడం మరింత ఆశ్చర్యకరం. ఆ కుటుంబసభ్యులందరూ పునర్జన్మలను నమ్మడం, తమను తల్లిదండ్రులు చంపితే, తాము మరల పున్మర్జన్మనెత్తుతామని ఆ యువతులు తాము నమ్మి, తల్లిదండ్రులను నమ్మించడం జరిగింది. ఈ సంఘటనతో అనేక మూఢనమ్మకాలు ముడిబడి ఉన్నాయి. అంతకు కొద్దిరోజుల క్రితం ఆ యువతులలో ఒకరు నాలుగు రోడ్ల కూడలిలో పారవేయబడ్డ నిమ్మకాయలు, పసుపు, కుంకాలను తొక్కాననీ, అందువలన తనకేదో దయ్యం పట్టిందని భావించి బెదిరిపోసాగింది. దానికి విరుగుడుగా ఒక మంత్రగానిని పిలిపించి, దారాలూ, తాయెత్తులను తల్లిదండ్రులు కట్టించడం జరిగింది. అంతే కాదు, వారందరూ జనవరి 24న కలియుగం అంతమవుతుందని నమ్మారు. కాబట్టి ఆ రోజున తమ బిడ్డలను చంపితే, వారు 25వ తేది నాటితో ప్రారంభమయ్యే కృతయుగంలో, స్వచ్ఛమైన బాలికలుగా పునర్జన్మ నెత్తుతారని నమ్మారు. అలా నమ్మిన ఆ కుటుంబంలో తండ్రి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఉండి, మదనపల్లిలోని ప్రభుత్వ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తల్లిది మాథ్స్‌లో మాస్టర్ డిగ్రీ, పైగా గోల్డ్ మెడలిస్టు. ఆమె ఐఐటి కోర్సులో చేరదల్చుకున్న వందలాది మంది విద్యార్థుల కోచింగ్ సెంటర్‌కు కరస్పాండెంట్. వారు ఇలాంటి మూఢ నమ్మకాలను తమ బిడ్డలకే కాకుండా, మరింకెన్ని వందల మంది విద్యార్థులకు నూరిపోశారో తెలియదు. విద్యాధికులలో ఇంత భయకరమైన మూఢనమ్మకాలు ఎందుకు ఉంటున్నారు? అసలిదొక్కటే పొరబాటున జరిగిన సంఘటనా? మన సమాజంలో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయా? పరిశీలిద్దాం..
2009లో ఆదిలాబాద్‌జిల్లా శివనూర్ గ్రామంలో మహాశివరాత్రినాడు ఇద్దరు శివభక్తులు గొంతులు కోసుకుని ఆత్మార్పణ చేసుకున్నారు. కారణం? పురాణాల్లో లాగా తమను శివుడు బతికిస్తాడనే మూఢనమ్మకం. కర్నాటకలో ఒక థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి సరిగా లేదని, అత్యంత విద్యాధికులైన ఆ కేంద్రం ఇంజనీర్లు ఒక మంత్రగాణ్ణి ఆశ్రయించగా, అతడు విద్యుత్ కేంద్రం ప్రహరీగోడకు రాగితీగ చుడితే దోషం పోతుందని చెబితే వారు దానిని ఆచరించారు. విద్యుదుత్పత్తి ఏమీ పెరగలేదు! గొప్ప శాస్త్రవేత్తయైన అబ్దుల్ కలాం శూన్యం నుంచి బూడిదను సృష్టిస్తానని చెప్పుకొనే సత్యసాయిబాబాకు పాదాభివందనం చేశాడు. అలాగే 15.10.94న ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రధాన పరిపాలనా భవనం నాలుగుమూలలా నాలుగు మేకలను, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ల సమక్షంలో బలివ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి 13.10.2009 నాటి వార్త ప్రకారం ఇద్దరు డీఆర్‌డీఏ సీనియర్ శాస్త్రజ్ఞులు, ఒక జూనియర్ శాస్త్రజ్ఞుడ్ని తమకు పదోన్నతులు కలిగిస్తుందనే నమ్మకంతో బలియ్యబోయారు. ఇక వేలాది మంది విద్యాధికులు వాస్తు అనే ఒక అవాస్తవిక అంశాన్ని శాస్త్రంగా నమ్ముతూ తమ ఇళ్ళూ వాకిళ్ళూ ఎలా కూలగొట్టుకుంటున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇలా విద్యాధికులలో కూడా మూఢనమ్మకాలు ఉండటానికి కారణాలేమిటి? పరిశీలిద్దాం... మొట్టమొదటి కారణం మన విద్యా విధానంలో ఎక్కడా శాస్త్రీయ అవగాహనను పెంచే అంశం ఒక్కటీ లేకపోవడం. ఆ అంశం ఒక్కటీ లేకపోగా, అశాస్త్రీయ అంశాలు వందల సంఖ్యలో ఉంటూ, విద్యార్థుల మనసుల్ని అశాస్త్రీయతతో నింపేస్తున్నాయి. ఉదాహరణకు పర్వతానికి ఒక కూతురు పుట్టిందనీ, ఆమెను శివుడు వివాహం చేసుకున్నాడనీ 9వ తరగతిలో తెలుగుపాఠం(7వపేజీలో) ఉంది. అదే తరగతిలో, మరో పాఠంలో (52వ పేజీలో) స్వర్గనరకాలు ఉన్నాయనీ, సురభిమల్లుడనే రాజు వైభవంలో స్వర్గానికి అధిపతియైన ఇంద్రుని మించినవాడు అనీ చెప్పబడింది. ఇలాంటి అశాస్త్రీయ అంశాలతో నిండిన పాఠాలను మనసుకెక్కించుకున్న భావి భారత పౌరులు ఎలా శాస్త్రీయ భావాలు చెవికెక్కించుకుంటారు?
విద్యార్థులలో అశాస్త్రీయ భావాల వ్యాప్తిలో కొందరు టీచర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మా బంధువర్గంతో కర్నాటకలోని అనేక స్థలాలు దర్శించాను. వాటిలో కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. బంధువులు దైవదర్శనంలో మునిగిపోతే, నేను ఇతర విషయాలవైపు కేంద్రీకరించాను. వాటిలో నన్నాకర్షించిన ఒక విషయం ఏమిటంటే, ప్రతి దేవాలయానికీ 3,4 స్కూళ్ళ విద్యార్థులు వందలాది మంది వచ్చారు. వారి స్కూలు వివరమడిగి, తాము ఎందుకు దేవాలయాలకు వచ్చారో కారణమడిగితే, వాళ్ళు ''మేము ఎక్స్‌కర్షన్‌గా వచ్చాము. మా టీచర్లు తీసుకువచ్చారు'' అని సమాధానమిచ్చారు. ఎక్స్‌కర్షన్ అంటే విజ్ఞానయాత్ర. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఆ విజ్ఞాన యాత్రలకు ప్రభుత్వం కొంత డబ్బు కేటాయిస్తుంది. కాని అలాంటి విజ్ఞానయాత్రలను కూడా కొందరు టీచర్లు తీర్థయాత్రలుగా మార్చివేస్తున్నారు. మరో విచిత్రం ఏమిటంటే, బెంగుళూరులోని 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్సు సెంటరు'కు నేను వెళ్ళి ఒక రోజంతా గడిపాను. ఆ సైన్సు సెంటరుకు రోజు మొత్తంలో ఒక్క స్కూలు బృందమైనా రాలేదు. ఇక విద్యార్థులలో విజ్ఞానం, శాస్త్రీయ అవగాహన ఎలా పెరుగుతాయి?
మేము చైనా పర్యటన చేశాం. అక్కడ ఒకరోజు నాన్‌జింగులోని ఒక సైన్స్ సెంటరుకు వెళ్ళాము. ఆరోజున అక్కడికి దాదాపు 15 స్కూళ్ళ విద్యార్థులు వేలాది మంది వచ్చారు. అక్కడి ప్రభుత్వం, టీచర్లు విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంచడానికి చేస్తున్న కృషిని కండ్లారా చూశాం.
ఈ రోజుల్లో పౌరులపై టీవీ చానళ్ళ ప్రభావం అధికంగా ఉంటోంది. కాని అవి ఏం ప్రచారం చేస్తున్నాయి? జ్యోతిష్యం, వాస్తు, రంగురాళ్ళు, ప్రవచనాలపేరు మీద పురాణాలలోని అశాస్త్రీయ అంశాలు, ధర్మ సందేహాలకు సమాధానాల పేరుమీద ఆధునిక మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక వేళ అశాస్త్రీయ అంశాలపై కార్యక్రమం పెట్టినా, దానిని చర్చా కార్యక్రమంగానే మార్చి, సైన్సు వాదులతో బాటు అశాస్త్రీయవాదులను కూడ చర్చలో చేర్చి, వీక్షకుల మనసులలో గందరగోళాన్నే మిగుల్చుతున్నారు.
ఈ మూఢనమ్మకాలు సమాజంలో ఎప్పటి నుంచి ఉన్నాయి? క్షుద్రవిద్యలు మన సమాజంలోకి ఎప్పుడు ప్రవేశించాయి? బాధాకరమైన సత్యమేమిటంటే ఇవి మన సమాజంలో అధర్వణవేద రచనా కాలం నుంచీ ఉన్నాయి.
క్రమంగా ఆ మూఢనమ్మకాలు పెరిగాయి. ఈ రోజుకి ఇంత వికృత రూపం దాల్చాయి. ఆధునిక విద్యావంతుల మనస్సులపై కూడ తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయి.
ఈ మూఢనమ్మకాలను నిర్మూలించే కృషిని గతంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, హేతువాదులు చేశారు. ప్రస్తుతం సైన్సువాదులు చేస్తున్నారు.
గతంలో అలాంటి కృషిని చేసినవారిలో చార్వాకులు ప్రధములు. వారు ఆత్మ అనే అలౌకిక పదార్థం లేదన్నారు. మరి ప్రాణుల్లో చైతన్యం ఎలా పుడుతుంది? అనే ప్రశ్నకు వారు ఇలా సమాధానం చెప్పారు.
శ్లో|| జడ భూత వికారేషు, చైతన్యం యత్తు దృశ్యతే
తాంబూల పూగ చూర్ణానాం, యోగద్రావ ఇవోత్థితంః||
అంటే ''తమలపాకు, వక్క, సున్నం కలయికతో ఎర్రరంగు ఎలా పుడుతుందో జడ పదార్థాలుగా నింగి, నేల, నీరు గాలి అనే నాలుగు భూతాల మేళవింపుతో ప్రాణుల్లో చైతన్యం పుడుతుంది'' అని అర్థం. కాబట్టి ఆత్మేలేనప్పుడు దయ్యాలు లేనట్టే అని వారన్నారు.
ఆ తర్వాతివారిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన అగ్రగణ్యులు. వీరభబ్రహ్మంగారు మంత్రతంత్రాలను చీల్చి చెండాడుతూ
''మంత్ర తంత్ర యంత్ర మహాత్మ గాధలు / భారతీయులకును భారమాయె
జనుల పాలిటికివె శాపనార్థములాయె / కాళికాంబ! హంస! కాళికాంబ'' అంటారు. అంటే ''భారతీయులకు మంత్రాలు, తంత్రాలూ, తాయెత్తులు భరింపలేని వయ్యాయి. ప్రజలు పాలిటి శాపాలయ్యాయి'' అని అర్థం.
అలాగే వేమన పెళ్ళిళ్ళకూ, ఇతర కార్యాలకూ పెట్టే ముహూర్తాలనూ, చదివే మంత్రాలనూ తీవ్రంగా నిరసిస్తూ..
''విప్రులెల్లజేరి, వెర్రికూతలు కూసి / సతిపతులను గూర్చి సంబరమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా / విశ్వదాభిరామ వినురవేమ|| అంటాడు.
ఆధునిక కాలంలో స్వామి వివేకానంద జ్యోతిష్యాన్ని నిరసిస్తూ ''మాన్, ది మేకర్ ఆఫ్ వాజ్ డెస్టినీ'' అనే ఉపన్యాస మిచ్చారు. ఇది ''వివేకానంద కలెక్టెడ్ వర్క్స్, 8వ వాల్యూం''లో ఉన్నది. అలాగే కందుకూరి వీరేశలింగం గారు తన జీవితమంతా ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. అనేక రచనలు చేశారు.
ఈనాడు కూడ సైన్సు వాదులు ఈ అంధ విశ్వాసాలకు, మూఢ హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ వ్యాసరచయితనైన నేను కూడా దయ్యాలు లేవని నిరూపించడానికి అమావాస్యనాడు, అర్థరాత్రి ఒంటరిగా స్మశానానికి వెళ్ళివచ్చాను. దయ్యాలున్నాయని చెప్పబడే ప్రదేశానికి ఈ విద్యార్థులను తీసుకువెళ్ళి, అవి లేవని నిరూపించాను. (అవన్నీ ''మూఢ విశ్వాసాలు - సైన్సు సమాధానాలు'' అనేక పుస్తకంలో వివరంగా తెలియజేయబడ్డాయి.) ఇలా అనేక మంది అనాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నా, ఈ మూఢనమ్మకాలు మన సమాజం నుంచి తొలగిపోలేదు.
మరి ఈ మూఢ హత్యలు ఆగేదెప్పుడు? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల, ముఖ్యంగా, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? చర్చిద్దాం.
మొట్టమొదటగా ప్రభుత్వం మన రాజ్యాంగంలోని 51ఎ(హెచ్) ప్రకరణాన్ని అనుసరించి శాస్త్రీయ భావాలను, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రజలలో పెంచే ప్రయత్నాలు చేయాలి. 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలను కథలుగా, సంఘటనలుగా, నాటికలుగా చొప్పించాలి. అశాస్త్రీయ అంశాలను తీసివేయాలి. విద్యార్థుల విజ్ఞాన యాత్రలను ప్రోత్సహించాలి. విద్యార్థులకు మూఢనమ్మకాల వలన నాశనమవుతున్న వారి బాధల గాథలను వివరించాలి.
కాని ప్రస్తుత ప్రభుత్వం దీనికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నది. సాక్షాత్తు ప్రధానమంత్రే వినాయకుడి కథ వాస్తవమనీ, ఆ కథలో చెప్పబడిన వినాయకుడికి ఏనుగుతల తగిలించబడిందనే విషయం ఆకాలంలోనే మనకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసుననే విషయాన్ని నిరూపిస్తుందనీ అనడం అశాస్త్రీయతకు పరాకాష్ట. అలాగే జ్యోతిషం, వాస్తులను కొంత కాలం క్రితమే డిగ్రీ కోర్సులుగా ప్రవేశపెట్టింది. దిగ్భ్రాంతి కరమైన విషయం ఏమిటంటే ఇటీవల ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ 'భూతవిద్య'ను ఒక కోర్సుగా ప్రవేశపెట్టింది. ఇది ఎంత అశాస్త్రీయం?
అలాగే టీవీ ఛానళ్ళలో వచ్చే అశాస్త్రీయ అంశాలను తీసివేసి, శాస్త్రీయ అంశాలను ప్రసారం చేయాలని, వారిపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. దాని కొరకు మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావడానికి ఉద్యమించాలి. అప్పుడే మూఢనమ్మకాల ప్రసారాలకు అడ్డుకట్టపడుతుంది.
చివరిగా తల్లిదండ్రులు శాస్త్రీయ భావాలను పెంచుకొని, తమ బిడ్డలకు శాస్త్రీయ అంశాలనే వివరించాలి. అలా జరగనిపక్షంలో మదనపల్లి ఘటనలూ, శివనూర్ ఘాతుకాలూ మరల మరల జరుగుతూనే ఉంటాయి.
- కెఎల్ కాంతారావు