Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా జీవనంలో పెనవేసుకున్న ఎన్నో సంస్కృతిక - జానపద ప్రజా కళారూపాలు కాలగర్భంలో కల్సిపోతున్నాయి. దొంగ ఎవరో? శత్రువు ఎవరో? తెలుసుకోలేని (దు)స్థితిలో ప్రజలున్నారు. ప్రభుత్వాలే ప్రజల్ని మోసం చేస్తున్న (కరోనా) కష్టకాలంలో బతుకుతున్నాం!! పాలకుల్ని ప్రశ్నించే జనచైతన్యం ఇప్పుడు కావాలి-రావాలి!! ప్రజా కళా రూపాల పరిరక్షణకు జనమే నేడు ఉద్యమించాలి. వ్యర్థజీవులు, స్వార్థ జీవులు, ''సార్థజీవులు'' మన సమాజంలో నిరంతరం ఉంటారు. మూడోరకం జీవుల్లో ప్రజల కోసం, ప్రజాచైతన్యం కోసం, ప్రజా కళారూపాల పరిరక్షణ కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసిన డాక్టర్ గరికపాటి రాజారావు ఒకరు. ప్రజా నాట్యమండలి స్థాపకునిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ ''ఇఫ్టా'' కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకరుగా, రచయితగా, దర్శకునిగా, ప్రజా వైద్యునిగా, తొలితరం నాటక ప్రయోక్త బళ్ళారి రాఘవ శిష్యునిగా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా, సినీ కధానాయకునిగా, నిర్మాతగా, సినీ దర్శకునిగా, బహుముఖ ప్రజ్ఞావంతుడు రాజారావు.
106ఏండ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గరికపాటి సోమయ్య దేవర సోమలింగమ్మ దంపతులకు 1915 ఫిబ్రవరి 5న జన్మించారు. విద్యార్థి దశలో నాటకాల్లో నటించారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు ఆటకి, పాటకీ తాళం వేసి ఆయన మెప్పు పొందిన రాజారావు అనతికాంలోనే గొప్ప నట దర్శక ప్రయోక్త అయ్యారు. వీరి తండ్రి లాలాగూడ రైల్వే వర్క్‌షాపులో చిరు ఉద్యోగి. సికింద్రాబాద్‌లోని నాటక సమాజాల్లో తొట్టతొలిగా సత్యహరిశ్చంద్ర నాటకంలో ''మాతంగ కన్య'' పాత్రలో నటించారు. ఎస్.ఎస్.ఎల్.సీ. చదివి, తండ్రి పనిచేసే వర్క్‌షాపులో ఉద్యోగంలో చేరాడు. 15ఏండ్లకే ''నాగేశ్వరమ్మ''తో ఆయన వివాహం జరిగింది. తరువాత మద్రాస్‌లో ఎల్.ఈ.ఎం. కోర్సుల్లో పట్టాపొందారు. గుళ్ళపల్లి నారాయణమూర్తి రాసిన ''విడాకులు'' నాటకానికి తొలిసారి దర్శకత్వం వహించారు. ఎందరో కొత్తవారికి నాటకంలో అవకాశం ఇచ్చారు. ''షాజహాన్'' నాటకం ఆ రోజుల్లో రాజారావుని గొప్ప దర్శకునిగా నిలబెట్టింది. ఈ నాటకానికి ''దేవిప్రసాద్ రారు చౌదరి'' మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం విశేషం. ఆ తర్వాత కాలంలో కుమార్, మోహన్, టీఆర్ అడబాలలు రాజారావుకి మేకప్ ఆర్టిస్టులయ్యారు. మద్రాస్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కాలంలో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (సుందరయ్యగారి సోదరులు), డాక్టర్ రామదాసులతో పరిచయం వల్ల రాజారావులో మార్క్సిస్ట్ భావాలకు బీజాలు పడ్డాయి. మిత్రుడు డాక్టర్ కొండలరావుతో కలసి విజయవాడ ''పోరంకి''లో ''ప్రజావైద్యశాల''ను నెలకొల్పారు. వైద్య విద్య అభ్యసిస్తూనే తోటి వైద్య విద్యార్థులలో హాస్యబ్రహ్మ నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు రాసిన ''బాగుబాగు'' గాలి బాలసుందరరావు ''అపోహ'' అనే నాటకాల్ని మద్రాస్‌లో ప్రదర్శించారు. అప్పుడే దర్శకునిగా రాజారావు సాంకేతిక పరిజ్ఞానం కళారంగానికి తెలిసింది. ఎందరో రంగస్థల సినీ స్రష్టల్ని కదిలించింది, ఆశ్చర్యపరిచింది. బొంబాయి వెళ్ళి సినిమా కళను అధ్యయనం చేసారు. తనకు ప్రత్యక్ష గురువైన బళ్ళారి రాఘవ పేరుతో ''రాఘవ కళా సమితి'' స్థాపించి పెక్కు నాటకాలు స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. ''పరితాపం'', ''వీరనారి'' లాంటి నాటకాలూ రాసారు. ఆనాటి మీటింగ్‌లలో రాజారావు శ్రీశ్రీ ''ప్రతిజ్ఞ'' గీతాన్ని భావ, రాగ, తాళ, యుక్తంగా నర్తిస్తూ అద్భుతనటనా కౌశలం ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ''కళ కళ కోసం కాదు - ప్రజల కోసం'' అని నమ్మి ప్రజానాట్య మండలి ద్వారా గ్రామ గ్రామన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వందలాది కళాకారులు, వేలాది మంది ప్రేక్షకులు ఆయన్ని అభిమానించారు. ఆరాధించారు. ఎందర్నో కమ్యూనిస్ట్‌లుగా, మరెందర్నో కమ్యూనిస్టుల్ని కళాకారులుగా మలచిన గొప్ప సాంస్కృతిక ''సేనాని'' రాజారావు. సైన్యం దేశానికి సాంస్కృతిక సైన్యం సమాజానికి అవసరం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సామ్యవాద సిద్ధాంతాన్ని కళారూపాలుగా ప్రదర్శించి జన జాగృతం చేసారు. సాంప్రదాయ సిద్ధంగా గల కూచిపూడి నృత్య దరువులతో ''హిట్లర్ భాగోతం'', సిమ్లా భాగోతాలను అద్భుతంగా ప్రదర్శించారు. హిట్లర్ భాగోతంలో పతాక సన్నివేశంలో.. కొడవలితో హిట్లర్ మెడలాగి, సుత్తితో నెత్తిమీద మోది హతమార్చే సన్నివేశంలో ఎర్రసైనికునిగా రాజారావు నటనకు జనం జేజేలు పలికి, వారూ నర్తించేవారట!!
1944 అరసం మహాసభల్లో విజయవాడ ప్రజానాట్యమండలి ''కన్యాశుల్కం'' నాటకాన్ని ప్రదర్శించింది. నాటి కమ్యూనిస్ట్ నేతలే అందులో వివిధ పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు. రాజారావు ''గిరీశం'', కంభపాటి సత్యనారాయణ ''రామప్ప పంతులు'', తుమ్మల వెంకట్రామయ్య ''సౌజన్యరావు'', జోస్యభట్ల సత్యనారాయణ ''అగ్ని హౌత్రావధాన్లు'', కొమర్రాజు పద్మావతి ''బుచ్చమ్మ'', జ్యోస్యభట్ల సుబ్బమ్మ ''వెంకమ్మ''గా, కొండపల్లి కోటేశ్వరమ్మ ''మీనాక్షి''గా నటించారు. ఆ నాటక దర్శకునిగా రాజారావు అద్భుత ప్రతిభ చూపారు. నాటకంలో సర్కులర్ మూమెంట్, పారలర్ మూమెంట్, యాంగ్యులర్ మూమెంట్, తొట్టతొలిగా ప్రవేశపెట్టిన ఘనత రాజారావుదే. సర్వేపల్లి రాధాకృష్ణన్ (రాష్ట్రపతి) వీరి ''జై భవానీ'' నాటకం చూసి ఎంతో ప్రశంసించారు. పాత్రల కదలికలు.. హావభావ వ్యక్తీకరణలు.. రంగస్థలంపై నడక, తెరలో పలికే వ్యంగ్య ప్రకటనలు, నాటకాన్ని ఎంతగానో రక్తికట్టించేవి. సృజనాత్మకత, సమిష్టతత్వం, జనచైతన్యం అనే మూడు అంశాలు కళాకారులకు చెప్పేవారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావులు రాసిన ''మా భూమి'' - ''ముందడుగు'' నాటకాలు రాజారావు దర్శకత్వంలో అపూర్వంగా ప్రదర్శింపబడ్డాయి. మాభూమి నాటకంలో రాజారావు ''పట్వారీ వెంకట్రావ్'' పాత్ర ధరించారు. ఈ నాటకం సంచలనాలకు చిరునామాగా మారింది. మద్రాస్‌లో ప్రదర్శన చూసిన ''రాజాజీ'' నిషేధించాడు. ఈ నాటకాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఆయన రిహార్సల్స్ ఓ రంగస్థల విశ్వవిద్యాలయం. ఓ కళారంగ ప్రయోగశాలే అంటే అతిశయోక్తి లేదు.
భారతీయ నాటక రంగంలో గొప్పవారైన ఫృధ్వీరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, నరన్గీస్, రాజ్‌కపూర్, శంభుమిత్రా, కె.ఏ. అబ్సాస్ లాంటి వారు రాజారావు దర్శకత్వం, నటన ప్రతిభను ప్రశంసించి అభినందించారు. ఆయన చైతన్య దృష్టి కోణాల్ని శ్లాఘించారు. అంతరించిపోతున్న దాదాపు 40 జానపద కళారూపాల్ని వెలికితీసి ప్రజానాట్యమండలి దళాలచే ప్రదర్శింపజేసారు. ఆత్రేయ రాసిన పరివర్తన, ఈనాడు, భయం నాటకాలు ''ఆంధ్ర నాటక కళా పరిషత్‌లో పెక్కు బహుమతులు పొందాయి. పోతుగడ్డ, అల్లూరి సీతారామరాజు, జైభవానీ, అపనింద, ప్రెస్‌వర్కర్ లాంటి నాటకాలు అద్భుత దర్శకత్వ ప్రతిభతో ప్రదర్శించారు.
1948లో కమ్యూనిస్టు పార్టీని ''ఇఫ్టా''తో సహా దాని ప్రజా సంఘాలన్నింటినీ భారత ప్రభుత్వం నిషేధించి క్రూర నిర్బంధాన్ని అమలు చేసింది. నాటి పళనియప్పన్ పోలీసు క్యాంపులో.. ఎన్నో చిత్రహింసలకు రాజారావు గురి అయ్యారు. వారితో ప్రజానాట్యమండలి దళ సభ్యులు ఖైదుకాబడ్డారు. అప్పుడే ఎందరో కళాకారులు.. అజ్ఞాతంలోకి.. మద్రాస్‌కి వలస వెళ్ళారు. కోరాడ నరసింహారావు (నాట్యాచార్యులు) నేరేళ్ళ వేణుమాధవ్ (మిమిక్రి), సంపత్‌కుమార్ (ఆంధ్ర జాలది) లాంటి వారు జాతీయ కళా వేదికపై ప్రదర్శనలు ఇచ్చి ప్రఖ్యాతులైయ్యారు. సినీ - నాటక రంగంలో స్టార్స్‌గా వెలుగొందిన వారంతా రాజారావు శిష్యులే కావడం గొప్ప విషయం. రాజారావుగారే మిక్కిలినేని, కర్నాటి, తాతినేని చలపతిరావు, కొడూరి అచ్చయ్య, ఆత్రేయ, దైతాగోపాలం, కైకాల సత్యనారాయణ, కాకరాల, రాజబాబు, చలం, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య, జమున, దేవిక, మోహన్‌దాస్, వేణుగోపాల్ (నృత్యం) ఫన్ డాక్టర్ చంద్ర శేఖర్, బి. గోపాలం, అడబాల, కుమార్ - నాజర్, జైహింద్, సత్యం, వల్లం నరసింహారావు ఇలా ఎందరో.. రాజారావు కళా దర్శకత్వంలో శిక్షితులైనవారే!! స్టార్స్‌గా వెలుగొందారు. రాజమండ్రిలో రాఘవ కళాసమితి పేర నాటకాలు వేయడమే గాక, చక్కటి గ్రంథాలయం పెట్టారు రాజారావు. కళాధర్మాలు - కళా మర్మాలు, నటన - పాత్రోచిత ప్రదర్శన - చైతన్య శీల ప్రయోగాలు అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు సిలబస్ లాంటివి. ''దేవుడు చేసిన మేలు'' చిత్రం ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయింది. వారే నిర్మాత. 'కళే' ఊపిరైన రాజారావు 1963 సెప్టెంబర్ 8న జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. వారు చూపిన బాటలో సాగటమే ఆయనకిచ్చే నివాళి..
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472