Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీకి రాజైనా.. కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా... తల్లికి మాత్రం ఇంకా చంటి పిల్లాడేనంటుంటారు మన పెద్దలు. ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నవారైనా తన మాతృమూర్తి దగ్గర మాత్రం ఒదిగిపోయి ఉండటం పరిపాటి. అలాంటి తల్లితో సమానంగా పుట్టిన ఊరుపైనా, సొంత ప్రాంతంపైనా మనందరమూ మమకారం చూపుతుంటాం. ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో దానిపై మనకు తెలియకుండా అభిమానాన్ని, ప్రేమనూ కురిపిస్తుంటాం. బహుశా అదే అభిమానం, ప్రేమ పాళ్లు కాస్త ఎక్కువైనట్టున్నాయి ఢిల్లీలో ఉన్న మన తెలుగు పెద్దలకు. తెలంగాణ, ఏపీకి చెందిన ఓ డజను మంది ప్రముఖులు ఢిల్లీలో ఉన్నత పదవుల్లో ఉండి, దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే దసరా దగ్గర్నుంచి ఇప్పటి దాకా వారు అదే పనిగా హస్తిన నుంచి హైదరాబాద్‌కు... హైదరాబాద్ నుంచి హస్తినకు విమానంలో చక్కర్లు కొడుతున్నారు. అది కూడా పదిహేను రోజులకోసారి. ఇలా రెండు వారాలకోసారి వారు రయ్యున దూసుకు రావటాన్ని చూసి... ఆహా సొంత ప్రాంతంపైన వల్లమాలిన అభిమానం కాబట్టే వాళ్లు ఢిల్లీలో ఉండలేక... ఇలా పక్షానికోసారి వచ్చి పోతున్నారు, ఎంతైనా మహానుభావులు అనుకుంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మన జనాలు. ఇదే కోవలో ఉత్తరాదిన ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లిన తెలంగాణకు చెందిన పెద్దాయన కూడా పది, పదిహేను రోజులకోసారి హైదరాబాద్‌లో దిగటం, రెండు రోజులుండటం, మళ్లీ ఫ్లైటెక్కటం ఆనవాయితీగా మారింది. ఆయన్ను కూడా ఇదే రకంగా ప్రశంసలతో ముంచెత్తుతుండగా... 'పుట్టిన ఊరుపై ప్రేమా..? పాడా...? ఉత్తరాదిన గడ్డకట్టుకు పోయే చలి ఉంది. అది డిసెంబరు నెలలో మైనస్ డిగ్రీలకు పడిపోయింది. అక్కడుంటే కరోనా రాకపోయినా చలికే ఒళ్లు గడ్డ కట్టుకుని ప్రాణాలు పోవటం ఖాయం... అందుకే డాక్టర్ల సలహా మేరకు అక్కడ ఉండలేక, సేఫ్టీ కోసం మా సారు భాగ్యనగరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నడు...' అంటూ అసలు విషయం చెప్పారు ఆయన అనుంగు శిష్యులు. సో.. మిగతా పెద్దోళ్లంతా కూడా ఢిల్లీ శీతల గిడ్డంగుల్లో ఉండలేకే కాస్త చలిమంట కాచుకోవటానికి దక్కన్ పీఠభూమి మీదికి వస్తున్నారన్నమాట...
- బి.వి.యన్.పద్మరాజు