Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరెంటు, ఇంటి రెంటు, రైస్, వంట గ్యాస్... నెలొస్తే చాలు, ఇలా ప్రతీ దానికి మనం లెక్కలేసుకుంటుంటాం. వేతన జీవులైతే వచ్చే జీతానికీ, పెట్టే ఖర్చుకూ పకడ్బందీగా ఆలోచించుకుని మరీ డబ్బుల్ని సర్దుబాటు చేసుకుంటుంటారు. అయితే గత కొన్నేండ్ల నుంచి సాధారణ దిగువ తరగతి మానవుడి నుంచి ఉన్నత తరగతికి చెందిన వారి వరకూ ప్రతీది పక్కాగా, ప్రణాళికాయుతంగా ఖర్చు పెడుతూ, భవిష్యత్ ప్లాన్లు వేసుకుంటూ పోతున్నారు. నెలనెలా రావాల్సిన జీతం సకాలంలో వస్తే ఈ ప్రణాళికలూ, ప్లాన్లూ బాగానే వర్కవుటవుతాయి. ఒకవేళ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ వచ్చినా సీను సితారైపోవటం ఖాయం. కరోనా సమయంలో అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ప్రయివేటు సిబ్బంది అందరూ ఈ గోసను అనుభవించిన వారే. ఆ కరోనా, లాక్‌డౌన్ కష్టాలు పోయిన తర్వాత ఇప్పుడు కూడా కొన్ని శాఖలు, విభాగాల్లోని ఉద్యోగులు అదే కష్టాలను అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆర్థికశాఖకు చెందిన ఉన్నతాధికారుల వద్ద ఇటీవల ప్రస్తావించారు. 'పెద్దా, చిన్నా అనే తేడాల్లేకుండా రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగికీ ప్రతినెలా విధిగా ఒకటో తారీఖున వేతనాలు వేయటం ప్రభుత్వ విధి. కానీ ఈ మధ్య తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఠంఛన్‌గా ఒకటో తారీఖున్నే వేతనాలు ఇస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల వరకు వచ్చే సరికి ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకూ విడతల వారీగా శాలరీలు వేస్తున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. 15 నుంచి 20వ తారీఖు వరకూ వారికి జీతాలెయ్యట్లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అది కూడా లేదు. నెలాఖరులో ఎప్పుడో వేస్తున్నారు. ఇది కరెక్టు కాదుగదా...?' అంటూ ఆ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఆ ఉన్నతాధికారి నింపాదిగా... 'చూడండి సార్... మీరు చెప్పిన విషయాలన్నీ నిజమే. కానీ ఈ సీటులో నేనుండ బట్టే... అది ఐదో తారీఖైనా, 20వ తేదీ అయినా ఏ నెలకానెల జీతాలను సర్దుబాటు చేస్తున్నాను. నేనుగాకుండా వేరేవాళ్లు ఎవరున్నా ఆ మాత్రం జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఉండబోదు...' అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అదీ మన ఆర్థిక పరిస్థితి...
- బి.వి.యన్.పద్మరాజు