Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. వేలలో జీతం. బాదరాబందీలేని జీవితం. సాధారణ సెలవులే కాకుండా అధికంగా సెలవులు తీసుకునేవాడు. చావులు, పెండ్లిళ్లు, ఫంక్షన్‌ల కోసం మాములుగానైతే ఉద్యోగులు, కార్మికులెవరైనా సెలవులు అడుగుతారు. సదరు ఉద్యోగి మాత్రం లీవులు తీసుకోవడంలో ప్రత్యేత ఏముంది అంటారా? ఆయన లీవుల కోసం ఏకంగా 36మందిని మర్డర్స్ చేశాడు. మీరు చదువుతున్నది నిజమేనండీ బాబూ... అయితే ఇందులో కొంచెం ట్విస్టు ఉన్నది. ఏ కత్తులతోనో, ఏ తూపాకులతోనో, మరేదో పదునైన ఆయుధంతోనో మర్డర్స్ చేయలేదు. మరెట్లా చేశాడబ్బా అనేే ఆలోచన మొదలైందా? అక్కడికే వస్తున్నా... ఏమీ లేదండీ. ఆయనకు లీవు కావాల్సి వచ్చినప్పుడల్లా నాయనమ్మ, తాతా, అమ్మమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్నా, మామ, అత్త, దూరపు, దగ్గరి చుట్టాలు ఇలా ఒక్కొక్కరు చనిపోయారంటూ ఆవేదనతో సెలవు పత్రం రాసి ఇచ్చేవాడు. పై అధికారి అందుకు కరిగిపోయి ఆయనకు సెలవు మంజూరు చేసేవాడు. ఇలా కాలం గడిచిపోయింది. ఏడాది చివరాఖరులో సీఎల్స్, ఈఎల్స్, ఇతర సెలవులను ఆ అధికారి లెక్కలేశాడు. ఆయనకు ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలిశాయి. ఆ ఉద్యోగిని పిలిచి ఈ సంవత్సరంలో 36మంది కుటుంబ సభ్యులు, బంధువులను చంపేశావయ్యా. వచ్చేయేడాదికి ఇంకెవరైనా మిగిలి ఉన్నారా? ఇదే విధంగా చంపేసుకుంటూ పోతావా..? ఇలాగే చేస్తే రెండేండ్లలో మీకు చుట్టాలెవరూ ఉండరయ్యా... అనడంతో ఆయన సిగ్గుతో తలవంచుకుని ముసిముసినవ్వు నవ్వూతూ అక్కడి నుంచి జారుకున్నాడు. సదరు ఉద్యోగి ప్రస్తుతం రిటైర్ అయ్యాడు. ఇప్పటికీ ఆ సంఘటనను గుర్తు చేసుకుని, తీపి జ్ఞాపకమంటాడు సదరు ఉద్యోగి. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన.
- గుడిగ రఘు