Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్‌కు పేద, ధనిక అన్న వ్యత్యాసమూ లేదు.. కుల,మత, లింగ, జాతి, ప్రాంతం అన్న తేడా కూడా లేదు. విశ్వవ్యాపితంగా అందరినీ ఒకేలా చూస్తున్నది. క్వారెంటైన్, ఐసోలేషన్, హాస్పిటలైజ్డ్ వీటిలోనూ ఏమీ భేదం కనిపించలేదు. కానీ, చికిత్స కోసం ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతుల్లో మాత్రం తీవ్రమైన వివక్ష కనబడుతున్నది. కరోనా యోధులు... ప్రజలకు ఎంతో సేవ చేశారు కాబట్టి వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని మొసలికన్నీరు కార్చుతున్నారు. ఉదారతను ప్రదర్శిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, అటెండర్లు, నర్సులు ఇలా చిరు ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుని వారంతా ఆరోగ్యంగా, సైడ్‌ఎఫెక్ట్ లేకుండా ఉంటే పెద్దలు, ప్రజాప్రతినిధులు వేసుకుంటారు. వ్యాక్సిన్ వస్తే ముందు రాజకీయ నాయకులకు వేయాలనీ, వారికి సరిగ్గా పని చేస్తే అప్పుడు ప్రజలకు వేయాలని నెటిజన్లు డిమాండ్ చేసినా ముందుకు రావడంలేదు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఎందుకు వేసుకోవడం లేదు. కరోనా సృష్టించిన విధ్వంసం చూసి ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. చౌకీదారునంటూ చెప్పుకున్న ప్రధాన మంత్రి తాను వ్యాక్సిన్ వేసుకుని దేశ ప్రజలకు ఆదర్శంగా నిలువవచ్చు. ఎందుకు వేసుకోలేదు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్ వేసుకుంటానంటూ ప్రకటించి వెనక్కి తగ్గారు. సీఎం, మంత్రులు, గవర్నర్, కలెక్టర్లు, ఉన్నతాధికారులు వ్యాక్సిన్‌కు ఎందుకు భయపడుతున్నారు. భయం లేకపోతే ఎందుకు వేసుకోవడంలేదు. వ్యాక్సిన్ ఇస్తున్నామంటూ పేదలపై ప్రయోగం చేస్తున్నారా? వారికే ముందుగా ఎందుకు? వ్యాక్సిన్ వేసుకుని బతికి బట్టకడితే తరువాత వారు వేయించు కుంటారా? కరోనా సమానత్వం ప్రదర్శిస్తుంటే... ఏలికలు మాత్రం మనుషుల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- గుడిగ రఘు