Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలూ (వామపక్షాలు మినహా) అభివృద్ధి ఎజెండాను పక్కనబెట్టేశాయి. కీలకమైన సమస్యలపై చర్చ జరిగితే ప్రజల ఓట్లు ఎక్కడ తమకు దూరం అవుతాయోనని భావించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నేతలను కించపరిచేలా వీడియో మిక్సింగ్‌లు అప్‌లోడ్ చేయడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఒకరినోకరు తిట్టుకుంటూ పబ్బం గడిపే చర్యలను ప్రోత్సహిస్తున్నాయి. మీ చర్యల వల్లనే అభివృద్ధి కుంటుబడింది...మీరు నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఇలా జరిగింది...ఇలా ఒక పార్టీ వాళ్లు మరో పార్టీ వాళ్లమీద ఆరోపణలూ, వ్యక్తిగత దూషణలకు దిగుతూ ప్రజల్ని గందరగోళంలోకి నెడుతున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడేలా ఐటీ సిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం హామీ ఏమైంది? రక్షణ కుండల్లా ఉన్న చెరువులేమయ్యాయి? కాల్వలను ఆక్రమించిదెవరు? భూ ఆక్రమణలు బయటపడ్డా.. కబ్జా దారులు ఏ పార్టీ అండతో బయటపడుతున్నారు? రోడ్ల పరిస్థితేంటి? కాలనీల్లో నెలకొన్న ప్రధాన సమస్యలేంటి? వాటి పరిష్కారానికి తాము చేపట్టబోయే కార్యక్రమా లేంటి?, భవిష్యత్ ప్రణాళికలేమిటి? తదితర కీలక అంశాలపై చర్చే లేదు. నలుగురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తిట్టుకునుడు.. భావోద్వేగాలు రెచ్చగొట్టుడు..ఓట్లు కొల్లగొట్టుడు పద్ధతిలో ముందుకెళుతున్నాయి. ఓటర్ మహాశయులారా! లౌకికవాదం, అభివృద్ధి ఎజెండాలకు ప్రాధాన్యమివ్వండి. ప్రజలపై ఆయా పార్టీలు చూపుతున్న కపట ప్రేమను 'గుర్తు'ఎరిగి ఓటెయండి. మంచి నేతలను ఎన్నుకోండి.
- అచ్చిన ప్రశాంత్