Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) మొదట 4,528 విద్యార్ధులతో రెండు ప్రోగ్రాములతో ప్రారంభమై నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులను నమోదు చేసుకొని, అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ''ఇగ్నో'' సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అంది స్తున్నది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమన్వయం, ప్రమాణాలను నెలకొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన-పరిశోధనలతో పాటు, విస్తరణ, శిక్షణ ప్రధాన అంశాలుగా ఇగ్నో యూనివర్సిటీ పని చేస్తున్నది. ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు కూడా ఇగ్నో సేవలు అందిస్తున్నది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్ధులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొంది ఉన్నత విద్యను అభ్యసించారు. ఇగ్నో, సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ స్థాయిలో కోర్సులను కలిగి ఉన్న 226 పైగా అకాడెమిక్ ప్రోగ్రాం లను మరికొన్ని ఆన్ లైన్ ప్రోగ్రాములు కాకుండా ''స్వయం'' మూక్స్ ద్వారా కూడా అందిస్తున్నది. భారత దేశ దూర విద్య పితామహుడు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలంగాణకే గర్వకారణం.
మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికేట్, డిప్లొమా, పి.జీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధించిన ట్యూషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ బడుగు బలహీన, పేద విద్యార్ధులకు ఆలంబనగా ఇగ్నో కృషి చేస్తున్నది. ఇగ్నోలో స్కిల్ డెవలప్‌మెంట్, నైపుణ్యం, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాముల వల్ల వివిధ రాష్ట్రాలలో ఉన్న ఇగ్నో అభ్యర్ధులు వివిధ జాతీయ స్థాయీ బహుళార్థక కంపెనీలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ఇగ్నో ప్రధాన క్యాంపస్, వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్‌లో కూడా అభ్యర్ధులు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ విషయంలో ప్రాంతీయ కేంద్రాల సంచాలకులు, సహాయ ప్రాంతీయ సంచాలకులు ఇండక్షన్ ప్రోగ్రాంల ద్వారా ఇగ్నో విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ ఆయా రాష్ట్రాలలో దూర విద్య అందరికీ చేరేలా కృషి చేస్తున్నారు. ఇగ్నో వివిధ ప్రోగ్రాంలకు సంబంధించిన కోర్సు మెటీరియల్ ప్రపంచ స్థాయి విలువలతో, అత్యున్నత శాస్త్రవేత్తల, అనుభవమైన ఆచార్యుల రూపకల్పనలో విద్యార్థులకు అందిచబడుతున్నది. ఈ కోర్సు మెటీరియల్ వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయీ పరీక్షలకు, పోటీ పరీక్షలకు రెఫెరెన్సులుగానూ ఉపయోగపడుతున్నది. ఇగ్నో జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం కాబట్టి అన్ని రాష్టాలల, ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా అభ్యర్థులు అనేక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.
కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇగ్నో విద్యార్థులకు ప్రవేశపెట్టిన వివిధ నూతన పద్ధతులు దేశ దూర విద్య సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే ఆదర్శం. ముఖ్యంగా లాకౌడౌన్ సమయంలో అభ్యర్థుల కోసం దేశ వ్యాపంగా ఉన్న అన్ని అధ్యయన కేంద్రాల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. ఈ విధంగా నిర్వహించటం దేశంలో ప్రధమం. సామజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఆన్‌లైన్ తరగతులు, సమాచారం, తదితర లింక్స్ కూడా చేరవేశారు. పాడ్ కాస్ట్, టెలి రేడియో ద్వారా, లైవ్ వెబినార్స్ ద్వారా వివిధ సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహించారు. ఆన్‌లైన్‌లో కొన్ని ప్రోగ్రాముల పరీక్షలు, ప్రాక్టికల్ కూడా నిర్వహించారు. దేశంలో ఈ సార్వత్రిక యూనివర్సిటీ నూతన సాంకేతిక బోధన-అధ్యయన పద్ధతులను ప్రవేశపెట్టి కోవిడ్ సమయంలో కుడా విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రాకుండా చేయడం అభినందనీయం.
ఇగ్నో మొట్టమొదటి ప్రాంతీయ కేంద్రమైన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం తెలంగాణలో వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. హైదరాబాద్ ప్రాంతీయకేంద్రం ప్రత్యేక సొంత భవనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూమిని కేటాయించాలి. ఈ విషయంలో తెలంగాణ ఉన్నత మండలి చొరవ తీసుకోవాలి. దూర విద్య ద్వారా ఉన్నత విద్య బడుగు బలహీనులకు అందిచాలనే లక్ష్యంతో ఈ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం రాబోయే కాలంలో నిరంతరం కృషి చేస్తూ నేడు 35వ ఆరిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నది. ఇగ్నో దేశ ఉన్నత విద్య నమోదులో మరింత కీలక పాత్ర వహించాలనీ, ప్రపంచంలోనే దూర విద్యకు తలమానికంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.
- కె. శ్రవణ్ కుమార్
సెల్:9908843592