Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనుగోలుదారులైన వినియోగదారులలో నాణ్యత, పరిమాణం, ధరలలో నష్టపోయిన వారు వినియోగ దారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తారు. వినియోగదారుల రక్షణ నిమిత్తం మన దేశంలో 1986 నుంచి వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో వినియోగదారుల న్యాయస్థానాలు ఏర్పడ్డాయి. నష్టపోయిన వినియోగదారుడు నష్టపోయిన రెండేండ్లలోపు స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల సమాచార హక్కును ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం దేశమంతటా వినియోగదారులు అనేక సమస్యలు పరిష్కరించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు నిత్యావసర సరుకుల ధరలు-సరఫరా, కరెంటు కొరత, సాగునీరు సమస్యలు, ఆరోగ్య నివాస పథకాల అమలు, సక్రమ విద్యాభ్యాసం మొదలైనవి. 1976లో ప్రవేశపెట్టబడిన తూనికలు, కొలతల చట్టాన్ని అనుసరించి ప్రతీ వస్తువుపై తయారీదారుల చిరునామా, సరుకు వివరం, పరిమాణం, కొనుగోలు ధర, కాలపరిమితి కలిగి ఉండాలి. ఎమ్‌ఆర్‌పీ అనగా కొనుగోలు ధర, నిర్ణీత ధర కాదు. అన్యాయానికి గురికాబడిన వినియోగదారుడు ఫోరంను కానీ, తూనికలు కొలతల అధికారిని కానీ ఆశ్రయించవచ్చు.
వినియోగదారుడు తూనికలు, కొలతల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాపారస్తులు ఇట్టే మోసం చేస్తారు. చాలా మంది వ్యాపారస్తులు తప్పుడు కొలతలు కొలిచి కేజీకి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా తగ్గించి మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్‌షాపుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిరక్షరాస్యులైన మహిళలు, వినియోగదారులు ఎక్కువగా మోసపోతున్నారు. త్రాసుకి ఒక ప్రక్క అయస్కాంతం పెట్టడం, అలాగే కిరోసిన్ కొలిచేడబ్బాలో సీలు వేయడం వల్ల కిలోకి 100గ్రాముల నుంచి 150గ్రాముల దాకా నష్టం వస్తుంది. ఇందుకు విద్యావంతులు గ్రామీణ వినియోగదారులను ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా వారు మోసాల భారీనపడకుండా తగు జాగ్రత్తలు సూచనలు ఇచ్చి వారు చెల్లించే మూల్యానికి తగిన సరుకు లభించే విధంగా చర్యలు తీసుకోవాలి.
అవసరమైతే జిల్లా వినియోగదారుల సంఘం వారి సహాయం తీసుకొని తప్పుడు కొలతలు కొలిచే వ్యాపారస్తులను చట్టం దష్టికి తీసుకురావాలి. వినియోగదారులు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం సరుకుల తూకానికి ఎలక్ట్రానిక్ మెషీన్లు ఉపయోగించే షాపులకి మాత్రమే వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే వినియోగదారుడు తాను చెల్లించే మూల్యానికి తగిన న్యాయం చేకూరుతుంది. అలాగే మిగతా షాపులవాళ్ళు కూడ ఎలక్ట్రానిక్ తూకం మిషన్లని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాగే మనం ఖరీదైన వస్తువుల్ని కొనేటప్పుడు ఐఎస్‌ఐ మార్క్ ఉన్న వస్తువుల్ని మాత్రమే కొనడం అన్ని విధాలా శ్రేయస్కరం.
ఈ మధ్య కాలంలో ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వ్యాపారస్తులు స్త్రీని చాలా అసభ్యకరంగా చిత్రీకరించి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు దీనిని ఖండించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. స్త్రీలను చాలా అసభ్యకరంగా చూపే వ్యాపార ప్రకటనల్ని, పోస్టర్లని రోడ్ల ప్రక్కన, మంచి ట్రాఫిక్ వున్న సెంటర్లలో పెట్టి పాదచారుల, వాహనదారుల మతులు పోగొడుతున్నారు. దాంతో ప్రతివాళ్లు ఈ వాల్ పోస్టర్లో ఏముందాని ఒకసారి తలఎత్తి తదేకంగా చూస్తూ ఏమరపాటులో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి మహిళా సంఘాలవారు, వినియోగదారుల సంఘాలవారు, ప్రభుత్వం వారు విశంఖలంగా వస్తున్న ఈ వ్యాపార ప్రకటనల్ని ఖండించి మహిళలకి తగిన న్యాయం చేకూరే విధంగా ఒక చట్టాన్ని తెచ్చి దాన్ని తక్షణమే అమలుపరచాల్సిన ఆవశ్యకత ప్రస్తుత కాలంలో ఎంతయినా ఉంది.
వినియోగదారుడు వస్తురూపంలో కానీ, సేవారూపమున కానీ నష్టపోయినప్పుడు వినియోగ దారుల ప్రతినిధుల ద్వారా కానీ, న్యాయవాదుల ద్వారా కానీ ఫిర్యాదు చేసి నష్ట పరిహారం పొందవచ్చు. జిల్లా కోర్టులో 20 లక్షల పరిహారానికి దావా వేయవచ్చు. అలాగే వినియోగదారులకు చట్టాలెన్ని చేసినా అధికారుల అలసత్వంతో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం వారు కూడా వినియోగదారులు తగిన న్యాయం పొందుటకు అధికార యంత్రాంగంపై ఒత్తిడిని పెంచి తగినచర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రభుత్వ శాఖలలో అందరికీ అవగాహన కలిగే విధంగా తగిన సూచనలు చేయాలి. వినియోగదారుల కోసం ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థలు రాజకీయాలకు, వ్యాపార దృష్టికి, ప్రభుత్వ అధికారుల ఒత్తిడికి అతీతంగా ఉండాలి. అవినీతికి తావులేకుండా స్వచ్ఛందంగా పనిచేయాలి.
వినియోగదారులు తమకు నష్టం కలిగించిన ఇతర అధికార సేవా సంస్థలైన వైమానిక, బ్యాంకులు, విద్యుత్ శక్తి, గహ నిర్మాణం, పారిశుధ్యం, బీమా, విద్యా, వైద్య, రేషన్, దూరవాణి, రైల్వేశాఖలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఫిర్యాదుదారుని పూర్తి చిరునామా పేరు, ప్రతివాది పేరు, చిరునామా, మనం నష్టపోయిన అంశం పూర్తి వివరాలు, ఇంకా ఫిర్యాదుకు సంబందించిన రసీదులు, పూర్తి వివరాలతో కూడిన లేఖ అన్ని ఒక పేపర్‌మీద రాసి సంతకం చేసి వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలి. ఇలా వినియోగదారులుగా ప్రతీ ఒక్కరు తమకున్న హక్కుల గురించి తెలుసుకొని సమాజంలో జరుగుతున్న వివిధ మోసాల భారీన పడకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిద్దాం.
- పి. భాగ్యలక్ష్మి
సెల్: 9704725609