Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం. ఈ చట్టం అమలులోకి వచ్చి సుమారు 16ఏండ్లు అవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ప్రజా సమాచార అధికారుల బోర్డులు కానరావడం లేదు. కొన్ని కార్యాలయాలలో బోర్డులు ఉన్నా పాత అధికారుల చిరునామాలే దర్శనం ఇస్తున్నాయి. ఇకనయినా ప్రభుత్వం, రాష్ట్ర సమాచార కమిషన్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో తక్షణమే సమాచార హక్కు చట్టం అధికారుల బోర్డులు ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేయాలి.
మీసేవ కేంద్రాలలో దోపిడీ
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మీసేవ కేంద్రాల్లో దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. కొందరు ప్రభుత్వ నిర్ణీత ధరలకన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రజల పొట్ట కొడుతున్నారు. ప్రస్తుత ధరణి పోర్టల్, సాదా బైనామ వారికి కాసులు కురిపిస్తున్నాయి. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జనన, మరణ, కుల, ఆదాయ, మిగతా సేవలలో విపరీతంగా దోపిడీ చేయటంవల్ల మీ సేవ కేంద్రాల పట్ల ప్రజల్లో విరక్తి కలుగుతున్నది. ధరల రుసుముకి సంబంధించి చార్టులు మీసేవ కేంద్రాల్లో కనపడకుండా చేసి, వారికి తోచిన విధంగా దండుకుంటున్నారు. ఇకనైనా అధికారులు ఇటువంటి మీసేవ కేంద్రాలపై నిఘా వేసి, ప్రభుత్వ ధరల ప్రకారమే రుసుం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాలి.
చర్లపల్లి వెంకటేశ్వర్లు,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.