Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ఒక్క వ్యక్తికీ లేదా సంస్థకు గుత్తాధిపత్యం ఇవ్వడం, వ్యవస్థకు ఏనాటికైనా చేటుచేసే విషయమే. ఒకేఒక్క ఈస్టిండియా కంపనీ మొత్తం భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు అదుపు చేయగలిగింది. ప్రపంచంలో ఇంకా ఎన్నోదేశాలలో ఆధిపత్యాన్ని చూపింది. దాని కబంధ హస్తాల నుంచి భయటపడటానికి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నామో మనకు తెలియంది కాదు. మరి అటువంటి అవకాశం మరోసారి మరో కంపనీకి లేదా వ్యక్తికీ అందించడం మంచిదా? ఈనాడు అనేక సంస్థలు ఒకరంగంలో వస్తున్న లాభాలను ఇతర రంగాలలోకి ప్రవహింపజేస్తూ ఆయారంగాలకు కూడా విస్తరిస్తున్నాయి. లాభాలను ఎదోరూపంలో మార్కెట్‌లోకి పంపడం మంచిదే. కానీ ఈ ప్రవాహం ఆయా రంగాల మీద ఆధిపత్యాన్ని చెలాయించే దశకు చేరితే అది రెండురకాల ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నది. ఏదైనా జరుగరానిది జరిగి ఆయా వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, ఇతరత్రా అనుకోని నష్టాలకు లేదా కష్టాలకు గురైతే ఆ ప్రభావం మొత్తం మనదేశ ఆర్థిక వ్యవస్థమీద పడే ప్రమాదమున్నది. మరోవైపు ఆయా వ్యక్తులు లేదా సంస్థలు తమ ప్రాభవాన్ని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా, లేదా ఇతరత్రా ప్రభావం చేయడం ద్వారా వ్యవస్థలో తమకు అనుకూలమైన మార్పులు తెచ్చేవిధంగా ప్రభుత్వాలను ఒప్పించే ప్రమాదమున్నది. తెరవెనుక ప్రభుత్వాలను నడిపే ప్రమాదమున్నది.
ఈరోజు రిలయన్స్‌ను ఉదాహరణగా తీసుకుంటే వారు ఈ దేశంలో ఇప్పటివరకు ప్రత్యక్షంగా అడుగుపెట్టని ఏకైక రంగం బహుశా రాజకీయరంగం మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. వస్త్ర వ్యాపారంతో మొదలైన వారి వ్యాపార సామ్రాజ్య విస్తరణ పెట్రోలియం లోకి ప్రవేశించి, కమ్యూనికేషన్ రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా, అడ్వర్టైజ్మెంట్ మీడియా, ఇన్సూరెన్సులు, ఇంటర్నెట్ సేవలు, షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాలు, సెలూన్, ఈ కామర్స్ ఇలా అనేక రంగాలలో విస్తరిస్తూనే పోతున్నది. పరోక్షంగా ఆటోమొబైల్ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని అదుపుచేస్తున్నది. బ్యాంకింగు వ్యవస్థ వారి చుట్టూ పరిభ్రమిస్తున్నది. కేవలం 10వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన వారి 'జియో' కమ్యూనికేషన్స్‌కు బ్యాంకులు 300 నుంచి 500 రెట్లు రుణాలు ఇచ్చాయంటేనే తెలుస్తున్నది రిలయెన్స్ ప్రభావం ఏమేరకు విస్తరించిందో. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే పది సంవత్సరాల కాలంలో మనదేశంలో అన్ని ప్రధాన రంగాలలో రిలయెన్స్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడం ఖాయం. అదే జరిగితే ఈ వ్యవస్థను ప్రభావితం చేయడం, వారి ఆలోచనలకు అనుగుణంగా ఒప్పించడం వారికి పెద్దగా శ్రమతో కూడిన పనేమీ కాదు. రేపటి రోజున ప్రజలు ఏం తినాలి, ఎలా జీవించాలి, ఎలా ఖర్చు చేయాలి తదితరాలు కూడా నిర్ణయించగలదు. మీడియాలో ఏయే కథనాలు ప్రసారం కావాలో నిర్ణయిస్తారు. సినిమాలు, ఇతర బుల్లితెర ప్రోగ్రామ్‌లు వారి ఆదేశాలకు అనుగుణంగా నడుస్తాయి. ఇంటర్నెట్‌లో ఏ విషయాలు, ఏయే వివరాలు శోధించినప్పుడు రావాలి, ఏయే విషయాలు కనబడకుండా పోవాలో నిర్ణయిస్తారు. సామాజిక మాధ్యమాలలో గుత్తాధిపత్యం ద్వారా ఏయే విషయాలను ఎక్కువగా ప్రజల్లోకి పంపాలి, వేటిని మరుగున పడేయాలో నిర్ణయిస్తారు. వారి ప్రభావం ఎంతమేరకు ఉండబోతుందంటే మనం ఏ నాయకుణ్ణి ఎన్నుకోవాలి, ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏయే సిద్ధాంతాలను గౌరవించాలో కూడా నిర్ణయించగలిగే స్థాయిలో ఆ ప్రభావం ఉండబోతుంది. పరిపాలనా విభాగం వారి ఆదేశాలకు అనుగుణంగా పరివర్తన చెందే ప్రమాదమున్నది. ఇప్పటికే మన రాజకీయ రంగం డబ్బు కంపులో మునిగి తేలుతున్నది. అందులోకి కార్పొరేటు వ్యవస్థ ప్రవేశిస్తే నిజమైన, నిజాయితీ కలిగిన నాయకులు పూర్తిగా ఉనికిని కోల్పోతారు. వ్యవస్థలో నాయకుల పలుకుబడికన్నా ఉద్యోగుల ఆధిపత్యం పెరిగిపోతుంది.
వినడానికి ఇది విచిత్రంగానే అనిపించ వచ్చు, కానీ గుత్తాధిపత్యం చెలాయించే అవకాశం కొందరికి లేదా కొన్ని సంస్థలకు మాత్రమే ఇస్తే రాబోయే కాలంలో అసాధారణ అజమాయిషీ చెలాయించే పరిస్థితి రాదని చెప్పలేం. ప్రపంచంలో అతి విలువైన వ్యాపార సామ్రాజ్యాలు ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆలీబాబా, రిలయన్స్, వాల్ మార్ట్, చైనా, జపాన్ దేశాల బ్యాంకులు, సామ్‌సంగ్ లాంటి అనేక సంస్థలు ఆయా దేశాలలో తమ గుత్తాధిపత్యానికి దారులు వెతికే క్రమంలో వివిధ ఒప్పందాలు, టేకోవర్‌లు చేసుకుంటున్న చరిత్రను మనం చూస్తున్నాం. విజయ వంతమైన భారతీయ ఈ కామర్స్ సంస్థలన్నీ విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా చెప్పాలంటే విజయవంతమైన భారతీయ స్టార్టప్ సంస్థలన్నీ యాజమాన్యాలను మార్చుకుంటున్నాయి. రిలయన్స్ ఫ్రెష్‌లో, రిలయెన్స్ జియోలో ఇప్పటికే విదేశీ వాటాదారులు తిష్టవేశారు. రిలయన్స్ పెట్రో కూడా సౌదీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థతో వాటాల అమ్మకానికి చర్చలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే దేశంలో 90శాతం సంపద కేవలం ఒకశాతం ఉన్న ధనవంతుల చేతుల్లోకి చేరింది. రేపటి భవిష్యత్తులో ఆ ధనవంతులంతా సిండికేటుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉన్నది.
నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయాల మీద కార్పొరేట్ల ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడం, ప్రయివేటు యాజమాన్యాలకు అప్పగించడం లాంటి నిర్ణయాల వెనుకున్నది కార్పొరేటు మేధావులే అన్నది నగసత్యం. కొత్తగా ఒక్క ప్రభుత్వరంగ సంస్థ కూడా ఆవిర్భ వించబోవడం లేదు. విద్యుత్తు, ప్రజా రవాణా చివరికి రక్షణ రంగం కూడా ప్రయివేటు దిశలో ప్రయాణిస్తు న్నాయి. కార్పొరేటు వ్యవసాయానికి దారులు పడుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిస్తున్నారు. కమ్యూనికేషన్ రంగంలో గుత్తాధిపత్యం దిశలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి, ఆయా రాష్ట్రాలు మాతృభాషలను వదిలేసి, విదేశీ విద్యలవైపు ప్రేమగా చూస్తున్నాయి. న్యాయ స్థానాల విస్తృతమైన అధికార పరిధిని మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) ట్రిబ్యునల్స్ ఆక్రమిస్తున్నాయి. పత్రికా రంగం, ఎలక్రానిక్ మీడియాలో పాత పునాదులు కదిలిపోయాయి. అంతా కార్పొరేట్ల గుత్తాధిపత్యంలోకి వచ్చి చేరాయి. సామాజిక మాధ్యమాలు ప్రభుత్వా లను మార్చే స్థాయికి చేరుకున్నాయి. చెప్పుకుంటూ పొతే ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ప్రజాస్వామ్యం పదికాలాలు వర్థిల్లాలి అంటే అందరికి సమాన అవకాశాలు రావాలి. అందరి హక్కులు గౌరవించబడాలి. అన్ని గొంతుకలకు అవకాశం ఉండాలి. ఒక్కరు లేదా కొందరి చేతుల్లోకి వ్యవస్థ చేరితే మన చుట్టూ మనమే గిరిగీసుకోవడం అవుతుంది. భావితరాల హక్కులు కాపాడాలి అంటే నేటి మన నిర్ణయాలలో పరిణితి ఉండాలి. గుత్తాధిపత్యానికి దారితీసే చర్యలను నియంత్రించాలి. వ్యవస్థలో అన్ని రంగాలలో పోటీ కొనసాగేలా నిర్ణయాలు, విధి విధానాలు చేయాలి. అప్పుడే అధిక సంఖ్యాకులకు మేలు జరుగుతుంది.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
సెల్:9440449392