Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పుట్ట గొడుగుల్లా బెల్టు దుకాణాలు మద్యాన్ని విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్నా, తెలిసీ అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా కిరాణాదుకాణం నుంచి మొదలుకొని నివాస గహాలు, పాన్ షాపులు, కల్లు కాంపౌండ్‌ల సమీపంలో మద్యం ఏరులైపారు తోంది. భవననిర్మాణ కార్మికులు, కూలీలు, హౌటల్స్, ఇసుక రవాణా కార్మికులకు తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు క్వార్టర్లు, ఆరు ఆఫ్‌లుగా సాగిస్తున్నారు. గతంలో వైన్ షాపుల పరిసరాలలో కొనసాగిన ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మద్యం ప్రియులు ఉదయం టీ, కాఫీలకు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉదయం పూట వాహనాలలో తీసుకువచ్చి, ఆ ప్రాంతంలోనే ఓ కల్లు కాంపౌండ్ పరిసరాలలో పలువురు పాన్‌షాపులు ఏర్పాటుచేసి అందులో బెల్టు దుకాణం నడిపిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెతి చూడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవు తున్నది. లిక్కర్ డాన్‌లు వివిధ జిల్లాల్లో కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఆ మద్యం తాగినవ్యక్తులు వాటికి బానిసలై తమ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటిస్తుంటే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టుదుకాణాలు కొనసాగుతున్నాయి. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్టుదుకాణాలు జోరందుకున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో మద్యం షాపులు కొనసాగుతున్నాయి.
వివిధ మండలాల్లోని కొన్ని గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది. అందులో ఎంఆర్‌పీ కంటే రూ.30 నుంచి రూ.50వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు. కొందరైతే వాహనాలను ఉదయం సమయంలో తీసుకువచ్చి అడ్డకూలీలకు, ఇసుక ట్రాక్టర్ల మీద వెళ్లే కూలీలకు అమ్మకాలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్ల వద్ద గల కిరాణా దుకాణాలలో కల్తీమద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అన్ని జిల్లాలలో ఈ దందా సంగతి తెలిసినా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టుషాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఈ బెల్టుదందాకు అడ్డుకట్ట పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత నిత్యం దీనికి బానిసయి ఒళ్లు గుళ్ల చేసుకుని భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. ఇకనయినా ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.
- కె. సతీష్‌రెడ్డి
సెల్: 9848445134