Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా చేపట్టి, ధరణి పోర్టల్‌కు సైతం సాంకేతిక పరమైన తుదిమెరుగులు గావించి నవంబర్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రత్యేకంగా రెండు విషయాలను పరిశీలించాలి... మొదటిది ప్రభుత్వం చెబుతున్నట్టుగా పారదర్శకత, అక్రమ దారులు అడ్డు తగలకుండా, అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సరిహద్దులు, సులభంగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రతి సెంటుభూమీ కంప్యూటర్‌లో నిక్షిప్తం కావడం, కబ్జాదారుల నుంచి శాశ్వతంగా రక్షణ పొందే పలు విషయాలను ప్రభుత్వం పదేపదే చెప్పడం శుభపరిణామంగానే భావిద్దాం.. కానీ రెండవ విషయానికి వస్తే సాదాబైనమా ద్వారా ఐదు ఎకరాల లోపుగల వ్యవసాయదారులకు రిజిస్ట్రేషన్ కల్పించే వెసులుబాటును కొద్ది రోజుల గడువుతో కేటాయించడం... చూపరులను, మంచిపని లాగే కనిపించినా, కొంచెం చరిత్రలోకి తొంగిచూస్తే భూ పంచాయతీలకు, పాత కక్ష్యలను నిద్రలేనట్టయ్యింది. వాస్తవంలోకి వెళ్ళీ విశ్లేషిస్తే ...
మూడు నాలుగు దశాబ్దాల క్రితం భూములకు అంతగా ఆర్థిక విలువలేనప్పుడు ఎలాంటి పంచాయతీలు లేవు. ఏవైనా భూపంపకాలు జరగాలంటే ''ఈ మడి నాకు, ఆ మడి నీకు'' అని, లేదా ముళ్ళు కట్టే, తాడు సాయంతో కొలిచి ఎలాంటి నిర్దిష్టమైన సరిహద్దులు లేకుండా పంచుకొని వ్యవసాయం చేసుకునేవారు. కాలక్రమేణా పరిణామ క్రమంలో అభివృద్ధి వల్లనో, మార్పుల వల్లనో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం అభివద్ధి చెందడం, ఒక్కసారిగా భూముల రేట్లు పది వంతుల కంటే ఎక్కువగా పెరగడం, పట్టణాలు, నగరాలలో భూకబ్జాలు మొదలుకావడం, భూ కక్షలు, చంపడాలు, చావడాలు మొదలుకావడం, సివిల్ కోర్టులలో భూపంచాయతీల కేసుల సంఖ్య పెరగడం, ఆ తర్వాత అది నగరాల చుట్టుపక్కలకు పాకి, గ్రామాల వరకు వచ్చి ఎకరాకు 5 నుంచి పదివేల వరకు పలికే రేటు కాస్త, ఒక్కసారిగా లక్షలు, అనతికాలంలోనే కోట్ల రూపాయల వరకు పాకడంతో అందరిలో అలజడి ఆరంభమై సన్న, చిన్న కారు రైతులకు తమకు ఉన్న కొద్ది భూములను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా అన్నదమ్ములతో, పొలం చుట్టుపక్కల వారితో తగాదాలు, గొడవలు, కొట్లాటలు కేసులు కోర్టులు అన్నీ పరిచయమయ్యాయి. అంతెందుకు భూమి రేటు పెరగడంతో కొడుకు తల్లిదండ్రులు, ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు సైతం గొడవలు పడుతూ, కోపంతో క్షణికావేశంలో ఒకరినొకరు చంపుకున్న సందర్భాలను సైతం చూసాయి. ఇది ఇంతటితో ఆగకుండా రక్త సంబందీకులు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య దూరాన్ని పెంచుతూ మన సాంప్రదాయాలను దెబ్బతీస్తూ వస్తుండటం ఒకెత్తయితే.. ఆ దశలోనే భూ రాజకీయాలు గ్రామాలకు చేరాయి. పలు రాజకీయ పార్టీలు ఇలాంటి సమస్యలతో బాధపడే కుటుంబాలలో ఒకరికి ఒకపార్టీ మద్దతునిస్తే, మరొకరికి ఇంకోపార్టీ మద్దతునిచ్చి ఆ సమస్య పరిష్కారం గాకుండా తీవ్ర జఠిలం చేస్తూ వారిని ఆర్థికంగా దెబ్బతీశారనడంలో నిజంలేకపోలేదు. ఈ క్రమంలో గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలలో అక్కడక్కడా అన్నదమ్ములు, తల్లీకొడుకులు ఇలా ఒకే ఇంట్లో వారిని పలురాజకీయాలు ప్రోత్సహించి ఎన్నికలలో నిలబెట్టిన సందర్భాలు సైతం విదితమే.
ఇలా భూపంచాయతీలు రగులుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం రావడం, ప్రభుత్వ కార్యాలయాలు అంతగా పనికి నోచుకోకపోవడం, ప్రజల దష్టంతా ఉద్యమంపైకి వెళ్ళడం.. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల మధ్య తెలంగాణ ఏర్పడటం, నూతన రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్కరోజులోనే సమగ్రసర్వే నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ప్రతి సమాచారాన్ని సేకరించడం జరిగింది. దానికనుగుణంగా కార్యకలాపాలను గావిస్తూ.. రైతు బంధు, రైతు బీమా, పంట బీమా లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశబెట్టడం, వీటి అమలుకై తెలంగాణ ప్రభుత్వం పేరిట నూతన పట్టా పాసు బుక్కులను జారీచేయడం జరిగింది. ఈ తతంగంతో కొన్ని సమస్యలకు సమాధానం లభించినట్లయింది. భూములన్నీ కంప్యూటరీకరణను చేయడం, రాష్ట్రంలో సాదా బైనమా ద్వారా క్రమబద్దీకరణను నిలుపుదల చేయడంలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో లబ్ధిదారులు కొంత ఆగ్రహాన్ని వెలిబుచ్చినా మరొక దారిని ఎన్నుకొని గ్రామాపెద్దల సమక్షంలో మాట్లాడుకుని పంచాయతీలను తెంపుకున్న మాట వాస్తవం. అంతా సద్దుమణిగాక ఎవరికి వారు వారి పనుల్లో నిమగమయ్యాక ఒక్కసారిగా ప్రభుత్వం నూతన రెవిన్యూ చట్టాన్ని తీసుకువచ్చి సాదా బైనమా ద్వార భూక్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఒక్కసారిగా భూకక్షలు, పాత పంచాయతీలు నిద్రలేచి, శిథిలావస్థలోకి జారుకున్న కాగితాలు సైతం లామినేషన్‌లు, జిరాక్స్‌లతో కంప్యూటర్‌లలో అనుసంధానం కావడానికి మీసేవ కేంద్రాల్లో కిక్కిరిసిపోతున్నాయి. వీటి వల్ల జరిగే ఫలితాన్ని పక్కకు పెడితే, ఏం జరుగుతుంది, జరగబోతుందని అనుమానాలతో ఒకరినొకరు ద్వేషించుకొంటూ, పంచాయతీలకు తావునిస్తుంది. పంచాయతీలను తెంపకుండా, తీవ్ర కఠినం చేసేవిధంగా వారు వారి పనుల్లో నిమగమై సమస్యను ఇంకా జఠిలంచేస్తూ వింతపోకడలకు దారితీయడానికి ఈ నూతనచట్టం ఉపయోగ పడుతుందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే చట్టంపట్ల పరిజ్ఞానం ఉన్న భూస్వాములకు ఎలాంటి ఇబ్బందిలేదు. కానీ రెండు మూడు ఎకరాలలోపు భూమి కలిగిన నిరుపేదలకు, కష్టాన్ని నమ్ముకోని పనిచేసుకునేవారికి, పనికెళ్ళకుండా ఇంకాస్త ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తుందని చెప్పడంలో నిజంలేక పోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలలో పేదల సమస్యలను వారిలో పరిగణలోకి తీసుకుని, వారి సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపించి, సమస్యలు జఠిలమవ్వ కుండా, ఆస్థి, ప్రాణ నష్టాలకు తావివ్వకుండా ఆదుకునే ప్రయత్నాలలో భాగంగా ఒక ప్రకటన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. గ్రామాలలో స్వార్ధపూరిత రాజకీయాలు చేసే మహానాయకులు ఏమీ తెలియని పేదలమధ్య చిచ్చుబెడుతూ, కాలం వెళ్ళదీసే రాజకీయాలు మాని, వీలైతే సానుకూలంగా పరిష్కారమార్గానికి పూనుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే భూతగాదాలున్న వారు సైతం మానవతాదక్పదంతో కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అంతేగానీ పెద్దమనుషులని, కేసులని, కోర్టులని భయలుదేరితే అసలుకే ఎసరు వస్తుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ప్రభుత్వాలు ప్రజల క్షేమం, సంక్షేమం కోసం చేపట్టే చట్టాలు వారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిర్దిష్టమైన లక్ష్యాలతో, ప్రజామోదంగా, ఆచరణలో ఉపయోగకరమైన చట్టా లను తీసుకరావడానికి ప్రయత్నిం చాలి.అంతేగానీ ఏడాది కడాది ఒకే విషయానికి సంబంధించిన చట్టాలను తెస్తూ, ప్రజలను భయాం దోళనలకు గురిచేయడం తగదు.
- డా||పి. సైదులు
సెల్:9441930361