Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల...కాదేదీ కవిత కనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. వయసోడైనా, ముసలోడైనా, ఇంతకుముందు జబ్బులున్నా, లేకపోయినా నాకనవసరం అంటోది కరోనా. దాని దెబ్బకు మార్చి నుంచి ఇప్పటిదాకా జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ మహమ్మారి తల్లి ఎప్పుడు ఎవడి భుజం మీద చెయ్యేస్తుందో తెలియక వణికిపోతున్నారు. మూతికి మాస్కులు, చేతికి శానిటైజర్లు రాసుకుంటూ చిన్నపాటి దగ్గు, జలుబుకే హడలి ఛస్తున్నారు. మార్చి నుంచి మే వరకూ కఠినంగా విధించిన లాక్‌డౌన్‌తో నూటికి 90 శాతం మంది ఇండ్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత అన్‌లాక్ మొదలైనప్పటి నుంచి ఉద్యోగస్తులు, వర్తకులు, చిరు వ్యాపారులు, బయటకు పోవటం ప్రారంభించారు. పాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం యువకులు మార్కెట్లకు, కిరాణా దుకాణాలకు వెళ్లటం తప్పనిసరైంది. కానీ చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రం అటు బయటకెళ్లలేక, ఇటు ఇంట్లో ఉండలేక నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పెద్దాయన... రోజూ పొద్దున్నే రోడ్ల మీదికి జనం రాకముందే గబుక్కున గల్లీలోకి రావటం, చటుక్కున పాల ప్యాకెట్లు, కూరగాయలు తీసుకోవటం, ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపేసుకోవటం పరిపాటిగా మారింది. దాదాపు ఏణ్నెల్లపాటు ఈ విధంగా ఎంతో జాగ్రత్తగా ఉన్న ఆయనకు తాను పెంచుకున్న బొచ్చు కుక్కపిల్ల ఒకానొక శుభ ముహూర్తాన చుక్కలు చూపించింది. అది ఒంటరిగా ఫీలయిపోతుందని భావించిన ఆయన కొడుకు... దానికి జంట కోసమంటూ మరో కుక్క పిల్లను తెచ్చాడు. రెండు రోజులపాటు ఇంట్లోనే బుద్ధిగా ఉన్నట్టు నటించిన ఆ కొత్త కుక్కపిల్ల... ఎవరూ లేనిది చూసి... ఇంట్లోంచి చెంగున దూకి రోడ్డెక్కింది. దానితో సావాసం మరిగిన ఈ పాత బొచ్చు కుక్కపిల్ల... 'నువ్వు లేక నేను లేను...' అనుకుంటూ దాని వెంటే పరుగులు తీయటం మొదలు పెట్టింది. ఆ రెండూ ఇంట్లోంచి పారిపోవటం చూసిన ఆ పెద్దాయన... 'నేను సైతం' అనుకుంటూ వాటిని పట్టుకోవటానికి మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్‌లాగా గల్లీలో వాటి వెంట పరిగెడుతూ గర్జించటం మొదలెట్టాడు. ఇక్కడే మన అరవై ఏండ్ల 'యంగ్ టైగర్'కు చిక్కొచ్చి పడింది. ఒకవైపు ఏణ్నెల్ల పాటు కాపాడుకున్న ఆరోగ్యం ఏమవుతుందోనన్న భయం, దానికి మించి ఒంటిపై నుంచి జారిపోతూ ఎలాంటి అభయమివ్వలేని లుంగీ... వెరసి కుక్క పిల్లల వెంట పరిగెడుతున్న ఆయన చూసే వారికి సూపర్ మ్యాన్‌లా కనిపించారు. ఓ పావుగంటపాటు ఈ రన్నింగ్ రేస్ కొనసాగిన తర్వాత... ఎలాగోలా తంటాలు పడి పాత బొచ్చు కుక్కు పిల్లను మాత్రం దొరక బుచ్చకుని, బతుకు జీవుడా అనుకుంటూ ఇంటిదారి పట్టారు. కొత్తది మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అది మీకు ఎక్కడన్నా కనబడితే జర అడ్రస్ జెప్పండి...
-బి.వి.యన్.పద్మరాజు