Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎహే కరోనాలేదు గిరోనా లేదు బాబీజీ అప్పడాలు తినండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ యావత్ దేశ ప్రజానీకానికి ఉచిత సలహాలిచ్చేశారు..పెద్దసార్ చెప్పిండుగదా నిజమేకాబోలు అనుకున్నరు జనాలు. గీ మాటలేందని కరోనాకు కోపమొచ్చింది. 'నేను దరిచేరకుండా ప్రజలకు మంచి మాటలు, జాగ్రత్తలు చెబుతాడనుకుంటే గీ అప్పడాల గోల ఏంది?' అని గా మంత్రినే సోకింది. అప్పడాలు తిని తగ్గించుకో అని సవాల్ విసిరింది. గన్ని మాటలు చెప్పిన మంత్రి అప్పడాలు గిప్పడాలు జాన్తానై అనేసి సక్కంగ ఎయిమ్స్‌కుబోయి డాక్టర్ల సలహాలతో మంచిగై తిరిగొచ్చిండు. బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్‌సింగ్ జాన్‌పూరియా అయితే ఇంకో అడుగు ముందుకేసిండు. ఎన్కట సబ్బులు లేనప్పుడు మట్టి పూసుకున్నట్టు ఒంటి నిండా బురద పూసుకుని శంఖం ఊదితే కరోనా పోతుందని ప్రచారం చేసేశాడు. అరే ఎప్పటికప్పుడు చేతులు కడుకోమని డాక్టర్లు, మేధావులు చెబుతుంటే గీయనేంది బురదపూసుకోమని చెబుతున్నడు? ఆయన మాట నిజమేనా? అని కరోనాకు గుబులుపుట్టింది. అరే అపరిశుభ్రంగా, మూతికి గుడ్డబట్ట కట్టుకోకుంటే నేను వచ్చితీరుతబై అని వచ్చిచూపెట్టింది. మరో నాయకుడు గోమూత్రం తాగితే కరోనా రాదని దాన్ని పంచిపెట్టేశాడు. గా ముచ్చట చెప్పినాయన చెంతకే కరోనా చేరింది. గాయన గోమూత్రం తాగి తగ్గించుకోకుండా ఆస్పత్రికిపోయి పాణం బాగ చేయించుకున్నడు. చివరకు తేలింది ఏంటంటే 'గోమూత్రం తాగితే నేను పోను..మూఢత్వాన్ని కట్టిబెట్టి పాలు, గుడ్డు, పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోండి' అని కరోనా హితోపదేశం చేసింది. ఇంకొక ఆయన హనుమాన్ చాలీసా చదివితే కరోనా రాదు అని చెబితే..'అరే అన్నా మంత్రాలకు చింతకాయలు రాలవే' అని కండ్లార చూపించింది. 'దీపాలు వెలిగిస్తే..చప్పట్లు కొడితే...మంత్రాలు చదివితే...ప్రజల్లోకి మూఢత్వాలను వదిలితే ఎట్టిపరిస్థితిల్లోనూ మిమ్మల్ని వదిలిపోను. మూఢత్వ మాటలను కట్టిపెట్టండి. మీ దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మాస్కులు పెట్టుకోండి. అరగంటకో, గంటకోసారో చేతులు కడుక్కోండి. లేకుంటే ఖబర్దార్ మీ అంతు చూస్తా' అని కరోనా హెచ్చరిస్తూనే ఉన్నది. అసలే శీతాకాలం బీ అలర్ట్ . ప్రజలారా సైన్స్‌ను నమ్మండి.
- అచ్చిన ప్రశాంత్