Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీగా కవిత విజయం కోసం నేతల పావులు
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే నిజామాబాద్‌లో మాత్రం 'కారు' ఆకర్ష్ జోరు నిరంతర చర్చకు దారితీస్తున్నది. వారం రోజులుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత విజయానికి ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా ఈ తంతు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.
నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఇప్పటికే ఐదుగురు కార్పొరేటర్లు గులాబీ తీర్థం పుచ్చుకోగా, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులూ పార్టీ మారారు. కామారెడ్డిలోనూ ఆకర్ష్ రాజకీయం షురూ చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రవర్తన నచ్చకే పార్టీ మారుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతుండగా.. అభివృద్ధి పనులు నిలిపేస్తామని భయపెడుతూ ప్రలోభాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటే అయినా లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత ఓటమి పాలైనప్పట్నుంచి జిల్లా రాజకీయ రూపురేఖలు మారిపోయాయి. కవిత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ బలం తగ్గడంతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. మంత్రికి, ఎమ్మెల్యేలకు పొంతన కుదరక ఎవరికివారే అన్నట్టు తీరు మారింది. ఈ బలహీనతలు ఎక్కడ పొక్కుతాయోనని కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశానికి మీడియాను కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత నామినేషన్ వేయడంతో రాజకీయం మళ్లీ వేడెక్కింది.
పదిరోజుల్లోనే తారుమారు..
కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోనే టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేశారు. డివిజన్ అభివృద్ధికి కోరినన్ని నిధులు సమకూర్చడంతో పాటు అవసరమైతే వ్యక్తిగతంగానూ ఆర్థికంగా ఆదుకుంటామని ఆఫర్లిచ్చారు. ఈ ప్రతిపాదనలు తిరస్కరించిన బీజేపీ కార్పొరేటర్లు నేరుగా ఎంపీ అరవింద్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, గడిచిన పది రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదట ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ బీజేపీ జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున పార్టీ మారారు. మరుసటి రోజే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కారెక్కారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి స్వయంగా ఆహ్వానించారు. గురువారం మరో ఇద్దరు కార్పొరేటర్లు సిరిగాదా ధర్మపురి (బీజేపీ), శివచరన్ (కాంగ్రెస్) మంత్రి సమక్షంలో గులాబీ గూటికెళ్లారు. ఏర్గట్ల జెడ్పీటీసీ సైతం వారి బాటలోనే నడిచారు. ఇక నియోజకవర్గాల నుంచి పలువురు ఎంపీటీసీలూ టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించినట్టు చర్చోపచర్చలు నడుస్తున్నాయి.