Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల సాధనకు నిరంతర ఉద్యమం
- మెనూ చార్జీల పెంపునకు సడలని పోరు
- నేటి నుంచి భద్రాచలంలో టీఎమ్‌డీఎమ్‌డబ్ల్యూయూ రాష్ట్ర మహాసభలు
అన్యాయంగా తొలగిస్తే...కొట్లాడి మరీ కొలువులు దక్కించుకున్న మహత్తర పోరాటం వంటలమ్మలది. మధ్యాహ్న భోజనం పథకం ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని చూస్తే...ఒక్కటై సర్కారు జిత్తులమారి ఎత్తుగడను తిప్పికొట్టిన చరిత్ర వాళ్లది. కనీస హక్కుల సాధన కోసం...మౌలిక సౌకర్యాల కల్పన కోసం బతుకు పోరు కొనసాగిస్తున్నది. ఈ పోరాటాలన్నింటిలోనూ వంటలమ్మలను ముందుకు నడిపింది...నడిపిస్తున్నది... తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం)నే. అత్తెసరు పైసలిచ్చి వంట చేయాలంటే... కాదు...కాదు.. పెంచాల్సిందే అంటూ పోరు సల్పుతున్నదీ ఆ యూనియన్ నీడలోనే. నేడు ఆ యూనియన్ రాష్ట్ర మహాసభలను కొత్తగూడెంలో జరుపుకుంటున్న నేపథ్యంలో కథనం.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు తీసుకొచ్చినది. దీని నిర్వహణను చూస్తున్నవారిలో 95 శాతానికిపైగా బడుగు, బలహీనవర్గాల వారే. అందులోనూ నూటికి 98 శాతం మహిళలే. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.30 పైసలు, ఆ పై తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.18 పైసలను సర్కారు ఇస్తున్నది. దీనికితోడు బియ్యం ఇస్తున్నది. మిగతా కట్టెలు, కూరగాయలు, ఉప్పు, పప్పు, కారం, తదితర వస్తువులన్నీ కార్మికులే కొనుక్కోవాలి. కష్టనష్టాలకోరుస్తూ వారు వంట చేసి పెడుతున్నారు. ఇంతచేస్తున్నా వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని అధికారులు వేధిస్తున్నారు. లేకపోతే ప్రయివేటుకు ఇస్తామని బెదిరిస్తున్నారు. అసలు గుడ్లే పెట్టని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సర్కారు శతవిధాలా యత్నించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ తెగించి కొట్లాడింది. 'ఇప్పుడు ఇక్కడ చేశారు...తర్వాత రాష్ట్రమంతా చేస్తారు. కార్మికులను రోడ్డుపాలు చేస్తారు' అని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో రాజకీయ, తదితర ఒత్తిళ్లతో ఏండ్లతరబడి పనిచేస్తున్న వంటమ్మలను తొలగించే కుట్ర జరిగింది. దీన్ని యూనియన్ పోరాటాలు చేసి సమర్ధవంతంగా తిప్పికొట్టింది. నల్లగొండ జిల్లాలో 32 గ్రామాల్లో పాత కార్మికులను తొలగించగా...పోరాడి మరీ మళ్లీ పాతవాళ్లకే వంట చేసే హక్కును సాధించడంలో యూనియన్ విజయం సాధించింది. వంట చేసే వారికి ఇచ్చే గౌరవవేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రీజింగ్‌లో పెట్టింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయటంతో ప్రీజింగ్ ఎత్తేశారు. తమిళనాడు, ఏపీలో ఇస్తున్న మాదిరిగా గౌరవ వేతనాలు ఇవ్వాలని కూడా పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. పెండింగ్ బిల్లుల విడుదల, కనీస వేతనం రూ.18 వేలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ పోరాడుతున్నది.
మహాసభలకు భద్రాచలం సిద్ధం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శని, ఆది వారాల్లో రెండు రోజుల పాటు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) మహాసభ జరుగనున్నది. కె.భారతీనగర్(చాంబర్ ఆఫ్ కామర్స్)లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాసభ ప్రాంగణంతోపాటు భద్రాచలం పట్టణంలో తోరణాలు, జెండాలు కట్టారు. ప్లెక్సీలను పెట్టారు. ఈ మహాసభలో రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపికచేయబడిన 300 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
గుడ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలి:
యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.రమ
మధ్యాహ్నభోజన పథకం నిర్వహణకు ప్రయివేటు సంస్థలకు అప్పగించొద్దు. పాఠశాలల్లో అప్పటికప్పుడు చేసే వంటలకంటే హైదరాబాద్‌లోని పాఠశాలల్లో ప్రయివేటు సంస్థ పెడుతున్న భోజనంలో నాణ్యత లేదని కాగ్ నివేదికలే తేల్చిచెప్పాయి. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను కూడా పాలకులు తొక్కిపెడుతున్నారు. పిల్లలకు మరింత పౌష్టికాహారం అందేలా చూసేందుకు మెనూ చార్జీలను పెంచాలి. గుడ్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. సబ్సిడీపై గ్యాస్‌ఇవ్వాలి. వంటషెడ్లు కట్టించి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. యూనిఫామ్‌లు, ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రమాదబీమా వంటి సౌకర్యాలను కల్పించాలి. అందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి.