Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో నిర్మితమవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత నిర్వహించాలని కోరారు. ఈనెల 18 నుంచి శుక్రవారం వరకు జరిగిన రాష్ట్రస్థాయి విషయ నిపుణుల శిక్షణా ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్రంలోని 94,547 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారికి బోధించే 300 మంది విషయ నిపుణులకు తొలివిడతలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అందరూ నిత్య విద్యార్థులేనన్నారు. ఒక్కో అడుగు ఒక్కో అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. తనకు మొదట చదువు నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తున్నారని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులూ ఆధునిక అంశాలతో బోధించాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడూ వృత్తిని గర్వంగా భావించాలని సూచించారు. ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్ హృషికేశ్ సేనాపతి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా శిక్షణ కార్యక్రమం ఉండాలని చెప్పారు. పిల్లల్లోని సామాజిక, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సృజనాత్మకతను వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్, ఎస్‌సీఈఆర్టీ సంచాలకులు బి శేషుకుమారి, మైసూర్ ప్రాంతీయ విద్యా కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ పాల్గొన్నారు.