Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ప్రాంతాల్లోని రైతుల భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు తీసుకొచ్చిన గిరివికాసం పనులను వేగవంతం చేయాలనీ, లబ్దిదారులను త్వరగా గుర్తించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరి వికాసం పథకంపై సోమవారం సమీక్ష జరిగింది. గిరివికాసం పథకం కింద ఇప్పటికే దాదాపు 46 కోట్ల రూపాయల విలువైన పనులకు గిరిజన శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ ఏడాది 61 కోట్ల రూపాయలను కూడా గిరివికాసం కోసం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలో కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా అంగన్‌వాడీ భవనాలకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెంటనే ఇచ్చే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.