Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైప్ లైన్ లీకై 20అడుగుల ఎత్తుకు ఎగిసిన నీరు
- కొట్టుకుపోయిన వరి ధాన్యం
నవతెలంగాణ-వర్ని
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం శివారులో బుధవారం మిషన్ భగీరథ పైపులైన్ లీకై నీరు పెద్దఎత్తున ఉప్పొంగింది. దీంతో పక్కనే రోడ్డుపై రైతులు ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రైౖతులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన జక్కు పోశెట్టి, నారాయణకు చెందిన 15 ఎకరాలు, జక్కు శంకర్‌కు చెందిన 20 ఎకరాల్లో సాగుచేసిన పైరును కోసి ధాన్యాన్ని రోడ్డుపై ఓ పక్కన ఆరబెట్టారు. పక్కనే ఆరు మీటర్ల దూరంలోనున్న మిషన్ భగీరథ పైపులైన్ లీకై నీరు 20అడుగుల ఎత్తుకు నీరు ఎగిసిపడింది. దీంతో ధాన్యం నీటి తాకిడికి కొట్టుకుపోయింది. ధాన్యం గింజలు ఎత్తుకోడానికి కూడా వీలులేకుండా పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని రైతులు రాస్తారోకోకు ప్రయత్నించారు. అంతలోనే తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి రైతులను శాంతింపజేశారు.
భగీరథ ట్రయల్ రన్ ఎఫెక్ట్..
మిషన్ భగీరథ నీటి సరఫరాలో భాగంగా లీకేజీలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలించేందుకు అధికారులు ట్రాయల్ రన్ నిర్వహించారు. అందులో భాగంగా నీటిని విడుదల చేశారు. కానీ లీకేజీలపై పర్యవేక్షించకపోవడంతో తమకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.