Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి : ఏఐటీయూసీ, ఈయూ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో కార్మిక చట్టాలను అమలు చేయాలనీ, పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం యాజమాన్యాన్ని చర్చలకు పిలవాలని ఏఐటీయూసీ, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) డిమాండ్ చేశాయి. మంగళవారంనాడు ఆ యూనియన్ల నేతృత్వంలో హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, లేబర్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్, ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని కేవలం నోటిమాట ద్వారా చెప్తే సరిపోదన్నారు. ప్రభుత్వం రాతపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు లేబర్ కమిషనర్ కార్మికుల పక్షాన నిలువకుండా, పెట్టుబడిదారులు, యాజమాన్యాలు, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీలో తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2019 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం తర్వాత కార్మిక సంఘాల వినతులను అనుమతించకుండా, వెల్ఫేర్‌బోర్డ్ కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట సమ్మతం కాదన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు లేబర్ కమిషనర్‌ను కలిసి విన్నవించి, యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించాలని కోరితే, పట్టించుకోలేదన్నారు. సంస్థలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, కార్మికులపై పనిభారాలు పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రెండేండ్లకోసారి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, నాలుగేండ్లుగా వాయిదా వేస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రతినిధిబృందం జాయింట్ లేబర్ కమిషనర్ చతుర్వేదిని కలిసి వినతిపత్రం సమర్పించారు.