Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులున్నాయ్.. కానీ అక్కరకొస్తలేవ్
- బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న నిధులు
- చేసిన పనులకు బిల్లులు రాక అష్టకష్టాల్లో సర్పంచ్‌లు
- పారిశుధ్య సిబ్బందికీ జీతాల్లేని దుస్థితి
- పత్తాలేని గ్రీన్ ఛానల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బ్యాంకు ఖాతాల్లో లక్షలకు లక్షల డబ్బులున్నారు. ప్చ్! ఏం లాభం? అవి దేనికీ పనికిరావడం లేదు. ఒకటికాదు..రెండు కాదు..నాలుగైదు నెలలుగా పల్లెల్లో ఇదే పరిస్థితి. 'ఫ్రీజింగ్‌లో ఉన్నరు.. నిధులు న్నా దేనికీ అక్కరకొస్తలేవ్..మేం అప్పులు చేసి అవస్థలు పడుతున్నం' అని సర్పంచ్‌లు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అబ్బే ఫ్రీజింగ్ ఏమీలేదంటూనే నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది వాస్తవమేనని అధికారులు సైతం నిజాన్ని ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు అప్పులు చేసి నెట్టుకొచ్చిన సర్పంచ్‌లు చేతులెత్తేయడంతో గ్రామపంచాయతీ సిబ్బందికీ కనీసం జీతాలివ్వలేని దుస్థితి ఊర్లల్లో ఉత్పన్నమవుతున్నది.
'పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. వాటి అభివృద్ధే దేశాభివృద్ధి. గ్రామీణ వ్యవస్థ బలోపేతం కాకుండా దేశం ముందుకు పోనేపోదు. ప్రభుత్వాలు అత్యధిక నిధులు అక్కడే ఖర్చుపెట్టాలి...' ఇది మమహాత్మాగాంధీ గ్రామాలపై వ్యక్తపరిచిన అభిప్రాయం. ఇదిలా ఉండగా నేటి ప్రభుత్వాలు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. నోటితో మాట్లాడి నొసడితో ఎక్కిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. హామీలన్నీ నీటిమీది రాతలే అవుతున్నాయి. నిధుల మంజూరు విషయంలో పల్లెల అభివృద్ధికి గ్రీన్ ఛానల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని టీఆర్‌ఎస్ సర్కారు ప్రకటించింది. అయితే, ఆచరణలో 24 గంటలు, 365 రోజులు ఆ గ్రీన్ ఛానల్ పనిచేయడం లేదు. ఎప్పుడూ ఫ్రీజింగ్‌లోనే ఉంటున్నది. పదపదే పంచాయతీ పాలక వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా, సర్పంచ్‌లు మంత్రుల ఎదుట నిరసనలు తెలుపుతున్నా..తమ డిమాండ్లను వ్యక్తపరుస్తున్నా పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా పాలకులు బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉంది. గ్రామపంచాయతీలలో గతంలో సర్పంచ్‌లు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే ఆ డబ్బులను వెంటనే డ్రా చేసుకునే వెసులుబాటు సర్పంచ్‌లకు ఉండేది. సమీకృత ఆర్థిక నిర్వహణా విధానం(సీఎఫ్‌ఎమ్‌ఎస్)లో ఎంట్రీ చేసి బిల్లులు పొందేవారు. ఇలా చెక్కు ఇస్తే అలా డబ్బులు వచ్చేవి. చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అవసరాలకు ఆ డబ్బులను వాడుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం సీఎఫ్‌ఎమ్‌ఎస్ పద్ధతిలో ఎంట్రీ చేసే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులుస్తున్నది, ఈ భరోసాతో ఇప్పటికే పల్లె ప్రకృతివనాలు, శ్మశానవాటికలు, ఆయా పనుల కోసం సర్పంచ్‌లు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టారు. కానీ, కరోనా దగ్గర నుంచి నిధులు సరిగ్గా విడుదల కావడం లేదు. నాలుగైదు నెలలు ఫ్రీజింగ్ పెడుతుండటంతో సర్పంచ్‌ల కష్టాలు తీవ్రతమయ్యాయి. ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో మార్చి, ఏప్రిల్‌లో హెచ్చుతగ్గులను సరిచేసుకునేందుకు ఫ్రీజింగ్ పెట్టేవారు. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీజింగ్ పెట్టడంతో సర్పంచ్‌లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులు అభివృద్ధి కార్యక్రమాలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల సర్దుబాటుకు అప్పులు చేసిన సర్పంచ్‌లు ఇక తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. 'గ్రామాభివృద్ధి కోసం రూ.18 లక్షలు ఖర్చుపెట్టా. అందులో 15 లక్షల దాకా అప్పులు చేసి పెట్టినవే. గ్రామ పంచాయతీ ఖాతాలో రూ. 27.5 లక్షల వరకు ఉన్నాయి. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినా విడుదల కావట్లేదు. మరోవైపు అప్పులకు వడ్డీ ఇంతింతై పెరిగిపోతున్నది. ఏం అర్థమైతలేదు. పేరుకే అధికార పార్టీ సర్పంచ్‌ని గానీ ఏం చేయలేని దుస్థితి' అని పేరు రాయడానికి ఇష్టపడని నల్లగొండ జిల్లాకు టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. రాష్ట్రంలోని 12680 మంది సర్పంచ్‌లదీ ఇంచుమించు ఇదే వ్యథ. రంగారెడ్డి జిల్లాలో ఓ ఏకగ్రీవ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోగా..మరో సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఉత్పవ విగ్రహాలు సర్పంచ్‌లు..కార్మికులకు అందని జీతాలు : పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
గతంలో ఎవరూ చేయని విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. చాలా పంచాయతీలకు సకాలంలో నిధులు అందట్లేదు. వచ్చినా ఫ్రీజింగ్ పేరుతో ఆపేస్తున్నారు. సకాలంలో డబ్బులు రాక సర్పంచ్‌లు ఉత్సహ విగ్రహాలుగా మారారు. కనీసం పంచాయతీ కార్మికులకు జీతాల్విట్లేదు. నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం బాధాకరం.
చేసిన పనులకు బిల్లులు వచ్చేలా చూడాలి : భూమన్న యాదవ్, సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు
రాష్ట్రంలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా సర్పంచ్‌ల పరిస్థితి తయారైంది. చూడటానికి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తున్నట్టు గొప్పలు చెబుతున్నా అక్కరకు రాకపోతే ప్రయోజనమేమీ? ఖజానాల్లో మూలిగితే సర్పంచ్‌లకు ఒరిగేదేం లేదు. ఓ పక్క అప్పులు తీర్చలేక సర్పంచ్‌లు అరిగోస దీస్తున్నరు. వెంటనే చేసిన పనులకు బిల్లులు వచ్చేలా చూడాలి.
సర్పంచ్‌లకు ఖర్చుపెట్టుకునే అవకాశమివ్వాలి- చింపుల సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు
గ్రామపంచాయతీ 15వ ఫైనాన్స్‌కమిషన్ ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా ఈ ఫ్రీజింగ్ ఏమిటి? సర్పంచ్‌లు ఖర్చుపెట్టుకునే వెసులుబాటు కల్పించాలి. 15వ ఫైనాన్స్ కమిషన్‌లో నీటి, పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం ఖర్చుపెట్టాలని ఉంది. మనదగ్గర మిషన్‌భగీరథ, పల్లెప్రగతితో వాటర్, పారిశుధ్య నిర్వహణ సమస్యలు పెద్దగా లేవు. వేరేవాటికి వాడుకునేలా మార్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది.