Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త బియ్యం వాడాలి
- డీఈవోలకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల ఒకటి నుంచి పిల్లలను బడులకు పంపించేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సమ్మతి తెలియజేశారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనలేవీ లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు, ఆన్‌లైన్ బోధననలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని సూచించారు. వచ్చేనెల ఒకటి నుంచి పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను సన్నద్ధం చేసేందుకు బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో డీఈవోలు, డీఐఈవోలతో వేర్వేరుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. లక్షలాది మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నందున కోవిడ్ మార్గదర్శకాలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు పంపడం సురక్షితమే అన్న భావనను తల్లిదండ్రుల్లో కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జిల్లాస్థాయిలో విద్యాసంస్థల నిర్వహణకు అంతా జిల్లాస్థాయి విద్యాపర్యవేక్షణ కమిటీలదేనని తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, ఇతర ఆహార పదార్థాలన్నింటినీ కొత్తవి మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు తరగతి గదులకు హాజరవుతున్న సందర్భంగా థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. తరగతి గదులను శానిటైజ్ చేసే ప్రక్రియను నిరంతరం చేయాలనీ, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 70 శాతం సిలబస్ పూర్తయినందున, విద్యార్థుల సందేహాలతోపాటు మిగతా సిలబస్‌పై దృష్టిసారించాలని ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థలూ కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. పాఠశాలల పారిశుధ్య పనులను స్థానిక సంస్థలు నిర్వహించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల్లో మనోధైర్యం పెంచేలా చర్యలు చేపట్టాలని వివరించారు.
ఇంటర్ విద్యార్థులకు రోజూ ప్రాక్టికల్ తరగతులు
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇతర తరగతులతోపాటు ప్రతిరోజూ ప్రాక్టికల్ తరగతులను నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన వివరాలను వారంరోజుల్లో వెల్లడిస్తామన్నారు. ప్రతి కాలేజీలో విధిగా ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయివేటు కాలేజీలూ కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కళాశాల వారీగా రూపొందించి అమలు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.