Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌తో భారత్ రెండో టీ20 నేడు
- ఉప్పల్ విజయం జోరుమీదున్న కోహ్లిసేన
- పుంజుకునేందుకు కరీబియన్లకు మరో చాన్స్
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
పొట్టి సమరం అంటేనే అంచనాలకు అందనిది. మ్యాచ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. వెస్టిండీస్‌తో తొలి టీ20లోనూ అదే జరిగింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అండ లేకుండా 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించటం కష్టమే అనిపించింది. కానీ విరాట్ కోహ్లి కళాత్మక విధ్వంసం మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. ఉత్కంఠ పోరు కాస్త ఏకపక్షమైంది. టీ20 వరల్డ్‌కప్ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌కు ఓటములు కొత్త కాదు!. 2016 ప్రపంచకప్ తర్వాత విండీస్ 12 టీ20లు నెగ్గగా, 26 ఓడింది. ఇటీవల గత పది మ్యాచుల్లో 9 పరాజయాలే చవిచూసింది. అయినా, వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పొట్టి ఫార్మాట్‌లో కరీబియన్ జట్టుకు ఉన్న క్రేజ్ అలాంటిది. సిరీస్ విజయం కోసం కోహ్లిసేన సిద్ధమవుతుండగా, సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని వెస్టిండీస్ తాపత్రయం. తిరువనంతపురంలో నేడు రెండో టీ20 సమరం.
నవతెలంగాణ- తిరువనంతపురం
టెస్టు క్రికెట్‌లో జెంటిల్‌మెన్‌షిప్‌తో గౌరవం అందుకున్న కోహ్లిసేన.. ఫార్మాట్ మారగానే పద్దతి కూడా మార్చుకుంది!. 2020 టీ20 ప్రపంచకప్ సన్నాహక సమరాల్లో కొత్త పంథాను పాటిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఉప్పల్ టీ20లో జట్టును ముందుండి నడిపింటమే కాదు.. మైదానంలో ప్రత్యర్థిని కవ్వించటంలోనూ ముందు నిలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మైదానంలో స్నేహపూర్వక కవ్వింపులు ఆటకు ఎప్పుడూ మంచి చేసేవే. ప్రత్యర్థిని గౌరవిస్తూనే, ఆటలో సవాల్ విసరటంలో కరీబియన్లది ప్రత్యేక శైలి. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టు తొలి మ్యాచ్‌లోనే పరుగుల ప్రవాహం కనిపించింది. నేడు రెండో మ్యాచ్‌లోనూ ఇరు జట్ల పరుగుల వరదలో, వికెట్ల వేటలో కవ్వింపు కనిపించేందుకు ఆస్కారం ఎక్కువ. ఇరు జట్లలోనూ భారీ లక్ష్యాలను ఛేదించగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ భారీ స్కోర్లను కాపాడుకోవటంలో ఇరు జట్ల బౌలింగ్ బృందాలపై అనుమానాలు ఉన్నాయి. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఛేదించే జట్టుకు అధిక ప్రయోజనం. టీమ్ ఇండియా టీ20 సిరీస్‌పై కన్నేసిన వేళ మరోసారి టాస్ కీలక పాత్ర పోషించనుంది.
బంతితో మెరుగవ్వాలి : బంతితో భారత్, వెస్టిండీస్‌ది ఒకే స్థితి. భారత్ పూర్తి స్థాయి బౌలర్లతో బరిలో లేదు. కానీ వెస్టిండీస్ వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లోనూ ఇంచు మించుగా ఇదే బౌలింగ్ బృందంతో బరిలోకి దిగాల్సి ఉంది. పవర్ ప్లేలో వాషింగ్టన్ సుందర్ ప్రభావశీల స్పిన్నర్‌గా నిరూపించుకున్నా ఉప్పల్‌లో ఆ ముద్ర కనిపించలేదు. మూడు ఓవర్లలో 11.33 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నాడు. బంగ్లాపై విజృంభించిన దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ సైతం పరుగుల నియంత్రణ పాటించలేదు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్ మాత్రమే ఫర్వాలేదనిపించారు. మంచు ప్రభావంలో బౌలింగ్ చేయాల్సి వస్తే గణాంకాలు మరింత దిగజారే అవకాశం ఉంది. వెస్టిండీస్ జట్టులో స్ట్రయిక్ రొటేషన్ కంటే బౌండరీల సాధనపైనే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బౌండరీలను నియంత్రించే బంతులు సంధించటం బౌలర్లకు సవాల్.
మరోవైపు వెస్టిండీస్ పరిస్థితి మరీ దారుణం. కాస్రెక్ విలియమ్స్‌ను ఉప్పల్‌లో విరాట్ కోహ్లి వీర బాదుడు బాదాడు. అయినా, విలియమ్స్ అంత చెత్త బౌలర్ ఏమీ కాదు. పచ్చిక పిచ్ లభిస్తే విలియమ్స్ అత్యంత ప్రమాదకారి. సీనియర్ సీమర్ జేసన్ హౌల్డర్ పరుగుల నియంతణ్రలో, వికెట్ల వేటలో నిరాశపరిచాడు. షెల్డన్ కాట్రెల్ ఒక్కడే నాలుగు ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. టీ20ల్లో ఇటువంటి ప్రదర్శన మ్యాచ్ ఫలితాల్ని శాసిస్తుంది. కానీ అతడికి మరో బౌలర్ నుంచి అండ దక్కలేదు. కారీ పీరే, హెడెన్ వాల్ష్‌లు బ్యాట్స్‌మెన్‌ను ఇరుకున పెట్టడంలో విఫలమయ్యారు. తిరువనంతపురంలోనూ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం గణనీయంగా ఉండనుంది. దీంతో వెస్టిండీస్‌తో పాటు భారత బౌలర్ల ప్రదర్శనపైనా ఆసక్తి పెరుగుతోంది.
ధనాధన్‌లో నువ్వా నేనా : క్రికెట్ పుస్తకాల్లో షాట్లను అలవోకగా ఆడటంలో భారత్‌ది అందెవేసిన చేయి. ఎడాపెడా బాది బౌండరీలు సాధించటంలో వెస్టిండీస్‌ది తిరుగులేని నైజం. ఈ ఒక్క తేడా భారత్‌ను 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించేలా చేసింది. వెస్టిండీస్‌ను 2016 పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిపింది. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న భారత్.. టీ20ల్లో పరుగుల సాధన శైలి మార్చుకుంది. బౌండరీల పరంగా ఉప్పల్‌లోనూ విండీస్ పైచేయి సాధించినా.. భారత్ ఏమీ తక్కువ తినలేదు. కోహ్లిసేన 12 సిక్సర్లు, 12 ఫోర్లతో 120 పరుగులు పిండుకోగా.. వెస్టిండీస్ 15 సిక్సర్లు, 11 ఫోర్లతో 134 పరుగులు సాధించింది.
కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ ప్రదర్శనతో నేడు రెండో టీ20లోనూ భారతే ఫెవరేట్. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సైతం తోడైతే కరీబియన్ బౌలర్లకు చుక్కలే. ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ విశేషంగా ఆకట్టుకున్నాడు. ధావన్ లేని సమయంలో అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. అమూల్యమైన అర్ధ సెంచరీతో పాటు కెప్టెన్ కోహ్లితో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్ రాణించాడు. కీలక సమయంలో 9 బంతుల్లోనే 18 పరుగులు చేసి సాధించాల్సిన రన్‌రేట్‌ను నేలకు దించాడు. శ్రేయాష్ అయ్యర్, శివం దూబె అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. టీ20 ఫామ్‌లో ఉన్న మనీశ్ పాండేకు నేడూ అవకాశం లభించనట్టే. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్‌లతో భారత్‌కు లోతైన బ్యాటింగ్ సామర్థ్యం ఉంది.
కరీబియన్ శిబిరంలో అరివీర భయంకరులు క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్‌వేట్‌లు లేరు. అయినా, భారీ సిక్సర్లు బాదగల ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవ లేదు. ఉప్పల్ మ్యాచ్‌తో ఈ విషయం తేలిపోయింది. యువ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్మయర్, బ్రాండన్ కింగ్‌లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకోగల సమర్థులు. వారికి నేడు నికోలస్ పూరన్ తోడు కానున్నాడు. లెండ్లి సిమోన్స్, ఎవిన్ లెవిస్ ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. ఛేదనలో వెస్టిండీస్‌ను నిలువరించటం అంత సులువు కాదు. టెయిలెండర్లు సైతం స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ తరహాలో సిక్సర్లు బాదగలరు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్, శివం దూబె, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
వెస్టిండీస్ : లెండ్లి సిమోన్స్, ఎవిన్ లెవిస్, బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్మయర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, జేసన్ హౌల్డర్, కారీ పీరే, కాస్రిక్ విలియమ్స్, షెల్డన్ కాట్రెల్, హెడెన్ వాల్ష్.
పిచ్, పరిస్థితులు : తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఇది రెండో టీ20. తొలి టీ20 వర్షం ఆటంకానికి గురైంది. ఓ వన్డేలోనూ పిచ్ నెమ్మదిగా స్పందించింది. దేశవాళీ టీ20 మ్యాచుల్లో ఇక్కడ స్పిన్నర్లకు అధిక సహకారం లభించింది. నేడు మ్యాచ్‌లోనూ పిచ్ నెమ్మదిగా స్పందించే అవకాశం లేకపోలేదు. స్పిన్ ప్రధాన భూమిక వహించే అవకాశం ఉన్నప్పటికీ.. గ్రీన్‌ఫీల్డ్‌లో సీమర్లకు ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయి. మ్యాచ్ రోజు వాతావరణం వేడిగా ఉండనుంది. సాయంత్రం చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.