Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో చెలరేగిన విరాట్ కోహ్లి
- రాణించిన రాహుల్, రిషబ్ పంత్
- తొలి టీ20లో భారత్ ఘన విజయం
నవ తెలంగాణ-హైదరాబాద్
ఛేదనలో మొనగాడు చెలరేగాడు. ఉప్పల్‌లో పెను ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లి (94 నాటౌట్, 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కోహ్లి మెరుపులతో తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (62, 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ తొలుత 207/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ ఆటగాడు షిమ్రోన్ హెట్మయర్ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (37, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరిశారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
కోహ్లి, రాహుల్ కొట్టేశారు : 208 పరుగుల భారీ ఛేదనలో భారత్ ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (62, 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో వికెట్‌కు వంద పరుగులు జోడించారు. సాధించాల్సిన రన్‌రేట్‌కు అనుగుణంగా దూకుడుగా ఆడిన కోహ్లి, రాహుల్ ధాటిగా పరుగులు రాబట్టారు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. తర్వాత చెలరేగాడు. మరో రెండు భారీ సిక్సర్లతో ఛేదనకు ఊపు తీసుకొచ్చాడు. దూకుడుగా ఆడబోయి వికెట్ కోల్పోయినా.. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లి విండీస్ బౌలర్లపై నియంత్రణ సాధించాడు. యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (18, 9 బంతుల్లో 2 సిక్స్‌లు) రెండు సిక్సర్లతో రెచ్చిపోయినా ఎక్కువ సేపు వికెట్ నిలుపుకోలేదు. శ్రేయాష్ అయ్యర్ (4) నిరాశపరిచినా కెప్టెన్ కోహ్లి ఒంటరిగానే పని పూర్తి చేశాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కోహ్లి.. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఉప్పల్‌లో యువ విరాట్ మాదిరి బౌలర్లను కవ్వించిన కోహ్లి కెరీర్‌లో అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ ఆడాడు!.
విండీస్ ధనాధన్ : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా ఛేదనకు మొగ్గు చూపింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌కు ఫామ్‌లో ఉన్న సీమర్ దీపక్ చాహర్ తొలి షాక్ ఇచ్చాడు. సీనియర్ ఓపెనర్ లెండ్లి సిమోన్స్ (2)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సాగనంపాడు. సిమోన్స్ నిష్క్రమణతో కరీబియన్లు ఒత్తిడిలో పడతారనే భావన నెలకొంది. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రాండన్ కింగ్ (31, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ బౌండరీలపైనే కన్నేసింది. లెవిస్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సీపీఎల్ ఫామ్‌లో ఉన్న బ్రాండన్ కింగ్ సైతం మూడు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో విండీస్ రన్‌రేట్ పదికి పైగా నమోదైంది. అర్థ సెంచరీ ముందు లెవిస్ అవుటైనా.. కరీబీయన్ల జోరు తగ్గలేదు. షిమ్రోన్ హెట్మయర్ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర విహారం చేశాడు. కింగ్‌తో కలిసి కదం తొక్కిన హెట్మయర్ వెస్టిండీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన హెట్మయర్ అర్థ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్‌ను పంత్ స్టంపౌట్ చేశాడు. హెట్మయర్‌తో జతకలిసిన విధ్వంసకారుడు కీరన్ పొలార్డ్ (37, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొలార్డ్ నాలుగు సిక్సర్లతో వెస్టిండీస్ స్కోరు 200 దాటేలా చేశాడు. హెట్మయర్, పొలార్డ్ డగౌట్‌కు చేరుకోగా.. ఆఖర్లో జేసన్ హౌల్డర్ (24 నాటౌట్, 9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్ రామ్‌దిన్ (11 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్) మెరుగైన ముగింపునిచ్చారు. మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : లెండ్లి సిమోన్స్ (సి) రోహిత్ శర్మ (బి) దీపక్ చాహర్ 2, ఎవిన్ లెవిస్ (ఎల్బీ) వాషింగ్టన్ సుందర్ 40, బ్రాండన్ కింగ్ (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) రవీంద్ర జడేజా 31, షిమ్రోన్ హెట్మయర్ (సి) రోహిత్ శర్మ (బి) చాహల్ 56, కీరన్ పొలార్డ్ (బి) చాహల్ 37, జేసన్ హౌల్డర్ నాటౌట్ 24, దినేశ్ రామ్‌దిన్ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207.
వికెట్ల పతనం : 1-13, 2-64, 3-101, 4-172, 5-173.
బౌలింగ్ : వాషింగ్టన్ సుందర్ 3-0-34-1, దీపక్ చాహర్ 4-0-56-1, భువనేశ్వర్ కుమార్ 4-0-36-0, రవీంద్ర జడేజా 4-0-30-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-36-2, శివం దూబె 1-0-13-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) హెట్మయర్ (బి) పీరీ 8, కెఎల్ రాహుల్ (సి) పొలార్డ్ (బి) పీరీ 62, విరాట్ కోహ్లి 94 నాటౌట్, రిషబ్ పంత్ (సి) హౌల్డర్ (బి) కాట్రెల్ 18, శ్రేయాష్ అయ్యర్ (సి,బి) పొలార్డ్ 4, శివం దూబె 0 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 23, మొత్తం : (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 209.
వికెట్ల పతనం : 1-30, 2-130, 3-178, 4-193.
బౌలింగ్ : షెల్డన్ కాట్రెల్ 4-0-24-1, జేసన్ హౌల్డర్ 4-0-46-0, క్యారీ పీరీ 4-0-44-2, హెడెన్ వాల్ష్ 2-0-19-0, కెస్రిక్ విలియమ్స్ 3.4-0-60-0, పొలార్డ్ 1-0-10-1.