Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్‌లో తొమ్మిదవది.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లమ్
సిడ్నీ: ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరో సారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో అతని ఖాతాలో తొమ్మిదవ గ్రాండ్‌స్లమ్ వచ్చిచేరింది. రష్యాకు చెందిన ప్రపంచ నాల్గో ర్యాంకు ఆటగాడు మెద్వదేవ్‌తో ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్స్ జరిగింది. ఫైనల్లో తొలిసెట్ హౌరాహౌరిగా సాగింది. కానీ తర్వాతి రెండు సెట్లలో జకోవిచ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించాడు. కాగా, జకోవిచ్ వరుసగా గత మూడు టైటిళ్లను సొంత చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం తొమ్మిదవ సారి. మొత్తం తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్. అంతేగాక, జకోవిచ్ ఆడిన అన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం విశేషం. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మరోవైపు ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి జకోవిచ్ మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు. ఫెదరర్, నాదల్ చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన సంగతి తెలిసిందే.