Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఓ సంచలనం
- ప్రత్యామ్నాయ క్రికెటర్లపైనా కోట్ల వర్షం
2021లో జరగాల్సిన ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అన్ని ప్రాంఛైజీలు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. అన్ని జట్లు సుమారుగా తుది జట్ల కూర్పునూ వేలానికి ముందే సమకూర్చుకున్నాయి. దీంతో ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ప్రాంఛైజీలు పెద్దగా పోటీపడతాయని ఎవరూ అనుకోలేదు. అంచనాలకు భిన్నంగా వేలం సాగింది. ఆల్‌రౌండర్లు, ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు కోట్ల వర్షం కురిపించాయి. రూ.పది కోట్ల క్లబ్‌ను మినహాయించి..ఈ వేలంలో ప్రాంఛైజీల వ్యూహలు ఎలా సాగాయో చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆల్‌రౌండర్లపై కోట్లు కుమ్మరించారు :
టామ్ కరన్, డాన్ క్రిస్టియన్, మోయిసిస్ హెన్రిక్స్‌లు ఏ జట్టులోనైనా తొలి ప్రాధాన్య తుది జట్టులో ఉంటారని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అయినప్పటికీ ఈ అందరూ వేలంలో రూ. 4 కోట్లకు పైగా ధరను దక్కించుకున్నారు. టామ్ కరన్ గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు పది మ్యాచులు ఆడాడు. కానీ డాన్ క్రిస్టియన్ చివరగా ఐపీఎల్ మ్యాచ్‌ను 2018లో ఆడాడు. హెన్రిక్స్ ఏకంగా 2017లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అయితేనేం, ఐపీఎల్ వేలంలో రికార్డు ధరలకు అమ్ముడుపోయారు.
ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లకు తొలి నుంచీ ప్రాధాన్యం ఎక్కువ. ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్లు అయినా, వారిపై ప్రాంఛైజీలు మోజు పడుతున్నాయి. బయో బబుల్ కాలంలో క్రికెటర్లు తరచుగా గాయాల బారిన పడుతున్నారు. అటువంటి సమయాల్లో తుది జట్టులోకి వచ్చి మెరిసే వారిపై ప్రాంఛైజీలు కన్నేశాయి. కనీసం ఐదు ప్రాంఛైజీలు విదేశీ ఆల్‌రౌండర్ కోసం పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టామ్ కరన్‌ను తీసుకోగా..పంజాబ్ హెన్రిక్స్‌ను తీసుకుంది. బెంగళూర్ క్రిస్టియన్‌తో సరిపెట్టుకుంది. ఈ రేసులోకి రాని కోల్‌కత బెన్ కట్టింగ్‌ను రూ. 75 లక్షల కనీస ధరకు, జిమ్మీ నీషమ్‌ను ముంబయి ఇండియన్స్ రూ. 50 లక్షల కనీస ధరకు, ఫబియన్ అలెన్‌ను కింగ్స్ రూ.75 లక్షలకు తీసుకున్నాయి.
బ్యాట్స్‌మెన్‌పై ఎందుకు నిరాసక్తి! :
వరల్డ్‌కప్ స్టార్ జేసన్ రారు, 2019లో అత్యధిక టీ20 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్, ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ అరోన్ ఫించ్, ఎవిన్ లెవిస్‌లు కనీసం ఒక్క బిడ్‌నూ దక్కించుకోలేకపోయారు. టీ20 నం.1 బ్యాట్స్‌మన్ డెవిడ్ మిలాన్ రూ.1.5 కోట్ల కనీస ధరకే అమ్ముడుపోయాడు. ప్రపంచ అగ్ర బ్యాట్స్‌మన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గత సీజన్లలో రూ.12.5 కోట్లకు ఇంటికి తీసుకెళ్లాడు. కానీ ఈ ఏడాది అతడు రూ.2.2 కోట్లను మాత్రమే సొంతం చేసుకున్నాడు.
అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ను సైతం తీసుకునేందుకు ప్రాంఛైజీలు పోటీపడలేదు. అందుకు కారణం, ఏ ప్రాంఛైజీకి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అవసరం లేదు. అన్ని జట్లకు టాప్ ఆర్డర్, ఓపెనర్లు ఉన్నారు. దీంతో బడ్జెట్‌ను ఇతర అవసరాల కోసం దాచుకున్నాయి. స్మిత్ కోసం బిడ్ వేసిన పంజాబ్ కింగ్స్‌కు.. రాజస్థాన్ రాయల్స్ మాదిరిగానే బలమైన టాప్ ఆర్డర్ ఉంది. జోశ్ ఫిలిప్‌పై నమ్మకం ఉంచిన బెంగళూర్ అందుకే స్మిత్ కోసం బిడ్ వేయలేదు. వేలంలో బ్యాట్స్‌మెన్ పేర్లు ముందుగా వచ్చినా.. ప్రాంఛైజీలు పర్స్‌ను ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్ల కోసం అట్టిపెట్టుకున్నాయి.
ముగ్గురిపై బెంగళూర్ గురి :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రూ.35.9 కోట్లతో వేలంలోకి అడుగుపెట్టింది. రూ.34.05 కోట్లను ఏకంగా ముగ్గురు క్రికెటర్ల కోసం వెచ్చించింది. గ్లెన్ మాక్స్‌వెల్, కైల్ జెమీసన్ సహా డాన్ క్రిస్టియన్‌లను సొంతం చేసుకునేందుకు బెంగళూర్ తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసింది. బెంగళూర్ శిబిరంలో 22 మంది ఆటగాళ్లే ఉన్నప్పటికీ, కోహ్లి జట్టు అన్ని విభాగాలనూ బలోపేతం చేసుకుంది. వేలానికి ముందే హర్షల్ పటేల్, డానియల్ శామ్స్‌ను ఢిల్లీ నుంచి తెచ్చుకున్న బెంగళూర్.. పేస్ విభాగంలో ఒకే ఒక్క నాణ్యమైన క్రికెటర్ కోసం చూశాయి. నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్‌లు ఇప్పటికే బెంగళూర్‌లో ఉన్నారు. అందుకే జెమీసన్‌పై బెంగళూర్ కోట్లు కుమ్మరించింది. దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌కు తోడు జోశ్ ఫిలిప్‌ను టాప్ ఆర్డర్ ప్రణాళికల్లో భాగం చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ రాకతో బెంగళూర్ టాప్-5 బ్యాట్స్‌మన్ శుత్రు దుర్బేధ్యంగా మారారు.
సన్‌రైజర్స్‌కు స్పిన్ త్రయం :
స్పిన్ త్రయం సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి చేరింది. సన్‌రైజర్స్‌కు ఇప్పటికే అగ్రశ్రేణి స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబిలు ఉన్నారు. మరో స్పిన్నర్ ముజీబ్ రెహమాన్ సైతం సన్‌రైజర్స్ శిబిరంలో చేరాడు. దీంతో ముగ్గురు అఫ్గాన్ స్పిన్నర్లు హైదరాబాద్ సన్‌రైజర్స్ సొంతమయ్యారు. ఈ ముగ్గురు ఒకే తుది జట్టులో చోటు సాధించలేరు. ఎందుకంటే డెవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేసన్ హౌల్డర్ లేదా జానీ బెయిర్‌స్టో సేవలు సన్‌రైజర్స్‌కు ఎంతో అవసరం. స్పిన్ పిచ్‌లపై ఆడాల్సి వచ్చినప్పుడు.. లేదంటే ఫింగర్ స్పిన్నర్ అవసరం అయినప్పుడు ముజీబ్ రెహమాన్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే ఆలోచనతో ఎంచుకుంది.
పుజారాను చెన్నై ఎందుకు తీసుకుంది :
2014 నుంచి ఐపీఎల్‌లో చతేశ్వర్ పుజారా ఆడటం లేదు. టెస్టు స్పెషలిస్ట్ పుజారా టీ20 స్ట్రయిక్‌రేట్ 109.35. బంతిని బలంగా బాదే ఫార్మాట్‌లో పుజారాను తీసుకునేందుకు ఇన్నేండ్లలో ఎవరూ ముందుకు రాలేదు. ఈ ఏడాది మురళీ విజరుని చెన్నై విడుదల చేసింది. ఈ సీజన్ భారత్‌లో జరిగే అవకాశాలు ఎక్కువ. చెపాక్ స్పిన్ పిచ్‌పై, తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో పుజారా కీలకం అవుతాడని చెన్నై భావించింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో పుజారా కీలక పాత్ర పోషిస్తాడనే వ్యూహంతోనే పుజారాను ఎంచుకుంది. ఈ సీజన్‌లో పుజారా ఐపీఎల్ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం మెండుగానే ఉంది.
కనిపించని ఆ రెండు దేశాల ప్రభావం :
ఐపీఎల్‌లోనే కాదు గ్లోబల్ టీ20 టోర్నీలలో కరీబియన్ క్రికెటర్ల ప్రభావం సుస్పష్టం. వేలంలో విండీస్ క్రికెటర్ల కోసం ప్రాంఛైజీలు పిచ్చి పోటీపడతాయి. తాజా ఐపీఎల్‌లో వెస్టిండీస్ సహా శ్రీలంక క్రికెటర్ల ప్రభావం ఎక్కుడా కనిపించలేదు. ఫబియన్ అలెన్ రూపంలో ఒకే ఒక్క వెస్టిండీస్ క్రికెటర్ వేలంలో అమ్ముడుపోయాడు. పేసర్ల జోరు సాగిన వేలంలోనూ షెల్డన్ కాట్రెల్, ఒసేన్ థామస్, రోవ్‌మాన్ పావెల్‌లను వేలంలో ఎవరూ తీసుకోలేదు. శ్రీలంక నుంచి ఏ క్రికెటర్ వేలంలో అమ్ముడుపోలేదు. నాణ్యమైన పేసర్లు, మెరుపు ఆల్‌రౌండర్ల కోసం పోటీపడిన వేలంలో ఈ రెండు విభాగాల్లో శ్రీలంక ప్రపంచ శ్రేణి క్రికెటర్లను తయారు చేయటంలో విఫలమైంది. ఫలితమే ఐపీఎల్ వేలంలో ఆ దేశ క్రికెటర్లకు నిరాశ ఎదురైంది.
2021 ఆటగాళ్ల వేలంలో క్రిస్ మోరీస్ రూ.16.25 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు ధర దక్కించుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూజిలాండ్ పేసర్ జెమీసన్ కోసం రూ. 15 కోట్లు ఖర్చు చేయటం.. అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆస్ట్రేలియా యువ పేసర్ మెరెడిత్ రూ.8 కోట్లను సొంతం చేసుకోవటం విశ్లేషకులను సైతం విస్మయపరిచింది.