Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో ఒసాక చేతిలో ఓటమి
- ఫైనల్లో అడుగుపెట్టిన జకోవిచ్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
గర్బిణిగా ఉండగానే నాలుగేండ్ల కిందట ఆమె 23వ గ్రాండ్‌స్లామ్ గెల్చుకుంది. తొలి బిడ్డకు జన్మనిచ్చిన ఉత్సాహంలో మళ్లీ కోర్టులోకి వచ్చింది. ఆ క్రమంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విక్రమార్క ప్రయత్నం చేసింది. కరోనా కష్టకాలంలోనూ ఆమె మెల్‌బోర్న్‌కు వచ్చింది. ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరేట్ కోర్టు 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును చేరుకునేందుకు ఆమె నాలుగేండ్లుగా అడుగు దూరంలోనే నిలిచింది. తాజాగా మెల్‌బోర్న్‌లో ఆ ఘనత సాధిస్తాననే విశ్వాసంతో కనిపించింది. కానీ ఇక్కడా ఆమెకు నిరాశ తప్పలేదు. సెమీఫైనల్లో వరల్డ్ నం.3 జపాన్ స్టార్ నవొమి ఒసాక చేతిలో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఓటమి బాధను జీర్ణించుకోలేని సెరెనా.. కన్నీంటి పర్యంతమవుతూ మీడియా సమావేశాన్ని ముగించింది.
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)
సెరెనా విలియమ్స్‌కు గట్టి షాక్. మహిళల సింగిల్స్ రికార్డు టైటిల్‌పై దీమాగా కనిపించిన అమెరికా దిగ్గజం సెమీఫైనల్లోనే ఇంటిబాట పట్టింది. మూడో సీడ్ నవొమి ఒసాక (జపాన్) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 6-3, 6-4తో సెరెనా విలియమ్స్‌పై నవొమి ఒసాక తిరుగులేని విజయం సాధించింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో అమెరికా తార జెన్నీఫర్ బ్రాడీతో ఒసాక అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యా క్రీడాకారుడు అస్లావ్ కారత్సెవ్‌పై 6-3, 6-4, 6-2తో జకోవిచ్ ఘన విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సిట్పిపాస్ (గ్రీసు), మెద్వదేవ్ (రష్యా)లలో ఒకరితో జకోవిచ్ తలపడనున్నాడు.
ఒసాక అదిరింది : 39 ఏండ్ల సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం కొత్త కాదు. మెల్‌బోర్న్‌లో అమెరికా స్టార్ ఏకంగా ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఎగరేసుకుపోయింది. అయినా, 24వ గ్రాండ్‌స్లామ్ విజయం సెరెనాకు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది!. బలమైన సర్వ్‌లు, విజయానాదంతో చేసే అరుపులు కోర్టులో ప్రత్యర్థిని తికమక పెడుతూనే ఉంటాయి. గురువారం నాటి సెమీఫైనల్స్ అందుకు భిన్నంగా సాగలేదు. కానీ ఫలితమే ఆమెకు ప్రతికూలంగా వచ్చింది. వరుస సెట్లలో 3-6, 4-6తో సెరెనా విలియమ్స్ చేతులెత్తేసింది. సెరెనా విలియమ్స్ మూడు ఏస్‌లు కొట్టగా.. ఒసాక ఆరు ఏస్‌లు సంధించింది. డబుల్ ఫాల్ట్స్ విషయంలో ఒసాక ఎనిమిది తప్పిదాలు చేయగా.. సెరెనా ఒక దానికే పరిమితం అయ్యింది. సెరెనా రెండు బ్రేక్ పాయింట్లు సాధించగా.. ఒసాక నాలుగు సాధించింది. సెరెనా ఒక్క నెట్ పాయింట్ సాధించగా, ఒసాక మూడు సాధించింది. విన్నర్ల పరంగా సెరెనా 12 సాధించగా, ఒసాక 20 విన్నర్లు సాధించింది. ఒసాక 21 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. సెరెనా 24 అనవసర తప్పిదాలకు పాల్పడింది. పాయింట్ల పరంగా ఒసాక 62-48తో స్పష్టమైన పైచేయి సాధించింది.
సెమీస్ సమరాన్ని సెరెనా దూకుడుగా ఆరంభించింది. తొలి సెట్‌లో ఒసాక తొలి సర్వ్‌ను సెరెనా బ్రేక్ చేసింది. తర్వాత తన సర్వ్‌ను నిలుపుకున్న సెరెనా 2-0 ఆధిక్యం సాధించింది. మూడో గేమ్‌లో పుంజుకున్న ఒసాక తన సర్వ్‌ను నిలుపుకోవటంతో పాటు సెరెనా సర్వ్‌ను బ్రేక్ చేసింది. స్కోరును 2-2తో సమం చేసింది. అదే ప్రదర్శనను మళ్లీ పునరావృతం చేసి ఆధిక్యాన్ని 5-2కు మెరుగుపర్చుకుంది. సెరెనా తన ఆఖరి సర్వ్‌ను నిలుపుకున్నా.. అప్పటికే ఒసాక విజయం ఖాయమైంది. 6-3తో తొలి సెట్ జపాన్ భామ సొంతమైంది. 38 నిమిషాల్లోనే ఒసాక తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో ఆరంభంలోనే సెరెనా సర్వ్‌ను ఒసాక బ్రేక్ చేసింది. 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒసాక సర్వ్‌ను బ్రేక్ చేయటంతో పాటు తన సర్వ్‌ను నిలుపుకున్న సెరెనా 4-4తో స్కోరు సమం చేసింది. మ్యాచ్‌ను ఉత్కంఠ స్థితికి తీసుకెళ్లింది. ఆఖర్లో సెరెనాకు షాక్ ఇచ్చిన ఒసాక వరుసగా రెండు గేములను గెల్చుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో సెట్‌ను ఒసాక 37 నిమిషాల్లోనే ముగించింది.