Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పుడూ విరాట్ కోహ్లికి డిప్యూటీనే
- భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె
భారత క్రికెట్ ఇప్పుడు విరాట్ కోహ్లి యుగంలో నడుస్తోంది. ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా, తిరుగులేని నాయకుడిగా విరాట్ కోహ్లి హవా నడుస్తోంది. ఐసీసీ ట్రోఫీలు సాధించటంలో వైఫల్యం కారణంగా వన్డే, టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్లు ఐపీఎల్ సీజన్ ముగిసిన ప్రతిసారీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం అనంతరం టెస్టు జట్టులోనూ కోహ్లి కెప్టెన్సీకి బలమైన పోటీదారుడు వచ్చేశాడు. ఆసీస్‌పై భారత్‌ను విజయపథాన నడిపిన అజింక్య రహానె.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కోహ్లికి డిప్యూటీకి వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లి, అజింక్య రహానెల కెప్టెన్సీపై చర్చ నడుస్తోన్న నేపథ్యంలో రహానె స్పందించాడు.
నవతెలంగాణ-ముంబయి
డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు పోరు. అప్పటికే ఆడిలైడ్‌లో అవమానకర ఓటమి. కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టుకు దూరమయ్యాడు. జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. తుది జట్టు ఎంపికలో రహానె మార్క్‌పై తొలి రోజే ప్రశ్నలు. ఎటుచూసినా, ప్రతికూలతలే కనిపించినా అతడు వెరవలేదు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో జట్టును గొప్ప స్ఫూర్తితో ముందుకు నడిపించాడు. చివరి మూడు టెస్టుల్లో రెండింట విజయాలు సాధించి, ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ట్రోఫీని భారత్‌కు సాధించిపెట్టాడు. కెప్టెన్‌గా విశేష అభిమానులను సొంతం చేసుకున్న అజింక్య రహానె ఫిబ్రవరి 5న చెన్నై చెపాక్‌లో మళ్లీ తన పాత బాధ్యతల్లోకి వెళ్లిపోనున్నాడు. విరాట్ కోహ్లి రాకతో రహానె తిరిగి వైస్ కెప్టెన్ పాత్ర పోషించనున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాన్ని అందించిన అజింక్య రహానె ఇంగ్లాండ్‌తో సిరీస్, విరాట్ కోహ్లితో బంధం, తుది జట్టులో తన చోటుపై స్పందించాడు.
' విరాట్ కోహ్లితో నా సంబంధాల్లో ఎటువంటి మార్పులు ఉండవు. విరాట్ కోహ్లి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ టెస్టు జట్టుకు, నాకు కెప్టెన్. నేను విరాట్ కోహ్లికి డిప్యూటినీ. అతడు లేని వేళ, నేను జట్టును ముందుకు నడిపించటం నా బాధ్యత. భారత జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తాను. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించటం పెద్ద విషయం కాదు. నాయకత్వ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించామనేది ముఖ్యం. కెప్టెన్‌గా ఇప్పటివరకు నేను విజయవంతమయ్యాను. భవిష్యత్‌లోనూ ఇలాగే చేస్తానని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లి, నేను ఎల్లప్పుడూ మంచి బంధాన్ని కలిగి ఉన్నాం. స్వదేశంలో, విదేశాల్లో నేను విరాట్ కోహ్లి ఎన్నో చిరస్మరణీయ భాగస్వామ్యాలు నమోదు చేశాం. విరాట్ కోహ్లి నం.4లో బ్యాటింగ్ చేయటం, నేను నం.5 స్థానంలో బ్యాటింగ్‌కు రావటం మా ఇద్దరికి మంచి భాగస్వామ్యాలు నిర్మించేందుకు వీలు కల్పించింది. కోహ్లి, నేను మరొకరి బ్యాటింగ్‌కు మద్దతుగా నిలుస్తాం. మేం ఇద్దరం క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరైనా నిర్లక్ష్య షాట్ ఆడితే వెంటనే హెచ్చరించుకుంటాం. విరాట్ కోహ్లి ఎంతో చురుకైన కెప్టెన్. ఆన్ ఫీల్డ్‌లో అతడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. స్పిన్నర్ల చేతికి బంతి అందించినప్పుడు స్లిప్స్‌లో క్యాచ్‌ల కోసం నన్ను నమ్ముకుంటాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్‌లో క్యాచుల కోసం నేను స్లిప్స్‌లో ఉంటాను. అతడు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు వంద శాతం ప్రయత్నిస్తాను. అతడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అనుకుంటాను. నిజాయితీగా చెబుతున్నాను, తుది జట్టులో నా చోటు ప్రమాదంలో పడిందని ఎప్పుడూ అనుకోలేదు. కెప్టెన్, జట్టు మేనేజ్‌మెంట్ ప్రతిసారి నాపై నమ్మకం ఉంచారు. కెప్టెన్సీ విషయానికొస్తే అది వ్యక్తికి, వ్యక్తికి మారుతుంది. జట్టు ఎంత బాగుంటే, కెప్టెన్ అంత బాగుంటాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం ఘనత నా జట్టుకే దక్కుతుంది. జట్టు సహచరులే కెప్టెన్‌ను మంచి నాయకుడిగా నిలుపుతారు' అని అజింక్య రహానె అన్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం అజింక్య రహానె మంగళవారం ముంబయి నుంచి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కానున్నారు.