Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైలో అభిమానులకు ప్రవేశం లేదు
- తొలి రెండు టెస్టులకు బీసీసీఐ నిర్ణయం
నవతెలంగాణ-చెన్నై : కరోనా వైరస్ మహమ్మారి అనంతరం భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ పున ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5న చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టుతో భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అవనుంది. 2020 ఏడాది అభిమాన క్రికెటర్ల ఆటను మైదానల్లో వీక్షించే అవకాశం కోల్పోయిన క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాశే మిగిల్చింది. అవుట్‌డోర్ క్రీడలకు 50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీసీసీఐ అభిమానులకు ప్రవేశం కల్పించటం లేదు. ఫిబ్రవరి 5న తొలి టెస్టు, ఫిబ్రవరి 13న రెండో టెస్టు చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగనున్నాయి. టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. ఐదు టీ20లు, మూడు వన్డేలకు అభిమానులను అనుమతించేందుకు అవకాశం కనిపిస్తోంది. కానీ తొలి దశలో భారత క్రికెట్ బోర్డు ఎటువంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేదు. ' కోవిడ్19 ప్రమాదకర పరిస్థితుల్లో ఇంగ్లాండ్, భారత్ సిరీస్‌లో ఆటగాళ్ల బయో భద్రత విషయంలో బోర్డు ఎటువంటి రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేదు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం తొలి రెండు టెస్టులను అభిమానులకు ప్రవేశం కల్పించటం లేదు. ఖాళీ స్టేడియంలోనే మ్యాచులు నిర్వహించనున్నాం' అని టిఎన్‌సీఏ కార్యదర్శి ఆర్ రంగస్వామి తెలిపారు.
మూడు జోన్ల బబుల్! : శ్రీలంక పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్ జట్టు నేడు ఉదయం చెన్నైకి చేరుకోనుంది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్‌లు ఇప్పటికే చెన్నైకి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నారు. 31 మంది సభ్యుల ఇంగ్లాండ్ క్రికెట్ బృందం చెన్నైకి చేరుకున్న అనంతరం క్వారంటైన్ ముగించుకున్న అనంతరమే ప్రాక్టీస్ సెషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అభిమానులకు ప్రవేశం లేని చెన్నై చెపాక్ స్టేడియంలో బయో భద్రత కోసం తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మూడు జోన్ల బయో సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. జోన్ 1లో ఇరు జట్ల క్రికెటర్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు ఉండనున్నారు. జోన్ 1ఏలో క్రికెటర్ల కుటుంబ సభ్యులు, నెట్ బౌలర్లు ఉండనున్నారు. జోన్ 1లో టిఎన్‌సీఏ అధికారులు, బీసీసీఐ ఆఫీస్ బేరర్లులు ఉండనున్నారు. జోన్ 3లో మైదానం వెలుపల భద్రతా సిబ్బంది, పోలీసులు ఉండనున్నారు. చెన్నై బయో బబుల్‌ను దాటి క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు లేదని టిఎన్‌సీఏ అధికారులు స్పష్టం చేశారు. భారత క్రికెటర్లు సైతం బుధవారం చెన్నైకి రానున్నారు. వివిధ నగరాల నుంచి క్రికెటర్లు చెన్నైకి చేరుకుని నేరుగా హౌటల్ గదిలో క్వారంటైన్‌లో ఉండనున్నారు.
చెపాక్ లో ఇంగ్లీష్ పిచ్! : చెన్నై చెపాక్ అనగానే స్పిన్ పిచ్ గుర్తొస్తుంది. ఐపీఎల్‌లోనూ చెపాక్ పిచ్ నెమ్మదిగా స్పందించటం అందరికీ తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు చెపాక్ పిచ్ ఇంగ్లీష్ పిచ్ తరహాలో ఉండనుందని సమాచారం. మూడు రోజుల వ్యవధిలో చెపాక్ స్టేడియం రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పిచ్‌పై పచ్చిక ఉంచనున్నారు. ఏక కాలంలో రెండు పిచ్‌లను తయారు చేస్తున్నారు. పిచ్ నుంచి పేసర్లు, స్పిన్నర్లకు సహకారం ఉండేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్టు క్యూరేటర్ తెలిపాడు.