Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచిన్, షేన్ వార్న్ తీవ్ర అభ్యంతరం
- ఈ నిబంధనతో బౌలర్లకు తీరని నష్టం
- ఐసీసీ క్రికెట్ కమిటీపై పెరుగుతున్న ఒత్తిడి
అంపైర్ నిర్ణయ సమీక్ష (డిఆర్‌ఎస్)పై మరోసారి క్రికెట్ పండితులు చర్చిస్తున్నారు. బీసీసీఐ అభ్యంతరాలు, సుదీర్ఘ మంతనాల అనంతరం అమల్లోకి వచ్చిన డిఆర్‌ఎస్‌పై ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సాంకేతికతను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవటం ఆరంభించిన తర్వాత, వంద శాతం టెక్నాలజీని వినియోగించుకోవాలని.. ఇంకా ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి అంతిమ గౌరవం ఇవ్వటం ఏమిటనే వాదన మొదలైంది. భారత్, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో డిఆర్‌ఎస్‌లో 'అంపైర్ కాల్' నిర్ణయాలపై క్రికెట్ దిగ్గజాలు మండిపడ్డారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జో బర్న్స్ ఎల్బీ అప్పీల్ నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సంధించిన బంతికి అంపైర్ ఎల్బీ అవుట్ నిరాకరించాడు. అంపైర్ నిరాకరణతో భారత్ డిఆర్‌ఎస్‌తో మూడో అంపైర్‌ను సంప్రదించింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను తగు లుతున్నట్టు చూపించింది. అయినా, డిఆర్‌ఎస్ నిర్ణయంలో మార్పు లేదు. అంపైర్ కాల్‌తో జో బర్న్స్ బతికిపోయాడు. అదే ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నం.3 బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ సైతం ఇలాగే బతికిపోయాడు. మహ్మద్ సిరాజ్ సంధించిన బంతి లబుషేన్ బెయిల్స్‌ను ముద్దాడుతున్నట్టు బాల్ ట్రాకింగ్‌లో స్పష్టంగా కనిపించింది. అయినా, సమీక్షలో భారత్‌కు వ్యతిరేక నిర్ణయమే వెలువడింది. మార్నస్ లబుషేన్ క్రీజు వీడలేదు. నాల్గో రోజు ఆటలో మిచెల్ స్టార్క్ ఎల్బీకి భారత్ అప్పీల్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ సంధించిన క్యారమ్ బంతి స్టార్క్ మిడిల్, లెగ్ స్టంప్స్ మధ్య బెయిల్స్‌ను తాకుతోంది. అయినా, అంపైర్ అవుట్ ఇవ్వలేదు. భారత్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ మూడు నిర్ణయాల్లో 'అంపైర్ కాల్' నిబంధన కారణంగా టీవీ అంపైర్ నాటౌట్ నిర్ణయాలను ప్రకటించాడు. డిఆర్‌ఎస్ టెక్నాలజిని వాడుతున్న ఆధునిక క్రికెట్ కాలంలో ఇంకా ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటాన్ని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ ప్రశ్నిస్తున్నారు. డిఆర్‌ఎస్ నిబంధనల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యతకను ఐసీసీకి గుర్తు చేస్తున్నారు.
అంపైర్ కాల్ అంటే ఏమిటీ? : అంపైర్ నిర్ణయ సమీక్ష విధానం (డిఆర్‌ఎస్)లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉత్పన్నం అయిన సందర్భంలో అంపైర్ కాల్‌ను ఉపయోగిస్తున్నారు. సాంకేతిక విధానంలో బలమైన ఆధారాలు కనిపించనప్పుడు లేదా స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రకారం ఆన్‌ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్నే బలపరుస్తున్నారు. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో వికెట్ ఏరియాల్లో ట్రాకింగ్ టెక్నాలజీ ప్రకారం బంతి 50 శాతం కంటే తక్కువగా స్టంప్ట్స్‌ను తగులుతున్నప్పుడు టీవీ అంపైర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్నే సమర్థిస్తాడు. ఇటువంటి నిర్ణయాలకు సమీక్ష కోరిన జట్టు తమ సమీక్షలను కోల్పోదు. బాల్ ట్రాకింగ్ విధానంలో బంతి బెయిల్స్‌ను తాకడాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. వికెట్ ఏరియా (మూడు స్టంప్స్ ప్రాంతం)లో బంతి కనీసం 50 శాతం కనిపించాలి. ప్రొజెక్షన్‌లో బంతి 50 శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే, అప్పుడూ అంపైర్ కాల్‌నే అంతిమంగా తీసుకుంటారు. 2016, అక్టోబర్ 1 నుంచి ఐసీసీ ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
అభ్యంతరం ఎందుకు? : వికెట్‌కు బంతి 5 శాతం తగిలినా, దాన్ని బౌల్డ్‌గా పరిగణిస్తాం. బంతి బెయిల్స్‌ను ముద్దాడుతూ వెళ్లినా అది బౌల్డ్ అవుతుంది. కానీ, ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో మాత్రం కచ్చితంగా బంతి 50 శాతానికి తగ్గకుండా తగలాలనే నిబంధనను చేర్చారు. ఇది బౌలర్లకు తీవ్ర నిరాశ మిగిల్చుతోంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మెన్‌కు అనుచిత లబ్ది కలుగుతోంది. టెన్నిస్‌లో హాక్ ఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీని ప్రకారం బంతి ఎక్కడ పడిందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ టెన్నిస్ నిర్వాహకులు ఎంత శాతం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. లైన్‌కు బంతి ఏమాత్రం తాకినా, దానిని ఇన్‌గా పరిగణనిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లోనూ సమీక్షకు ఇదే విధానం వాడుతున్నారు. కేవలం ఒక్క క్రికెట్‌లోనే ప్రొజెక్షన్, బాల్ ట్రాకింగ్‌లో శాతాన్ని లెక్కగడుతున్నారు.
రూల్ లోనే లోపం! : అంపైర్ కాల్ నిబంధనలోనే పెద్ద లోపం ఉంది. బ్యాట్స్‌మన్‌ను డిఆర్‌ఎస్‌లో ఎల్బీగా అవుట్ ప్రకటించేందుకు బాల్ ట్రాకింగ్ సెగ్మెంట్‌లో బంతి 50 శాతానికి మించి వికెట్ జోన్‌లో బంతి ఉన్నట్టు చూపించాలి. ఒకవేళ 50 శాతాని కంటే తక్కువ శాతం వికెట్ జోన్‌లో బంతి హిట్ అవుతుంటే అప్పుడు అంపైర్ కాల్‌తో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నిలుస్తుంది. ఇక్కడే చిక్కు వస్తోంది. ఒకే విధానంలో ఒకే సమయంలో అవుట్, నాటౌట్ ప్రకటించేందుకు ఒకే నిబంధనను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ 50 శాతానికి తక్కువ శాతం వికెట్ జోన్‌లో హిట్ అవుతున్న బంతికి అంపైర్ అవుట్ ఇస్తే.. అది అంపైర్ కాల్‌తో అంతిమంగా అవుట్ కానుంది. అదే ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇస్తే.. అంపైర్ కాల్ ప్రకారం టీవీ అంపైర్ నాటౌట్ ప్రకటిస్తాడు. ఒకే బంతికి బాల్ ట్రాకింగ్ అంచనాకు రెండు భిన్నమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిబంధన అవకాశం కల్పిస్తోంది. దీనినే క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీ తన తర్వాతి సమావేశాల్లో డిఆర్‌ఎస్ అంపైర్ కాల్‌ను చర్చకు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.
అంపైర్ కాల్ నిబంధన అస్సలు అర్థం కావటం లేదు. ఎల్బీ అప్పీల్ విషయంలో బంతి వికెట్‌కు తగిలితే దాన్ని అవుట్‌గా ప్రకటించాలి. ఒక్కసారి టీవీ అంపైర్‌కు సమీక్ష కోరుతూ వెళ్లిన అనంతరం, తిరిగి ఆన్ ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వైపు చూడకూడదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో విభేదిస్తూనే సమీక్ష కోరినప్పుడు మళ్లీ అతడి నిర్ణయం పరిగణనలోకి తీసుకోకూడదు. బంతి 10 శాతం తగులుతుందా? 70 శాతం తగులుతుందా? అనేది ముఖ్యం కాదు. బంతి నేరుగా వికెట్‌కు తగిలినప్పుడు అవేవీ పరిగణనలోకి రావు కదా!. బంతి బెయిల్స్‌ను ముద్దాడుతూ వెళ్లినా, అవుట్ ప్రకటించాలి. అంపైర్ కాల్ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయి. బౌలర్లకు ఈ నిబంధనతో అన్యాయం జరుగుతోంది'
- సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్