Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్య ప్రపంచంలో అయిదు దశాబ్దాల పైబడి శివారెడ్డి సాగిస్తున్న కవిత్వ ప్రయాణం విభిన్నమైంది, విశిష్టమైంది. 75 సంవత్సరాల వయసులోనూ సరికొత్తగా తనని తాను అభివ్యక్తం చేసుకోడం ఆయన ప్రత్యేకత. నూతన అభివ్యక్తితో కవిత్వ పాఠకుల్ని దిగ్భ్రకు లోను చేసే శివారెడ్డితో వాహెద్ జరిపిన సుదీర్ఘ సంభాషణ 'కె.శివారెడ్డి ఎట్ 75' శీర్షికన పుస్తకంగా వచ్చింది. శివారెడ్డి ఫొటోల్ని అందంగా ముద్రించారు. విభిన్న అంశాలపై శివారెడ్డి అభిప్రాయాలు తెలుసుకోడానికి ఉపకరించే ఈ పుస్తకాన్ని 'కవిసంగమం' ప్రచురించింది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన యాకూబ్ చెప్పినట్టు తెలుగు కవిత్వంలో ఒక జీవనది శివారెడ్డి. ఆ జీవనది అంతరంగం తెలుసుకోడం కోసం ఈ పుస్తకం చదవాలి.
కె.శివారెడ్డి ఎట్ 75- వాహెద్ ఇంటర్వ్యూ, పేజీలు: 72, వెల: రూ. 80, ప్రతులకు: నవతెలంగాణ, నవదోయ, నవచేతన పుస్తక కేంద్రాలు.
తెలంగాణ పద్య కవిత్వం
వచన కవిత్వం ఎంతగా విస్తరించినప్పటికీ తెలుగువారికి పద్యం పట్ల మక్కువ ఎక్కువ. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ పద్యకవులు అనేకులున్నారు. అయితే అసలు తెలంగాణలో పద్య కవిత్వం ఆవిర్భావం, వికాసం, వైభవం తెలుసుకోవాలంటే డా|| గండ్ర లక్ష్మణరావు రాసిన పుస్తకం 'తెలంగాణ పద్య కవితా వైభవం' చదవాలి. పద్య కవితా ప్రస్థానం అనే మొదటి భాగంలో పద్యం పూర్వదశ, ప్రారంభదశ, వికాస దశల్లో పద్యం ప్రయాణపు తీరుతెన్నుల్ని వివరించారు. రెండో భాగం పద్య కవితా ప్రాభవంలో దేశీయత, శతకం, శాస్త్రాలు, చాటువులు, అవధాన కవిత్వం, గోలకొండ కవుల సంచిక గురించి ప్రస్తావించారు. పద్యానికి సంబంధించి విలువైన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది.
పద్య కవితా వైభవం- గండ్ర లక్ష్మణరావు, పేజీలు: 136, వెల: రూ. 50, ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
కాశన్న కవిత్వంలో మట్టి సుగంధం
గ్రామీణ జీవితం, ఉద్యమాల నేపథ్యం, అణచివేతకు గురయ్యే వర్గాల సంవేదన ఎదిరెపల్లి కాశన్న కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. ప్రజల గొంతుకై తన కవిత్వాన్ని వెలువరిస్తున్నట్టు 'మూలచుక్క' కవితా సంపుటి ముందుమాటలో చెప్పారు కాశన్న. పాటలు పాడే కాశన్నలోని ఆర్తిని తెలియజేస్తుందీ కవిత్వం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బహుజనుల పోరాటతత్వాన్ని రూపు గట్టించించిన కవిత్వమిది. తెలంగాణ మట్టి సుగంధం, సబ్బండ కులాల అంతర్నాదం మిళితమై ఉన్న ఈ పుస్తకంలో డెబ్బయికి పైగా కవితలున్నాయి. చెమట చిందించే వారి కవిత్వంలోని సొగసుని తెలుసుకోవాలంటే కాశన్న కవితలు చదవాలి.
మూలచుక్క- ఎదిరెపల్లి కాశన్న, పేజీలు: 152, వెల: రూ. 100, ప్రతులకు: కాశన్న, నాగర్‌కర్నూల్-509 209, సెల్: 96400 06304