Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొప్పతనమనేది వైఫల్యాన్ని అధిగమించి పట్టుదలగా ముందుకు వెళ్తామా, లేదా దానికి లొంగి పోతామా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో అనేక సవాళ్ల మధ్యే అవకాశాలు వెతుక్కోవాలి. చీకటిని తిట్టుకుంటూ కూర్చొవచ్చు, లేదా కొవ్వొత్తి వెలిగించి దారి చూపే నాయకులు కావచ్చు. జీవితమంటే నీముందున్న అనేక అవకాశాల్లో దేనిని ఎంపిక చేసుకుంటారన్నదే ముఖ్యం. ప్రతి రోజూ చేసుకునే ఎంపిక మన విజయాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి రోజూ, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మనం ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని, దానిని నిలబెట్టుకోవడమే విజయంగా భావించాలి.
అసాధ్యమని భావించే విషయాలను సుసాధ్యం చేయడమే జీవితం. అందరి మాదిరిగా కాకుండా, ఉన్నతంగా ఆలోచించాలి. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. కలుసుకునే ప్రతి మనిషి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. పరిస్థితులను వాస్తవ దృక్పథంతో అర్థం చేసుకోవాలి.
జీవితమంటే పూలపాన్పుకాదు. జీవితమంటే సుఖ దు:ఖాలు. జీవితమంటే పోరాటం. ఇక్కడ మెక్సికో దేశంలో చెవులు లేకుండా జన్మించిన డేవిడ్ మెజియా గురించి చెప్పుకోవాలి. డేవిడ్ బాల్యమంతా వినికిడి లేకుండానే గడిపేస్తాడని, యుక్త వయస్సు వచ్చాక అసంపూర్ణ జీవితాన్ని గడపవలసి వస్తుందని డాక్టర్లు చెప్పారు. చిన్న వయస్సులోనే ఒకదాని తరువాత మరొకటి శస్త్ర చికిత్సలు చేయించుకుని ఎంతో బాధను అనుభవించాడు. దానికి తోడు సహ విద్యార్థుల సూటిపోటి మాటలు, అవహేళనలు, చీదరింపులు ఆయనను ఎంతగానో బాధించాయి. అయినా డేవిడ్ ఏనాడూ ధైర్యం కోల్పోలేదు. ఆయన గుండె ధైర్యం ఉన్నవాడు. శక్తిమంతమైన మెదడు కలిగి ఉన్నవాడు. అంతకు మించి పెద్ద మనసున్న వాడు. జీవితం పట్ల అంచలంచెలుగా విశ్వాసమున్నవాడు. ఆయన తల్లిదండ్రులు ఆయనను ఏనాడూ నిరుత్సాహ పర్చలేదు. జీవితం నుంచి మనం అత్యుత్తమ ఫలితాలను ఆశిస్తే, మనకు అవే లభిస్తాయని నిరంతరం ఆయన తల్లిదండ్రులు చెప్పేవారు. జీవితంలో ఏనాడూ బాధపడుతూ గడపవద్దని ఆయనకు బోధించారు. డేవిడ్ ఎంతో కష్టపడి తన ఎంచుకున్న ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాడు. కృత్రిమ చెవులతో ఆయన జీవితాన్ని ఆనందంగా గడిపాడు. తనకు అన్యాయాన్ని జరిగిందని, జీవితం నిస్సారమని తిట్టుకుంటూ కాలాన్ని గడపలేదు. కాలానికి ఎదురీదుతూ విజయం సాధించాడు. ఆయన జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
'నాకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. బాస్ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. విధులను సరిగా నిర్వహించలేక పోతున్నానని' తరచుగా వింటాం. మనం చేసే పనిని సవాలుగా తీసుకోవాలి. పనిలో విజయం సాధించి తీరుతాననే పట్టుదల ప్రదర్శించాలి. పనిని తప్పించుకునేందుకు సాకులు వెతకవద్దు. సాకుల పునాదులపై ఏ గొప్ప జీవితమూ నిర్మించబడలేదు. కనుక మనం సాకులు చెప్పడం మానేయాలి. వాస్తవ జీవితంలోకి రావాలి. చుట్టూ పరిస్థితులను పరిశీలించాలి. ఊహలోకాల్లో విహరించవద్దు. కష్టాలను, నష్టాలను ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. మీ గురించి, మీ సామర్థ్యం గురించి చులకనగా మాట్లాడిన వారి మాటలను పట్టించుకోవద్దు. అందరి మాదిరిగా ప్రతిభ ఉందని నిరూపించుకోవాలి. గొప్ప పనులు చేయగల అపార సామర్థ్యం ఉందని గుర్తించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మనసును అదుపులో పెట్టుకొండి. మంచి పనులు చేసేందుకు సహకరించిన మనస్సును అభినందించండి.
మనం ఉత్తమ నాయకులమని భావించాలి. అద్భుతమైన ఫలితాలను సాధించే కార్యక్రమాలపై శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించాలి. అభివృద్ధి కోసం వ్యక్తిగత బాధ్యతను స్వీకరించాలి. ద్విగుణీకృత ఉత్సాహంతో లక్ష్యాన్ని సాధించే దారిలో పయనించాలి. వృత్తిలోనూ, జీవితంలోనూ సమతూకం పాటించాలి. మనలోని సహజ సృజనాత్మక శక్తిని, పని చేస్తున్న సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం ఉపయోగించాలి. జీవితంలో అన్నింటినీ సంపాదించుకోవచ్చు గాని, గడిచిపోయిన సమయం తిరిగిరాదు. అందువల్ల ప్రతి క్షణాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. అదుర్దాకు, అలసత్వానికి, అహంభావానికి గురికావద్దు. అప్పుడే మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. దాంతో మీరు అందరి మాదిరిగా కాకుండా మీరు భిన్నమైన జీవితాన్ని గడపుతారు. ఉల్లాసమైన, ఉత్తేజితమైన జీవితం మీ సొంతమవుతుంది.
- జి.గంగాధర్ సిర్ప, 9010330529