Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురాతన కాలం నుండీ మన భారతీయుల వంటశాల ఒక ఔషధశాల అనవచ్చు. మన వంట గదిలోని పోపుల పెట్టెలోని మసాలా దినుసులే మన ఆరోగ్య కారకాలు. ముందస్తుగా రోగాల పాలపడకుండా కాపాడే రక్షణ కవచాలు అవి. ఒక్కో పోపు సామాను గురించీ కొద్దిగా వివరంగా చెప్పుకుందాం. పూర్వం అమ్మలు, బామ్మలూ ఇంటిఖర్చులకు పోను పొదుపుగా దాచిన చిల్లరను వేరే దాచుకునే చోటు లేక పోపులపెట్టెలో దాచుకునేవారు. నేడు అందరికీ బ్యాంక్ కార్డులున్నాయి కానీ పాతకాలంలో అదే వారి బ్యాంక్. నిజానికి ఆ బ్యాంక్ ఒక మందుల షాపు. దానిలోని విలువైన వస్తువులను గురించి తెల్సుకోడం మనకెంతో ఉపయోగకరం కూడా. అవేంటో ఓ సారి తెలుసుకుందాం...
మిరియం మహత్యం
సుగంధ ద్రవ్యాల రారాజు మిరియం. వాసనతో పాటుగా వంటల్లో రుచి పెంచను మిరియాలు వాడతాం. మిరియాలను ఔషధంగా వాడటం మన దేశ సాంప్రదాయం.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఎవర్ని పకరించినా 'అబ్బా! జలుబు చేసిందండీ! ముక్కు మంటెత్తుతోంది.' మందు వాడితే వారమట, లేకపోతే ఏడురోజులట!'' అంటూ బాధ పడేవారే! చేతుల్లో తువ్వాళ్ళంత కర్చీఫ్‌లు పెట్టుకుని తుమ్ముకుంటూ చీదుకుంటూ నానాతంటాలూ పడుతుంటారు. ఇలాంటి సమయాల్లో మనకు గుర్తు వచ్చేది అమ్మమ్మల నాటి మిరియాల కషాయం, చారు, మిరియం ధూపం వంటివి. జలుబు, దగ్గు, గొంతు గర గరకు, ముక్కు దిబ్బడకు, అజీర్తికి ఇంకా అనేక వ్యాధులకు మిరియాలను వాడతాం.
పాశ్చాత్య దేశాల్లో, మిరియాల నూర్చేప్పుడు వచ్చే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని తలదిండుగా వాడతారు. దాని వాసనకు తలనొప్పి వంటివి మటుమాయం. మిరియాలు కేవలం నల్లవేకాక తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి, గులాబి రంగువి కూడా నేడు చూస్తున్నాం.. మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో లభ్యమవుతున్నది.
మిరియాలలోని ఔషధగుణాలు చాలా గొప్పవి-
ఆయుర్వేదంలో మిరియాలను 'కష్ణమరీచం' అంటారు. మిరియాల్లో ఘాటైన పిపరైన్, చావిసైన్ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని తొలగిస్తాయి. ఒక్క జలుబు, దగ్గుకు మాత్రమే కాక మిరియాల చారు నిత్యం ఆహారంలో తింటారు. ఈ చారుతో అన్నం తినడం లేదా తాగడం చేస్తే ఆహారం బాగా జీర్ణంమవుతుంది.
బాగా జలుబు చేసినపుడు మిరియాన్ని ఒక గుండుసూదికి గుచ్చి, కాల్చి ఆ పొగను పీల్చడం ద్వారా ముక్కు దిబ్బడ తగ్గించుకోవచ్చు.
మిరియాల పొడిని తేనెతో రోజూ ఉదయాన్నే ఒక చెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే ఆజీర్తి, వాతం రానేరావు.
మెత్తగా దంచిన మిరియాల పొడిని, బెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ తీసుకోవచ్చు.
తరచూ జలుబు, తుమ్ములు వచ్చేవారు పసుపు, మిరియాల పొడిని చిటికెడు నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి.
బాగా అజీర్తి చేసి పులితేపులు వస్తుంటే మిరియాల పొడిని నేతిలో వేయించి ఉప్పు కలిపి మొదటి ముద్దలో తినాలి. అజీర్తి మటుమాయమై తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.
మిరియాలతో మన ఆరోగ్యాన్ని బాగుచేసుకుందామా!
శొంఠి శోధన
అనుకోకుండా వర్షాకాలంలో జల్లులు రావడం, ఒక్కో మారు కుంభవష్టి కురుస్తుంటుంది. ఆ సమయంలో 'ఛత్రి' లేకపోడం వల్ల బయటికెళ్ళిన వారు తడవడం, దానివల్ల పడిసెం, దగ్గు, జ్వరం వంటివి పొంచి ఉంటాయి. జలుబు చేసినప్పుడు తుమ్ములతో పాటుగా పొడిదగ్గు మొదలవుతుంది. అప్పుడే మనం శొంఠి కోసం వెతుక్కుంటాం. శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి, కొద్దిగ బెల్లం కపిలి తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
శొంఠికి చాలాపేర్లే ఉన్నాయి. ఇంద్రభేషజము, ఉషణము, కఫారి, చాంద్రకము, మహౌషధము, విశ్వభేషజము, శుంఠి, శుఠ్యము మొదలైనవి. కన్నడంలో అల్లాన్ని సొంఠి అంటారు.
జలుబు చాలా ఎక్కువగా ఉన్నపుడు శొంఠి పొడిలో బెల్లం కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి.
వేడి, వేడి అన్నంలో శొంఠి పొడి, ఉప్పుతో కలిపి నెయ్యి వేసుకుని భోజన సమయంలో మొదటి ముద్దగా తింటే అజీర్తి మాయమైపోతుంది. పులి తేన్పుపులకూ ఈ శొంఠి పొడి బాగా పని చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున శొంఠి పొడి తేనె కలిపి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శొంఠి జీర్ణ రసాలు ఊరటానికి ప్రేరేపణ కలిగించి, ఆకలిని పెంచుతుంది.
శొంఠి పచ్చిదుంపను 'అల్లం' అంటారు. దీన్ని ఉడకబెట్టి బాగా ఎండబెట్టిన దుంపను 'శొంఠి' అంటారు. శొంఠి అధికంగా తింటే వేడి చేస్తుంది. తగుమాత్రంగా తింటే జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపు ఉబ్బరము, కడుపునొప్పి, మలబద్ధకం కూడా శొంఠి, లేక ఆల్లం వాడకంతో మటుమాయం అవుతాయి.
శొంఠి గుణాలే అల్లానికీని. ఐతే అల్లం ఎక్కువ రోజులు నిలవుంటే పాడవుతుంది. శొంఠి ఎంతకాలమైనా నిలవుంటుంది.
గర్భవతులు తలతిరగడం, వికారం, వేవిళ్లు ఎక్కువగా ఉన్నపుడు అల్లం తినడము వల్ల బాగా ఉపశమనం కలుగుతుంది. అల్లం, బెల్లం పచ్చడి తెలుగు వారి ఫేవరిట్, ఇడ్లీ, దోస, వడ వంటివి ఈ చట్నీ కాంబినేషంతో తింటుంటే లెక్కలేకుండా పొట్టలోకి పోతూ ఉంటాయి
శొంఠి మజ్జిగ కడుపును చక్కగా శుభ్రపరుస్తుంది.
పూర్వం నేటి ఆధునిక మందులులేవీ లేనపుడు తలనొప్పికి శొంఠి గంధం తీసి కణతలకు రాసేవారు. కంట్లో 'కలిక'మని శొంఠి గంధం పెట్టేవారు. ఇది తలనొప్పి, పార్శ్వపు తలనొప్పులను తగ్గిస్తుంది. వేసవిలో ఉష్ట తీవ్రతకు శరీరం మీద వచ్చే వడ గడ్డలకు శొంఠి గంధం తప్ప వేరేదీ పనిచేయదు.
శరీరంలో ఎక్కడ ఏ బాధ ఉన్నా శొంఠి వెంటనే అదుపు చేసి బాధా నివారణ కలిగిస్తుంది .అందుకే 'శొంఠి శోధిస్తుంది' అనే మాట వాడుకలోకి వచ్చింది.
ధనియాల దయాగుణం
వంట గదిలోని పోపులపెట్టెలో ధనియాలది అగ్రస్థానం. ఏ పచ్చడి చేయాలన్నా ఇవి కావలసిందే. కూరపొడి, చట్నీపొడి, సాంబార్ పొడుల్లోకి ధనియాలు తప్పనిసరి. వీటిని నాటడం వల్లే కొత్తిమిరి మొక్కలు వస్తాయి. వాటి నుండి దనియాలు లభిస్తాయి. కొత్తిమిరి ఆకులను సువాసన కోసం అన్నిరకాల వంటకాల్లో వేస్తారు. కొత్తి మీరకారం రుచికీ, సువాసనకూ కూడా ప్రాధాన్యం కలది. ఏ వంటకంలో వేసినా దాని గుర్తింపు దానిదే.
ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అంటారు. ధనియాల్లో ఔషధగుణాలు అధికం. ధనియాలు గ్యాస్‌ను తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లపరిచి, మూత్రాన్ని సాఫీగా విడుదల చేసి, రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గింస్తుందని పరిశోధనల ద్వారా ఋజువైంది.
ధనియాల నుంచి తీసిన తైలం బ్యాక్టీరియాను, వివిధ సూక్ష్మక్రిముల లార్వాలను నశింపజేస్తుందని పరిశోధన వల్ల తేలింది. ఆకలి మందగించినపుడు దనియాల పొడిని మిరియాల పొడి లేదా శొంఠి పొడితో కలిపి సేవిస్తే మంచి గుణం కనిపిస్తుంది. ధనియ అతి దప్పికను తగ్గిస్తుంది. ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివే పాకులను నేతిలో వేయించి, ఉప్పు కలిపి పొడి చేసుకుని ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి కలిగి ఆహారం తిన బుద్ధేస్తుంది. జీర్ణశక్తి పెరుగు తుంది. ప్రతిరోజూ కచ్చాపచ్చాగా దంచిన ధని యాలపొడితో చేసిన కషాయం ఒక మండలం పాటు తాగితే ప్రస్తుతం మహి ళలంతా బాధపడే థైరాయిడ్ మటుమాయ మవుతుందంటారు ఆయుర్వేద వైద్యులు.
ధనియ దయాగుణం కలిగిన వాసన వడ్లు.
జీలకర్ర మాయాజాలం
'కర్ర గాని కర్ర' ఏంటీ? అనే పొడుపు కథకు- జీలకర్ర అనే సమాధానం. కర్ర అనే పేరు చివర్లో దీనికి చేరింది. ఇది మన సంబారపు ద్రవ్యాలలోనొకటి. ఇది umbelliferae అను కుటుంబానికి చెందిన CuminumCiminum అను మొక్క పండ్లు. అజీర్తి వంటి అనారోగ్యాలను తన కర్ర రూపం తో భయపెట్టి కొట్టి తరిమేస్తుంది.
దీనికి తెలుగులో అనేక పర్యాయ పదాలున్నాయి.
ఉపకుంచిక, కణ, జిల్కఱ, జీరకము, జీరణము, జీరము, జీలకఱ్ఱ, బ్రహ్మకుశ, మోచాటము.
జీలకర్ర పోపులడబ్బాలో లేని భారతీయ వంటగది ఉండనే ఉండదు.
మనదేశంలో జీలకర్రను వేయి సంవత్సరాల నుండి వంటల్లో ఉపయోగిస్తున్నారంటే దీని గొప్పదనం అర్థమవుతున్నది.
జీలకర్ర మూడు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలుగా మనం వాడే గోధుమ రంగు జీలకర్ర, తెల్ల జీలకర్ర. వీటిలో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. గహ వైద్యానికి భారతీయయ గహిణులు దీన్ని అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. హైందవ వివాహాల్లో వధూవరులచే పరస్పరం జీలకర్ర బెల్లము తలపై పెట్టించడం ఒక ముఖ్యమైన తంతు. దీన్నే లగ ఘడియ అంటారు.
కడుపులో నులిపురుగులు ఉన్నట్లు అనుమానం ఉన్నపుడు జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ పొడిచేసి మజ్జిగతో కలిపి తాగితే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.
గుండెనొప్పి అనే అనుమానం వచ్చినపుడు జీలకర్రను కషాయంగా కాచి తాగితే నొప్పి తగ్గుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీలనూ జీలకర్ర తగ్గిస్తుంది.
పూర్వం జీలకర్ర చింతపండు కలిపి ఉండలా చేసి ఒక చీపురుపుల్లకు గుచ్చి పిల్లలకు నోట్లో ఉంచుకుని చీకుతూ వచ్చే ఉమ్మిని మింగమనేవారు. తద్వారా నోటి అరుచితో పాటుగా జీర్ణశక్తి పెరిగి, పైత్యం తగ్గుతుంది. ఇది పైత్య హారిణి.
జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవ లవణం లేదా ఉప్పును కలిపి భోజనంలో మొదటి ముద్దలో తింటే చాలా మంచిది.
మెంతులు
'మెంతి తిని మెరవండి' అంటారు పెద్దలు. మెంతులు ఎంత మెరుస్తాయో వాటిని మనం ఆహారంలో ఉపయోగిస్తే మన ఆరోగ్యమూ అలా మెరుస్తుంది.
మనం వండే వంటల్లో చాలావరకూ మెంతిది మేలిమి స్థానం. మెంతి ఆకుల్లో ఇనుము సమద్ధిగా ఉంటుంది.
మెంతి ఆకులనూ వంటల్లో వివిధ రూపాల్లో కలిపి భుజిస్తాం. మెంతాకులను ఆకుకూరగానూ, పప్పుకూరగా, పూరీ, చపాతీల్లో కలిపి చేస్తారు. మెంతి ఆకు కానీ, గింజలు కానీ చలువ చేస్తాయి. మెంతి ఆవకాయ, మెంతి మాగాయ, ఇంకా అనేక పచ్చళ్ళలో మెంతి పొడిని, మెంతి గింజలను చారు, పులుసు, పచ్చళ్ళలోనూ పోపుల్లో వాడతాం. మెంతిలేని చింతకాయ పచ్చడికి పసందే లేదు.
మెంతుల్లో చాలా ఔషధ గుణాలనున్నాయి. మధుమేహ వ్యాధి అంటే షుగర్ నియంత్రణకు మెంతులు ఉపయోగ పడతాయి. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అనీ, హిందీలో మెథీ అని అంటారు.
మెంతి గింజలు ముదురు పసుపు రంగులో ఉండి, నానబెట్టినపుడు జిగురు, చేదు రుచి కలిగి ఉంటాయి. పూర్వం మెంతి గింజలను, కాయితాలతో కలిపి నానబెట్టి రుబ్బి ఇంట్లో వాడుకునే చేటలు, బుట్టలు మెత్తి, అరబెట్టాక వాడేవారు.
జీర్ణాశయ సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్, మధుమేహం వ్యాధులను అదుపుచేస్తాయి
ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి, చర్మానికి మెరుపు వస్తుంది.
దోసలకు నానబెట్టే బియ్యం, మినప్పప్పుతో పాటు ఒక స్పూను మెంతులు వేస్తే దోస సన్నగా కాయితంలా వస్తుంది. రుచికి రుచీనీ.
పెద్దలు చెప్పే వైద్యం- విరేచనాలు ఔతున్నపుడు మెంతులను ఒక స్పూన్ పెరుగుతో కలిపి మింగితే వెంటనే తగ్గుతాయి.
ఇంగువ ఇంపు
మన మధురమైన మతభాషలో 'ఇంగువ కట్టిన గుడ్డ' అనే నానుడి వినని తెలుగువారుండరు.
ఇంగువ డబ్బా వంటగదిలో మూత తియ్యగానే ఇల్లంతా సువాసన వ్యాపిస్తుంది. అందరి ముక్కులూ ఎగపీల్పులే! ఇంగువ తిరుగమోత లేని ఏ వంటకమూ రుచించదు. ఇంగువ తిరుగమోత చింతకాయ రుచి చూడకపోతే జన్మ వ్యర్ధం. ఇంగువది వంటగదిలో వాడే అన్ని ద్రవ్యాల్లోకీ ప్రముఖ స్థానం. దీని ఔషధ గుణాలు కూడా తక్కువైన వేమీకాదు.
ఇది ఒకచెట్టు జిగురు. 'అస' అంటే పర్షియన్‌లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్‌లో ఘాటైన గంధక వాసన అని అర్థం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అనీ, సంస్కతంలో 'హింగు' అనీ అంటారు. ఇహ తెలుగులో ఇంగువకు ఇన్ని నామాలున్నాయి దాని వాసనలా- జాతుకము, దారదము, పిణ్యాకము, బాహ్లికము, బిల్లము, రమఠధ్వని, రమఠము, రామఠము, శూల ద్విషము, సహస్రవేది, హింగువ. ఇలాగైనా కాస్త తెలుగు పదాలు గుర్తు చేసుకుందాం.
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'.
ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురు లాగా ఉండే ద్రవం. మూడునెలల్లో తయారైన ద్రవం రాయిలాగా గట్టిపడుతుంది. దాన్ని పొడిగా చేసి చిన్న డబ్బాల్లో నిపుతారు. పూర్వం ఇంగువ గడ్డలాగానే అమ్మేవారు.
ఇది పసుపురంగులో ఉండి, ఘాటైన వాసనతో ఉంటుంది.
ఇంగువలో కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి-విటమిన్ ఉంటాయి.
కడుపుని శుభ్రం చేస్తుంది, ప్రేవుల్లో నొప్పిని తగ్గిస్తుంది. మంచి జీర్ణకారి. సాంబార్, చారు, పప్పుకూరల్లో, పచ్చళ్ళలో పోపులో ఇది పడగానే వచ్చే వాసనకు అకలిలేని వారికి కూడా ఆకలవుతుందంటే అతిశయోక్తికాదు.
దీని తీవ్రమైన వాసనకు చాలా సూక్ష్మజీవులు రావు. పూర్వం కలరా వంటి వ్యాధులున్న తావుల్లోకి వెళ్ళల్సి వస్తే, చిన్న ఇంగువ డబ్బా కొద్దిగా మూతకు చిల్లు వేసి జేబుల్లో పెట్టుకుని వెళ్ళేవారు.
పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటి మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది. ఇంగువకి వ్యాధి నిరోధ కశక్తి ఎక్కువ.
ఇంగువ చాలా ఒగరుగా ఉంటుంది.
ఇంగువ గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇంగువపోపు వేసిన ఏ ఆహారమైనా అది అరిగిందాకా కమ్మని వాసన నోటి నుండి వస్తూనే ఉంటుంది.
బాగా ఆకలి కలిగిస్తుంది. ఇంగువ వేసిన ఆహారం తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోఉంటాయి.
ఆవాల అబ్బుర చర్య
ఆవాలు మన వంట శాలలో ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. చూడటానికి సన్నగా రాగుల్లా ఉన్నా ప్రతాపంలో మాత్రం పనస పండంత.
ఆవాలను ఆంగ్లంలో మస్టర్డ్ సీడ్స్ అంటారు.
ఆవాల నామాలూ చాలానే ఉన్నాయి. పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది? అనుకున్నా పేరుకూ ఉంది పెన్నిధి. ఆబలు, ఆసురి, కష్ణిక, క్షుతాభిజననము, తీక్ష్ణకము, తుంతుభము, తుందుభము, రక్షోఘ్నము, రాజసర్షపము, సర్షపము, సాసువులు.
పోపు దినుసుగా ప్రతి వంట ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థము ఉంటాయి.
ఆవకాయకు ఊరగాయకు ఆవపిండే ప్రధాన వస్తువు. మామిడికాయ తోనూ, ఉసిరికాయతోనూ, టమోట ఇంకా అనేక కూరగాయలతో ఆవపిండి కలిపి ఊరగాయ పెట్టు కుంటాం. యాడాది పాటూ ఒక ఆధరువుగా ఉంటుంది.
ఆవాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా|| టోకోఫెనాల్ అనే పదార్థం (విటమిన్ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వ ఉండకుండా కాపాడుతుంది. ఆవనూనెను కూరల్లో వాడుతారు.
ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచి, ఆహారాన్ని అరిగేలా చేస్తాయి. గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో కొద్దిగా ఆవపొడి, తేనె వేసుకుని తాగితే తగ్గుతుంది. ఆవాలను ఘాటైనవి కనుక చాలా తక్కువగా తీసుకోవాలి.
సాధారణంగా చాలామంది ఒంటిమీద వచ్చే పులిపిరి కాయలమీద ఆవాలు నూరి ముద్దగా పెడితే పులిపిరులు ఎండి రాలిపోతాయి.
- ఆదూరి హైమావతి,
8790224030