Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, మహేశ్వరం, హయత్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, వికారాబాద్, శంకర్‌పల్లి, తాండూర్, వికారాబాద్, పరిగిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలోని బస్సులే కాకుండా, బండ్లగూడ, దిల్‌సుక్‌నగర్, మియాపూర్-1, మియాపూర్-2, హెచ్‌సీయూ బస్సులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నాయి. ఆయా డిపోల్లో బస్సులకు వినియోగించే టైర్లు, విడిభాగాలు చివరి దశకు చేరాయి. మరో నాలుగు రోజులు గడిస్తే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నడుస్తున్న అద్దె, ఆర్టీసీ బస్సులకు వస్తున్న టికెట్ ఛార్జీలు కేవలం ఇంధనానికే సరిపోవడంతో విడిభాగాలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. చేసేదేమీ లేక ప్రస్తుతం ఉన్న విడిభాగాలు వేసి బస్సు నడిపిస్తున్నామని, లేకపోతే పక్కన పెడతామంటున్నారు.
ఇది ఆర్టీసీ బస్సుల ప్రస్తుత పరిస్థితి
అద్దె బస్సుల అప్పు రూ. 2 కోట్లు
ఆర్టీసీ అద్దె బస్సుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఒక అద్దె బస్సుకు ఒక రోజుకు ఆర్టీసీ రూ.4వేలు డీజిల్‌కు ఇచ్చి నడిపిస్తున్నారు. కానీ రోజుకు రూ.7వేల పైచిలుకు డీజిల్‌కు ఖర్చవడంతో లక్షల్లో అప్పులు పేరుకుపోయాయని అద్దె బస్సు యజమానులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం జిల్లా పరిధిలో డిపోల్లో 517ఆర్టీసీ బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 377కాగా, మరో 140అద్దె బస్సులున్నాయి. ఒక్కో బస్సుకు నెలకు రూ.లక్ష చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. డీజిల్, అద్దె ఖర్చు కలిపి రూ.2కోట్లపైగా చెల్లిస్తేనే అద్దె బస్సులు నడిపిస్తామంటున్నారు. లేకపోతే పక్కన పెట్టేస్తామని యజమానులు స్పష్టంగా పేర్కొంటున్నారు.
రెండు నెలలుగా అందని వేతనాలు
ప్రతి డిపోలో డీఎంతో పాటు ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న భద్రత గార్డులు, గైడ్లు, బస్టాండు, డిపో శుభ్రం చేసే స్వీపర్లు, డిపోలో పనిచేస్తున్న సహాయకులకు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఒంటి చేత్తో బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారితో పాటు, డీఎంలకు రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
300కూడా నడవడం లేదు
జిల్లాలో సుమారు 3లక్షల మంది వరకు ప్రజలు ప్రయణాలు సాగిస్తున్నారు. వీరికి జిల్లాలో 377ఆర్టీసీ, మరో 140 వరకు అద్దె బస్సులను తీసుకుని నడిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం 300 బస్సులు కూడా రోడ్డెక్కడం లేదు. వీటిలో 100 వరకు ఫిట్‌నెస్ లేని బస్సులే ఉన్నాయి. సమ్మెలేని కాలంలో వీటికి నిత్యం మరమ్మతులు చేస్తేనే నడిచే పరిస్థితి ఉండేది. కానీ సుమారు 38 రోజుల నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, క్యాషియర్లు, రూట్ అధికారులతోపాటూ, మెకానిక్‌లూ సమ్మెలో ఉన్నారు. దాంతో మరమ్మతులు లేక బస్సులు మూలకు చేరాయి. ఇక 517 బస్సులున్నా నిత్యం 3లక్షల మందికి సరిపోని పరిస్థితి ఉంటే, ఇక సమ్మెలో బందోబస్తు మధ్య కనీసం 300 బస్సులను కూడా నడిపించలేకపోతున్నారు.
వచ్చిన ఆదాయం వేతనాలకే...
జిల్లాలో మొత్తం 2500 మంది కార్మికులు పని చేసేవారు. 517 బస్సులు పూర్తి స్థాయిలో నిడిపిస్తేనే ప్రతిరోజు రూ.68లక్షల ఆదాయం వచ్చేది. గడిచిన 38 రోజుల సమ్మె కారణంగా సుమారు రూ.26కోట్ల మేర ఆర్టీసీ ఆదాయం పడిపోయింది. ఇదీలా ఉంటే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని బస్సులు నడిపిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లిస్తున్నారు. దాంతో రోజు వారి ఆదాయం వారి వేతనాలకే సరిపోవడం లేదు. ఇక డిజిల్ ఖర్చులకు ఆదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా రోజు రూ.3వేల వేల నుంచి రూ.7వేల వరకు తీసుకురావాల్సిన బస్సులు తాత్కాలిక సిబ్బంది రూ.2వేల నుంచి రూ.4వేలు కూడా తీసుకురాడం లేదు. దాంతో ఆర్టీసీపై మరింత భారం పడుతుందనే చెప్పాలి.
పల్లెకు బంద్...
38 రోజుల సమ్మెకాలంలో ఆర్టీసీ బస్సులు పల్లె ముఖం చూడటం లేదు. తాత్కాలిక ఏర్పాట్లను కేవలం పట్టణ రూట్లల్లోనే చేసింది. జాతీయ రహాదారులు, పట్టణాల్లోనే నడిపిస్తుండటంలో 90శాతం ఆర్టీసీ బస్సులనే ఆధారం చేసుకుని ప్రయాణాలు చేస్తున్న కార్మికులు, ప్రజలు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమ్మె ఇంకెంత కాలం ఉంటుందో తెలియని ఆయోమయ పరిస్థితులు కన్పిస్తున్నాయి.