Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శుక్రవారం 412 మందికి పాజిటివ్
మొత్తం 73కి చేరిన మరణాలు
సగటున 20 శాతం మందికి నిర్దారణ
హోం ఐసోలేషన్‌లో 96 శాతం మంది
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలను కరోనా హడలెత్తిస్తోంది. వేల మందిపై పంజా విసురుతోంది. నిత్యం వందల కొద్దీ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడమే ఇందుకు తార్కాణం. శుక్రవారం 1616 మందికి టెస్టులు చేస్తే..412 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. 24 గంటల్లో వందల సంఖ్యలో కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు చేయించుకున్న వారిలో 25శాతం మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ ఏరియాల్లో 268 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 11969 కేసులు నమోదు కావడం విశేషం. ఒక్క సరూర్ నగర్ ఆస్పత్రి పరిధిలోనే 123 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి నిలిచింది. ఇక్కడ 109 మంది బాధితులగా తేలారు. ఇక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు అధికంగా వచ్చాయి. ఈ ప్రాంతాల పరిధిలో 144 కేసులు నమోదయ్యాయి.
18,503వేలు దాటాయి..
జిల్లాలో కరోనా కేసులు 18500 మార్కును దాటేశాయి. గత పక్షం రోజుల్లో ప్రతి రెండు రోజులకు సగటున వెయ్యిమందికి పాజిటివ్‌గా నిర్దారణ జరుగుతోంది. ర్యాపిడ్ యాంటీజెన్ డయాగస్టిక్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో అనుమానిత లక్షణాలు గల వ్యక్తులు పెద్ద ఎత్తున టెస్టులు చేయించుకుంటున్నారు. దీంతో అధిక మొత్తంలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం రాత్రి వరకు జిల్లాలో18091 మంది బాధితులు ఉండగా శుక్రవారం నాటి కేసులను కలిపితే వీరి సంఖ్య 18503కు ఎగబాకింది. రోజువారీగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్న వారిలో సగటున 20 నుండి 25 శాతం మందికి కరోనా నిర్దారణ అవుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడి స్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాపితంగా 52839 పైచిలుకు టెస్టులు చేయించుకోగా వీరిలో దాదాపు 6890 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు తేలింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల శాతం పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
96 శాతం హోం ఐసోలేషన్‌లోనే..
కరోనా నిర్దారణ జరిగిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. పాజిటివ్‌గా తేలిన బాధితుల్లో..అత్యధికం స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గలవారేనని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర లక్షణాలు గల వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు మాత్రమే ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాపితంగా 6890 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరు వైద్యులు సూచించిన మేరకు మందులు వేసుకుంటున్నారు. 204 మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరారు. శుక్రవారం ఇద్దరు చనిపోగా మొత్తం మరణాలు జిల్లాలో 73కి చేరుకుంది.
నాన్ జీహెచ్‌ఎంసీ పరిధిలో..
కందుకూరు డివిజన్‌లోని బాలాపూర్ పీహెచ్‌సీ పరిధిలో 23, లేమూరు 1, దుబ్బచర్ల 7, కందుకూరు 2, అమన్‌గల్ 4, గట్టుప్పలపల్లి 5, తలకొండపల్లి 1, షాద్‌నగర్ డివిజన్‌లో చుంచోడ్ పీహెచ్‌సీ పరిధిలో 10, కొత్తూరు 3, కేశంపేట 1, నందిగామ 2, రాజేంద్రనగర్ డివిజన్‌లో నర్కొడ పీహెచ్‌సీ పరిధిలో 8, పెద్దషాపూర్ 4, నార్సింగ్ 25. చేవెళ్ల డివిజన్ పరిధిలో శంకర్‌పల్లి 4, ఆలూరు 3, చందనవెల్లి 3, మోయినాబాద్ 9, టంగుటూరు 5. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఎలిమినేడు 1,అబ్దుల్లాపూర్ మెట్ 18, మంచాల్ 3, దండు మైలార్ 2, మొత్తం 144 నమోదయ్యాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో..
కందుకూరు డివిజన్ సరూర్‌నగర్ పీహెచ్‌సీ పరిధిలో 123, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో శేరిలింగంపల్లి 109, మైలార్‌దేవ్‌పల్లి 15. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్ 21 మొత్తం 268 నమోదయినట్లు వైద్యాధికారులు తెలిపారు.