- జంట కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నవతెలంగాణ-బోడుప్పల్ బోడుప్పల్, ఫీర్జాదిగూడ నగర పాలక సంస్థల పరిధిలో సోమవారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సభ్యులు ఘన విజయం సాధించారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం బొమ్మక్ బాలయ్య గార్డేన్‌లో నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షత జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో పోటీ చేసిన అభ్యర్ధుల పేర్లను నగర కమిషనర్ ఎన్.శంకర్ చదివి వినిపించగా సభ్యులు వారిని చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. జనరల్ కేటగిరిలో టీఆర్‌ఎస్ సభ్యులు గా విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బుర్ర దత్తాత్రేయ శాస్త్రీ, బద్దుల సుగుణ (మాజీ వార్డు సభ్యురాలు), రంగ బ్రహ్మన్న (మాజీ వార్డు సభ్యులు), మైనార్టీ కేటగిరిలో నజియా బేగం, ఆడ్వార్డ్ జ్ఞానదేవ్ ప్రభాకర్ ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ సురేష్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొని నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో ఫీర్జాదిగూడ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి అధ్యక్షత కమిషనర్ ఎం.శ్రీనివాస్ నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులుగా (కో-ఆప్షన్) బోడిగె రాందాస్‌గౌడ్, చిలుముల జగదీష్‌రెడ్డి, చెరుకు వరలక్ష్మీ,షేక్ ఇర్ఫాన్, ఎండీ నజియా లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులను మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.