Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరిస్తామని బడ్జెట్‌లో చేసిన విధాన ప్రకటనకు కార్పొరేట్ మీడియా, మితవాద ఆర్థికవేత్తల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 'మోడీ మారిపోయారు', 'అసాధారణ సాహసం', 'ఎట్టకేలకు వాస్తవిక సంస్కరణలు' వంటి వ్యాఖ్యలు ఈ వర్గాల నుంచి వచ్చాయి. బడా వ్యాపారవేత్తల్లో, ఆర్థిక రంగ స్పెక్యులేటర్లలో ఇంత ఆనందం వ్యక్తం కావడానికి కారణం ఏమిటి? బడ్జెట్‌లో ప్రకటించినదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణా విభాగం ఆచరణలో పెడుతోంది. 'ఆత్మనిర్భర్ భారత్ కోసం నూతన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానం' అనే శీర్షికతో ఒక మెమోరాండాన్ని సిద్ధం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక, వ్యూహాత్మక యేతర రంగాలుగా వర్గీకరించింది.
నాలుగు వ్యూహాత్మక రంగాలలో 1.అణు విద్యుత్, రోదసీ, రక్షణ, 2.రవాణ, టెలికమ్యూనికేషన్లు, 3.విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, 4.బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు ఉన్నాయి. ఈ నాలుగు రంగాల్లో, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల కనీస ఉనికి ఉంటుంది. మిగిలిన సంస్థలన్నీ ప్రయివేటీ కరించడమో లేదా విలీనం చేయడమో లేదా మూతపడడమో జరుగుతుంది. ఇక వ్యూహాత్మక యేతర రంగానికి వస్తే, అన్ని పీఎస్‌ఈలను ప్రయివేటీకరించడానికే పరిగణించాలన్నది విధానంగా ఉంది. లేదా మూసివేయాలి. సుదూర కాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగిన ఈ ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ప్రణాళికలో దేశ, విదేశీ బడా పెట్టుబడులు ఇమిడి ఉన్నాయి. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ప్రయివేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పీఎస్‌ఈల్లో ప్రయివేటీకరణగా పిలిచే వ్యూహాత్మక వాటాల విక్రయం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు రెండో విడత మోడీ ప్రభుత్వ హయాంలో ఈ నూతన విధానం ప్రభుత్వ రంగాన్ని సమూలంగా ధ్వంసం చేయనుంది. ఎందుకంటే, ఆ నాలుగు వ్యూహాత్మక రంగాల్లో కూడా మెజారిటీ పీఎస్‌ఈలను (వాటిలో చాలా వరకు లాభదా యకమైనవే) విక్రయించనున్నారు. ప్రజా ధనంతో నిర్మించిన విలువైన ప్రజా ఆస్తులవి.
వ్యూహాత్మక రంగాలుగా పిలిచే వీటిల్లో చాలా పీఎస్‌ఈలను ప్రయివేటీకరించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం వాటిని నష్టాల బాటలో నడిచేలా చేస్తోంది. ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థలన్నీ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి బాధితులే. ఆర్థిక సంక్షోభం ముదురుతుండటంతో నయా ఉదారవాద ప్రభుత్వాలకు ప్రయివేటీకరణ లాభాలపై ఆధారపడడం పెరుగుతోంది. రెవెన్యూ ఆదాయాలు తీవ్రంగా క్షీణించాయని ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో వెల్లడైంది. దీన్ని లాభాలార్జించే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచిడి రూ.1.75లక్షల కోట్లను బడ్జెట్‌లో అందించారు. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వచ్చే మొత్తాలు రూ.2.10 లక్షల కోట్లుగా ఉంటాయని 2020-21 బడ్జెట్ అంచనా వేసింది. ఈ నిర్దేశిత మొత్తానికి భారీస్థాయిలో నిధులు కొరవడడంతో, ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోని ఈ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రయివేటీకరణకు వెళుతోంది. అసలే ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న వేళ, ఆస్తుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ గణనీయమైన రాయితీతో విక్రయించనున్నారు. ఫలితంగా దేశ, విదేశీ పెట్టుబడిదారులకు గొప్ప వరమే ఇది.
ఆర్థిక రంగాన్ని ప్రయివేటీకరించే ఉద్దేశ్యం బహిరంగంగానే ఉంది. బడ్జెట్‌లో మొట్టమొదటిసారిగా, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీ కరిస్తామని ప్రకటించారు. ఎల్‌ఐసీలో కూడా వాటాలను విక్రయించనున్నారు. ప్రయివేటీకరించడానికి ఎంపిక చేసిన రెండు బ్యాంకులు కూడా లాభాలార్జిస్తున్నవేనని చెప్పనక్కర్లేదనుకుంటా. బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ రంగం ప్రవేశించడానికి ఇదొక సూచిక. ఆర్థిక రంగాన్ని ఒకసారి ప్రయివేటీకరించిన తర్వాత ఇక ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పెట్టుబడుల వ్యత్యాసాలకు నెలవుగా మారుతుంది. అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్ ఆత్మనిర్భరత కోసం నిబంధనలను నిర్దేశించగలదు. లాభాలార్జించే పీఎస్‌ఈల స్థూల లాభాలు రూ.1.6 లక్షల కోట్లు కాగా, ప్రభుత్వానికి వాటి వల్ల వచ్చే డివిడెండ్లు రూ.77 వేల కోట్లు. ఈ ఆస్తులను విక్రయించడం ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్ రెవెన్యూగా ఉంటుంది.
ఇదంతా కూడా ఆత్మనిర్భర్ భారత్ పేరుతోనే జరుగుతుండడం దారుణమైన బూటకం. దేశంలోనే రెండవ అతి పెద్ద చమురు కంపెనీ అయిన బీపీసీఎల్ విక్రయానికి వస్తే, ఈ సంస్థ పరిమాణాన్ని బట్టి చూసినట్లైతే విదేశీ చమురు కంపెనీకి విక్రయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కీలకమైన ఇంధన సరఫరాల నియంత్రణలకు సంబంధించి దేశ సార్వభౌమాధికారం బలహీనపడుతుంది. రక్షణ రంగంలో ఈ ప్రయివేటీకరణ ఉత్సాహం, ఎంపిక చేసిన భారతీయ ఆయుధ సంస్థలు విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులతో జత కట్టడానికి దారి తీస్తుంది. అమెరికాతో పెరుగుతున్న సైనిక పొత్తును దృష్టిలో పెట్టుకుంటే రక్షణ ఉత్పత్తిలో కీలక రంగాలను అమెరికా బహుళ జాతి ఆయుధ కంపెనీలు స్వాధీనం చేసుకునే ముప్పు పొంచి ఉంది. ఇది దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. ఖనిజాలు, సహజసిద్ధమైన వనరులు వంటి రంగాల్లో ప్రయివేటీకరణ...39(బి) లోని రాజ్యాంగ ఆదేశిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. పాదార్ధిక వనరులపై యాజమాన్య హక్కులు, నియంత్రణ కలిగి ఉండడం ప్రజలకు మంచి చేయడానికి ఉపకరిస్తుందని రాజ్యాంగం పేర్కొంటోంది. మంచి జరగడం పోయి, ఈ ప్రయివేటీకరణ వల్ల సహజసిద్ధమైన వనరు లను ప్రయివేటు కంపెనీలు దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తోంది. ఆర్థిక సంస్థలతో పాటుగా ఈ ప్రయివేటీకరణ క్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, విద్యుత్ సరఫరా వంటి ఇతర రంగాలకూ పాకుతోంది. ఇది, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సేవలకు సంబంధించి ప్రజలకు గల హక్కుపై ప్రత్యక్షంగా దాడి చేయడమే కాగలదు. విస్తృతంగా ప్రజలను సమీకరించడం ద్వారా ఈ ప్రయివేటీకరణ క్రమంపై పోరాడాల్సి ఉంది. ఇప్పటికే వందశాతం వ్యూహాత్మక విక్రయం ద్వారా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామన్న ప్రకటనకు పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ జరుగుతోంది. కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో ఇదొక ప్రజా సమస్యగా మారింది.
ప్రతిపాదిత రెండు బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15, 16 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు యునైటెడ్ బ్యాంక్ యూనియన్ల ఫోరం పిలునిచ్చింది. బీమా కార్మికులు కూడా దీర్ఘకాల పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులతో కలిసి సమగ్ర, సమన్వయ ప్రతిఘటనను నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంపై సాగే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా విస్తృత రీతిలో ప్రజలను సమీకరించేందుకు కార్మిక సంఘాలు, వామపక్ష శక్తులు కృషి చేయాలి.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం