Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పలకరించు దిక్కులేక
న్యాయం విలపిస్తున్నది
నడవండిక నడవండి
చరచరచర చక్రంలా
ప్రగమిస్తూ నడవండోయ్!' - శ్రీశ్రీ
న్యాయ సుంగంధనిలాలు
నింపుము ఈలోకంలో
ఈలోకం నీకోసం
ఎంతపరితపించెనో
పదపదవే గీతమా - మగ్ధూమ్
మహాదార్శనికులైన ఈ మహాకవులు ఇద్దరూ తమ తమ దృక్కోణాల్లో న్యాయపథాన్ని విశదీకరిస్తూ.. గీతాల ద్వారా ప్రజల హృదయాలకు హత్తుకునేటట్లు చెప్పారు. ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో తమ రాజ్యాన్ని, తమ సంపన్న పాలకవర్గాన్ని రక్షించేందుకు స్థూలంగా ఏర్పాటు చేసుకున్న ఉపాంగాలే పోలీసు, న్యాయ యంత్రాలనేది కమ్యూనిస్టుల భావన.
అయినా, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారత రాజ్యాంగానికి లోబడి న్యాయాన్ని రక్షించుకోవడం ప్రజలందరి బాధ్యత, ముఖ్యంగా పాలకుల కర్తవ్యమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల అత్యంత అమానుషంగా, పట్టపగలు నడిరోడ్డుపై బహిరంగంగా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు - నాగమణిల దారుణ హత్య దిగ్భ్రమకు గురిచేయడమే కాదు, ప్రకంపనలు సృష్టిస్తున్నది కూడా.
ఏ నేర ప్రమాదం సంభవించినా, తమకు కోర్టులు, న్యాయం కల్పిస్తాయనే భరోసాతో ప్రజానీకం ఉంటుంది. అలాంటి కోర్టులకే జీవగర్ర అయిన న్యాయవాదులకే రక్షణ కొరవడితే సమాజ మనుగడ మాటేమిటి? ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవక మానవు. అందుకే ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తూనే తమ రక్షణ కోసమే ప్రత్యేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల సంఘాలు నేడు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థకు, దానిని రక్షించే భారత రాజ్యాంగానికి పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా తూట్లుపొడుస్తున్న దుర్దశలో మనం ఉన్నాం. కనుకనే శాంతిభద్రతలకు భంగం కలిగించే అరాచక శక్తులు, హింసోన్మాదాలు నానాటికి పేట్రేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని, తత్సంబంధిత సాధనాలను రక్షించుకోవడం ప్రజాతంత్ర వాదులైన ప్రతి ఒక్కరికి పరమావధిగా మారింది.
అధికారపార్టీకి సంబంధించిన స్థానిక నేతలు చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా ఈ న్యాయవాద దంపతులు పోరాడుతున్నట్టు సమాచారం. భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, అక్రమ భూసేకరణ వంటి నేరాల్లో హత్యలు, ఆత్మహత్యలు కొనసాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ నేరాలకు వ్యతిరేకంగా వీరు న్యాయపరంగా పోరాడుతున్నారు. అలాగే గతంలో మంథని పోలీస్ స్టేషన్‌లో జరిగిన దళితుడు శీలం రంగం లాకప్‌మరణానికి సంబంధించి కూడా వామనరావు న్యాయపోరాటం చేశాడు. వృత్తి నిబద్దతతో ముందుకు పోవడం ఈ 'అక్రమ' నేతలకు మింగుడుపడలేదు. అందుకే మాటువేసి అంతం చేయడానికే సిద్దమయ్యారు.
'గుర్తుతెలియని వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా తమపై కక్ష కట్టారని, అందుకే తమపై వివిధ పోలీసు స్టేషన్‌లలో అక్రమ కేసులు బనాయించారని, తమకు ప్రాణహాని ఉన్నదని' కూడా వామనరావు దంపతులు హైకోర్టుకు విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా భద్రత కల్పించమని ఆదేశించింది. అయినా ఘోరం జరిగిపోయింది. చట్టాన్ని చేతిలోకి తీసుకునే సంఘ వ్యతిరేక శక్తులకు, చట్టాన్ని కాపాడి అమలు పరిచే పోలీసులు తోడైతే నేరాలు-ఘోరాలు జరగకుండా ఎలా ఉంటాయనేది సాధారణమైన ప్రశ్న.
విశేషమేమంటే ఈ హత్యలను ఖండించాల్సిన పాలకులు నిర్ద్వందంగా ఖండించకపోవడం. ఇదేదో యాదృశ్ఛికమైన సాధారణ ఘటనగా తేల్చేసి, 'చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే' అని ఉదాశీనంగా సరిపుచ్చుకోవడం. తత్ కారణంగా పాలకవర్గాలకు ఈ హత్యలకు దగ్గర సంబంధం ఉన్నదని ప్రజలు భావించడం సత్యదూరం కాదు. అందుకే హైకోర్టు ఈ జంట హత్యల ఘటనను సుమోటోగా స్వీకరించి దంపతుల హత్య ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రశ్నించేలా ఉన్నదని వ్యక్తపరిచింది. హంతకులను పట్టుకోవడం, సరైన సాక్ష్యాలు సేకరించడం ద్వారానే ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించింది. సాక్ష్యాలను తారుమారు చేయడం న్యాయం కాదు, వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకోవడం, ఆ వాస్తవాల నుంచి అసలు నిజాలు (సత్యాలు) గ్రహించడం, లోకానికి తేటతెల్లం చేయడం న్యాయవాదుల పని అని అందరికీ తెలుసు. కానీ రాజ్యాధికారం యొక్క ప్రత్యక్ష, పరోక్ష వత్తిడితో న్యాయ వ్యవస్థకు తూట్లు పడుతున్నాయి. న్యాయ స్వతంత్రతకు భంగం వాటిల్లుతున్నది. అసలు న్యాయం మనుగడే ప్రమాదంలో పడుతున్నది.
న్యాయం అనేది ఎక్కడో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. సహేతుకమైన ప్రజల ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ ఉంటుంది. మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవింపచేయడమే న్యాయసూక్ష్మం. అవకతవకలను చేసేవారిని గనుక రక్షించుకుంటూ పోతే ప్రపంచమంతా దుర్మార్గులతోనూ, బుద్దిహీనులతోనూ నిండిపోతుందని హెర్బర్ట్ స్పెన్సర్ అంటాడు. నిజమేకదూ...!
- కె.శాంతారావు
సెల్: 9959745723