Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'న్యూస్‌క్లిక్' సంపాదకులు, యజమాని ప్రబీర్ పుర్కాయస్థ, గీతా హరిహరన్‌లను నాలుగు రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన తర్వాత ఆదివారం తెల్లవారు జామున 1.30గంటల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిబ్బంది వారి నివాసాల నుంచి బయటకు వచ్చారని తెలిసి నేను ఈ వ్యాసం రాస్తున్నాను. ప్రబీర్ నెలకొల్పిన 'న్యూస్‌క్లిక్' మీడియా ప్లాట్‌ఫారంపై దాడిలో భాగంగానే ఈడీ సిబ్బంది అక్కడకు వెళ్ళారు. 'న్యూస్‌క్లిక్' యజమానులు పాల్పడిన కొన్ని ఆర్థిక నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలను కనుగొనేందుకు ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఆర్థిక లేదా ఫైనాన్షియల్ నేరానికి సంబంధించి ఈడీ దర్యాప్తు జరిపేటప్పుడు ఇటువంటి దాడులు సర్వసాధారణమేనంటూ బడా మీడియా, ప్రధాన స్రవంతిలోని మీడియా వ్యాఖ్యానించింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి వార్తాపత్రిక తన మొదటి పేజీలో ఇందుకు సంబంధించి తన కథనాన్ని ఈ విధంగా ప్రారంభించడం విచారకరం. ''ఆన్‌లైన్ న్యూస్ ప్లాట్‌ఫారం న్యూస్‌క్లిక్ కార్యాలయంపై, వారి డైరెక్టర్ల నివాసాలపై దాడులు రూ.30.51కోట్ల మేరకు జరిగినట్టుగా భావించబడుతున్న విదేశీ చెల్లింపులకు సంబంధించి జరిగినవని తెలుస్తోంది'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, న్యూస్‌క్లిక్‌కు మద్దతు ఇస్తున్న, లేదా నిధులు అందచేస్తున్న సంస్థల వివరాలను ఆ వార్తా కథనం ఇచ్చింది. మీడియా సంస్థకు వారిచ్చిన మొత్తాన్ని కూడా వెల్లడించింది. ఇటువంటి మూడు సంస్థలకు ఒకే అడ్రస్ ఉంది. అలాగే, న్యూస్‌క్లిక్‌కు ఈ డబ్బు ఇచ్చినందుకు ప్రతిగా ఈ సంస్థలకు అందిన సేవలేంటో ఈడీ సిబ్బంది దగ్గర స్పష్టమైన సమాచారం లేదు.
జర్నలిస్టు సాంప్రదాయాలను అనుసరించి న్యూస్‌క్లిక్ డైరెక్టర్ ప్రబీర్, ఎడిటర్ ప్రాంజల్‌లు మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపారు. కానీ వారినుంచి ఎలాంటి స్పందన లేదు. అటువంటప్పుడు ఎదుటి పక్షం కోణాన్ని ఇవ్వలేదంటూ ఆ కథనాన్ని మీరెలా నిందిస్తారు? ప్రబీర్ ఫోన్‌ను లేదా ఈ-మెయిల్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈడీ ఉన్నందున వాటిని ప్రబీర్ ఉపయోగించలేకపోతున్నారని విలేకర్లకు తెలుసా? అటువంటప్పుడు ఈడీ అధికారులు ఇచ్చిన వివరాల్ని, వారి కోణాన్ని మాత్రమే తెలియచేస్తూ వార్తను ఇవ్వడం ఎంతవరకు సబబు? దాడులు ఇంకా కొనసాగుతున్నప్పుడు ఎదుటి పక్షం తనకు సంబంధించిన వాస్తవాలను కూడా ఇవ్వలేదు.
ఇక ప్రబీర్ కెరీర్, ఆయన సామాజిక లేదా ప్రజాజీవితం గురించి ఇక్కడ పట్టించుకున్నదే లేదు. ఒక సందర్భాన్ని దృష్టిలో వుంచుకుని ఈ దాడులు జరుగుతుండడం ఇక్కడ అసంగతం. రైతులు సాగిస్తున్న ఉద్యమం గురించి వార్తా కథనాలు ఇవ్వడంలో 'న్యూస్‌క్లిక్' చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఇస్తున్న వార్తా కథనాలు, విశ్లేషణాత్మకమైన వీడియోలను లక్షలాదిమంది తిలకిస్తున్నారు. బయటకు ఎలాంటి సమాచారాన్ని లేదా ఆలోచనలను అనుమతించకుండా మొత్తంగా ఒక సమాచార బుడగను సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దాని జాతీయవాద స్వభావం ఉల్లంఘించబడకుండా ఉండేలా ఆ బుడగలోనే ఈ ఉల్లంఘనను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను గణనీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నందున 'న్యూస్‌క్లిక్' వంటి వేదికలు, వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులు ఇటువంటి ముప్పులను ఎదుర్కొంటున్నారు. ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకునే హక్కుతో ఇది ముడిపడి ఉంది. ప్రజల సహజశక్తిని తప్పుగా అర్థం చేసుకోవడంపై ప్రఖ్యాతి చెందిన హిందీ గీతాన్ని ''యే పబ్లిక్ హై, యే సబ్ జాన్తీ హై'' (ఇక్కడ ఉన్నది ప్రజలు, వారికి అన్ని తెలుసు) ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. చాలా సందర్భాల్లో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియదు. ఆధునిక ఆర్థిక, రాజకీయ క్రమాలు చాలా సంక్లిష్టంగా మారాయి. వీటిని ప్రజలు అర్థం చేసుకోవడం అసాధ్యంగా తయారైంది. ప్రజలకు జరుగుతున్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. సమాచారాన్ని వెతకడానికి వారికి సాధనాలు అందచేయాలి. ఇందుకోసం విశ్లేషణాత్మాక వనరులు అవసరం. వాస్తవాలను తెలియచేయాల్సింది. ప్రజలకే, అటువంటి ప్రజలే ప్రభుత్వాలను జవాబుదారీగా ఉండేలా చేయగలుగుతారు.
కానీ ప్రభుత్వాలు చాలా తరచుగా చేసేదేంటంటే సంపన్నులకు సేవలందించడానికే ప్రజలిచ్చిన తీర్పును ఉపయోగిస్తూ ఉంటాయి. ప్రజలు నిరసన తెలియచేస్తూంటే కాలంతో పాటు మారడం లేదంటూ వారిని నిందిస్తాయి. ప్రభుత్వం, బడా మీడియా సంస్థలు మనల్ని ఉంచాలనుకున్న ప్రమాదకరమైన సమాచార బుడగను 'న్యూస్‌క్లిక్' వంటి మీడియా వేదికలు పేల్చాయి. వారి చర్యలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చేయడానికి అత్యంత సమర్థవంతమైన మార్గమేమంటే వారి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడం, వారి చట్టబద్ధతను సందేహంలో పడేయడం. ఆర్థికంగా వారు అవినీతిపరులని చూపించడం కన్నా మెరుగైన మార్గం ఏముంటుంది? తీస్తా సెతల్వాద్ పేరు ప్రతిష్టలపై మచ్చపడినా, ఆమ్నెస్టీ ఇండియా ఇక్కడ పని చేయకుండా పోయినా ఇలాంటివే కారణం. ఆమ్నెస్టీ ఇండియాపై ఈడీ, ఇతర సంస్థలు దాడులు జరిపాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడిందన్న అభియోగాలు మోపారు. ఈ సంస్థను పనిచేయనివ్వకుండా చేశారు. చిట్టచివరిగా ఆమ్నెస్టీ ఇండియా భారత్‌లో తన దుకాణాన్ని మూసివేసుకోవాల్సి వచ్చింది. ఇది మూతపడడం వల్ల నష్టపోయింది ఎవరు? కాశ్మీరీలపై భారత ప్రభుత్వం సాగిస్తున్న అత్యాచారాలను ఇది చిత్రీకరించింది. గతేడాది ఢిల్లీని కుదిపివేసిన అల్లర్లు, ఘర్షణల్లో ఢిల్లీ పోలీసుల పాత్రను ఇది వెలికితీసింది.
ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నందుకుగాను న్యూస్‌క్లిక్ కూడా ఈ రీతిలోనే ప్రభుత్వ ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ఆవిషయంలో మనం గందరగోళ పడకూడదు. ప్రమాదకరమైన వదంతులు వ్యాప్తి చేయకపోయినా సుప్రియా శర్మ, మృణాల్ పాండే, రాజ్‌దీప్ సర్దేశారు, జఫర్ అఘా, వినోద్ జోస్, మణిదీప్ పునియా, వినోద్ దువా, ఇస్మార్ట్ అరా ప్రభృతులు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వారిని ముప్పుగా చూస్తోంది కనుక. వీరిలో ఎవ్వరూ కూడా ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు నేరపూరితమైన అభియోగాలను ఎదుర్కొనడం లేదు.
'న్యూస్‌క్లిక్' విలాసవంతమైన భావ ప్రకటనా స్వేచ్ఛను అందుకోవాలను కోవడం లేదు. క్షేత్రస్థాయిలో కఠోర శ్రమకోర్చి సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధాన స్రవంతిలోని మీడియాగా చెప్పుకునే సంస్థలు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న వాస్తవ కోణాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందుంచాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో సాగుతున్న రైతాంగ ఉద్యమంలో బడా మీడియా తన రక్షణను చూసుకునేలా వ్యవహరిస్తుండగా, ప్రత్యామ్నాయ మీడియా మాత్రం ప్రజలకు వాస్తవాలను వెల్లడిస్తోంది. ప్రభుత్వం దీన్ని కోరుకోవడం లేదు. ఆర్థిక దుశ్చర్యల వల్ల కాదు, ఇందువల్ల 'న్యూస్‌క్లిక్'లోని మా స్నేహితులు బాధపడుతున్నారు. ఇంతలా దాడులు జరుగుతున్నా 'న్యూస్‌క్లిక్' వెబ్‌సైట్ 24గంటలూ అప్రతిహతంగా పని చేయడం విశేషం. గీతా హరిహరన్ వంటి నవలాకారిణి కూడా ఈ అకృత్యాలను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు నాలుగు రోజులు గడిచినా రచయితలు ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు రాకపోవడం ఎలా సాధ్యం? ఇలాగేనా మనం ధైర్యాన్ని ప్రోది చేయాల్సింది?
- అపూర్వానంద్
(వ్యాసకర్త ఢిల్లీ వర్సిటీ బోధకులు)