Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలమ్‌లో 2016 ఫిబ్రవరి 3న, 'సెజ్జులు పోయి, నిమ్జులొచ్చె డడ్డంక డాం...' అని రాసిన వ్యాసం సరిగ్గా ఐదు సంవత్సరాలు గడిచినా ప్రాసంగికత కోల్పోలేదని చూసి, దుస్థితి మారనందుకు విచారించనా, నా రచన ఇవాళ్టికీ ప్రాసంగికంగా ఉందని సంతోషించనా అని మరొకసారి విచికిత్సలో పడ్డాను. ప్రజా ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనే పేరిట రానున్న అదే నిమ్జ్ కథ ఇప్పటికీ విషాదకరంగా, బీభత్సంగా, రాజ్యదుర్మార్గానికి చిహ్నంగా సాగుతున్నది.
''ప్రజాప్రయోజనం'' పేరుతోనైనా సరే ప్రభుత్వం ఏదైనా పథకం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించదలచినప్పుడు, ప్రయివేటు భూమి సేకరించదలచినప్పుడు ఆ పథకం వల్ల జరగబోయే పర్యావరణ ప్రభావాన్ని, సామాజిక ప్రభావాన్ని అంచనా వేసే నివేదిక తయారు చేయాలని, ఆ పథకం మీద బహిరంగ ప్రజా విచారణ నిర్వహించి, ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించి, వాటి ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది. కాని తెలంగాణ ప్రభుత్వానికి ప్రజాప్రయోజనం, ప్రజాభిప్రాయ సేకరణ, చట్టం అంటే భిన్నమైన నిర్వచనాలు ఉన్నట్టున్నాయి. ప్రజా ప్రయోజనం అంటే తమ ఆశ్రితుల, తమకు ముడుపులు ఇచ్చేవారి ప్రయోజనాలు మాత్రమే. దేశదేశాల సంపన్నుల, బహుళ జాతి సంస్థల, కార్పొరేట్ల ప్రయోజనాలు మాత్రమే. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలను రాకుండా చేసి, వచ్చిన ప్రజల మీద లాఠీ చార్జి చేసి, అరెస్టు చేసి, మాట్లాడకుండా చేసి, తమ అనుకూల నివేదికలు ఇప్పించుకోవడమే. చట్టం అంటే తమ ఇష్టారాజ్యంగా అమలు చేయగల చిత్తు కాగితం మాత్రమే.
ఇది గత బుధవారంనాడు సంగారెడ్డి జిల్లా బర్దీపూర్‌లో అక్షరాలా అమలయింది. న్యాల్ కల్, ఝరాసంగం మండలాల్లోని 17గ్రామాలలోని ఐదువేలకు పైగా రైతులను బేదఖల్ చేసి, గ్రామాలు ఖాళీ చేయించి స్థాపించదలచిన జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలం (నేషనల్ ఇన్వెస్ట్ మెంట్, మాన్యుఫాక్చరింగ్ జోన్ - నిమ్జ్) పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గత బుధవారం జరిగింది. అది ప్రజలను రానివ్వని, ప్రజలులేని ప్రభుత్వానుకూల అభిప్రాయ సేకరణగా, లాఠీలు సేకరించిన ప్రజాభిప్రాయంగా అమలయింది. ప్రజాభిప్రాయ సేకరణ వేదికకు మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఆరు మార్గాల్లో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రభావిత గ్రామాల జనాభాకు రెండు మూడు రెట్ల పోలీసు బలగాలను మోహరించారు. వాహనాలను ఆపేశారు. వందలాది మందిని ఆపేశారు. అరెస్టు చేశారు. లాఠీచార్జి చేశారు. ఆ పథకం వల్ల భూమి కోల్పోయి నిర్వాసితులు కాబోతున్నవారిని మాత్రం అడ్డగించి, ఆ ప్రాంతంతో సంబంధం లేని, ఆ పథకం వల్ల కోల్పోయే భూములులేని, అధికారపార్టీ నాయకుల అభిప్రాయాలు మాత్రం సేకరించారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ప్రయోజనాల దృష్టితో, చట్టబద్ధంగా పనిచేయవలసిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పర్యావరణ శాఖ అధికారులు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేశారు. ప్రజలను ఇంతగా అడ్డుకోవలసిన, ప్రజాభిప్రాయం వినిపించ కుండా గొంతు నొక్కవలసిన అంత మహత్తర ప్రజా ప్రయోజన పథకం ఏమిటి? ఆ నిమ్జ్ గాథ చెప్పాలంటే, ఐదు సంవత్సరాల కింద ఇదే శీర్షికలో నేను రాసిన అంశాలు కొన్ని మళ్లీ చెప్పాలి.
మొదటి దఫా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసినప్పటికీ, అంతకుముందు ప్రణాళికా సంఘం సూచించిన ప్రజావ్యతిరేక విధానాలను, యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన విధానాలను యథాతథంగా, మరింత దూకుడుగా అమలు చేయడం ప్రాంభించింది. అందులో భాగంగా ప్రణాళికా సంఘం 2012-13లో ప్రకటించిన జాతీయ పెట్టుబడి, ఉత్పత్తి మండలాల విధానాన్ని కొనసాగించింది. కొత్తగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా నినాదంతో కలిపి నిమ్జ్ విధానాన్ని అమలు చేయదలచింది. నిమ్జ్‌లు భారీ పారిశ్రామిక, ఉత్పాదక మండలాలుగా ఉంటాయని, అంతర్జాతీయ స్థాయి మౌలిక సౌకర్యాలతో ఉంటాయని, ఇక్కడికి రాబోయే పరిశ్రమలకు కాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపుతో సహా, అనేక రాయితీలు ఉంటాయని, సరళీకృత విధానాలు అమలవుతాయని ప్రభుత్వం ఆశ చూపింది.
అంతకుముందు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండలాల (స్పెషల్ ఎకనామిక్ జోన్స్ - సెజ్) విధానానికీ, నిమ్జ్ విధానానికీ తేడా ఏమీ లేదని, ''నిమ్జ్ కేవలం పరిమాణంలో, మౌలిక సాధన సంపత్తి స్థాయిలో, నియంత్రణా విధానాల, పాలక విధానాల అమలులో మాత్రమే సెజ్ కన్న భిన్నమైనది'' అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పుకున్నది. సెజ్ ఏర్పాటు చేయడానికి వంద ఎకరాల లోపు స్థలం అయినా సరిపోతుందని నిబంధన ఉండగా, నిమ్జ్ ఏర్పాటు చేయడానికి మాత్రం కనీస పరిమితి ఐదువేల హెక్టార్లు - పన్నెండు వేల ఐదువందల ఎకరాలుగా విస్తరించింది. అంటే భారతదేశపు చిన్న, మధ్య తరగతి రైతులను అణగదొక్కి, వారి భూములు లాక్కుని దేశదేశాల సంపన్నులకు, బహుళ జాతి సంస్థలకు, వారి దళారీలకు వేలాది ఎకరాలు అప్పనంగా కట్టబెట్టడానికి తయారయినదే ఈ నిమ్జ్ విధానం. ఇటువంటి ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక విధానాలన్నిటికీ ఆకర్షణీయమైన అంకెల గారడీ మెరుగులు దిద్దినట్టుగానే ఈ విధానం ద్వారా దేశంలో ఉత్పత్తి రంగ వాటా ప్రస్తుత 16శాతం నుంచి ఒక దశాబ్దంలో 25శాతానికి పెరుగుతుందనీ, పది కోట్ల మందికి ఉద్యోగం కల్పించాలని ఆశిస్తున్నామనీ ప్రభుత్వం చెప్పింది. దేశవ్యాప్తంగా పదహారు నిమ్జ్‌లు ఏర్పాటు చేయడానికి పథకాలు సిద్ధం చేసింది. సరిగ్గా సెజ్ విధానంలో లాగనే ఈ ప్రగల్భాలన్నీ గాలిమేడలని తేలిపోయింది. పదహారు చోట్ల ఇవి ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే ఒకే ఒక్కటి అరకొరగా అమలులోకి వచ్చింది. పదమూడు నిమ్జ్‌లకు సూత్రబద్ధ అనుమతులు ఇచ్చామని ప్రభుత్వ పత్రాలు చెపుతున్నప్పటికీ ఒక్క నిమ్జ్‌లో మినహాయిస్తే మిగిలిన చోట్ల పరిశ్రమలు వచ్చినదీ లేదు, ఉద్యోగకల్పన జరిగినదీ లేదు. రైతుల నుంచి భూములు లాక్కోవడమూ, గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించడమూ, పారిశ్రామిక వ్యాపార సంస్థలకు అడగనివాడిదే పాపమన్నట్టుగా భూములు కట్టబెట్టడమూ జరిగిపోయాయి.
ఈ పథకం మొదట్లోనే దేశంలోని పదహారు నిమ్జ్ లలో రెండు తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని తలపెట్టారు. తెలంగాణలో భూలభ్యత, బహుళజాతి సంస్థల, దేశదేశాల సంపన్నుల భూదాహానికి జీ హుజూర్ జో హుకుం అనే పాలకులు ఉండడం అనే ప్రధాన కారణాల వల్లనే తెలంగాణకు రెండు నిమ్జ్‌లు దక్కాయి గాని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయడానికో, తెలంగాణ నిరుద్యోగాన్ని పరిష్కరించడానికో కాదు.
తెలంగాణకు దక్కిన నిమ్జ్‌లలో మెదక్ (జహీరాబాద్) నిమ్జ్ కు డిసెంబర్ 2012 లోనే సూత్రబద్ధ అంగీకారం దొరికింది. కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ 2013 ఆగస్ట్ లో ప్రకటించిన జాబితాలో అది చేరింది. న్యాల్ కల్, ఝరాసంగం మండలాల్లోని పదిహేడు గ్రామాల్లో 12,635 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఈ నిమ్జ్ రూ.43,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందనీ, ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపల మూడు లక్షల పదిహేను వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పిస్తుందనీ, నాలుగున్నర లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పిస్తుందనీ తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించిందని 2014 డిసెంబర్ 3న రాజ్యసభలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చివరికి 2016 జనవరి 22న ఈ నిమ్జ్‌కు కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి వచ్చింది. ఈ సందర్భంలో విడుదల చేసిన ప్రకటనలో మాత్రం అంకెలు కాస్త మారాయి. జరిగేది ఎలాగూ అంకెల గారడీనే గనుక, ఆ అంకెలకు విశ్వసనీయత, పరీక్షలేదు గనుక ఎప్పుడు నోటికి ఏ అంకె తోస్తే ఆ అంకె చెప్పవచ్చునని అనుకున్నట్టున్నారు. కొత్త ప్రకటనలో ఈ నిమ్జ్ రూ.17,300 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందనీ, రెండు లక్షల అరవై ఒక్కవేల ఉద్యోగాలు కల్పిస్తుందనీ రాశారు. ఇలా ఆకుకు అందని పోకకు పొందని అంచనాలు విడుదలవుతున్నాయంటే ఏ ఒకటో నిజమని కాదు, రెండూ అబద్ధమే అని. ఆరు సంవత్సరాల తర్వాత స్వయంగా తెలంగాణ ప్రభుత్వాధికారులే పెట్టుబడులను వెయ్యి కోట్ల రూపాయలు పెంచి, రూ.44,000 కోట్లుగా చెపుతున్నారు. మరొకపక్క ఉద్యోగకల్పనను మాత్రం మొదట చెప్పిన అంకెలో మూడింట రెండు వంతులు తగ్గించి రెండు లక్షల అరవై ఆరు వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు అంటున్నారు!! నిజం అయితే మారదు గాని, అబద్ధం అయితే నోరు తెరిచినప్పుడల్లా ఒకటి చెప్పవచ్చు గదా!
తుది అనుమతి రాకముందే తెలంగాణ ప్రభుత్వం నిమ్జ్‌కు అవసరమైన 12,635 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో దాదాపు మూడు వేల ఎకరాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉంది. ఇలా సేకరించదలచిన భూమిలో వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున ఉండడంతో, వాటిని కూడ స్వాధీనం చేసుకోవడానికి మార్గాంతరాల అన్వేషణ ప్రారంభించింది. ఈ భూసేకరణలో చట్టబద్ధంగా జరపవలసిన బహిరంగ ప్రజా విచారణను తూతూ మంత్రంగా మార్చివేసింది. నిమ్జ్ ప్రకటనతో ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోగా, రైతులు తమ భూములు వదలడానికి నిరాకరిస్తుండగా, ప్రభుత్వం నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి భూములను ఆక్రమించే ప్రయత్నాలు ప్రారంభించింది. కరోనా వైరస్ మహావిపత్తు, లాక్‌డౌన్ సమయంలో రైతుల వ్యతిరేకత తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గత సంవత్సరం జూలై 10న బహిరంగ విచారణ ప్రకటించింది. తమకు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న నష్టపరిహారం చాల తక్కువనీ, కొవిడ్ సమయంలో ఈ తొందర దేనికనీ మామిడ్గి గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కరోజు ముందు హైకోర్టు బహిరంగ విచారణ మీద స్టే విధించింది. అలా ఆరు నెలల కింద ఆగిపోయిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు లాఠీల సహాయంతో పూర్తయింది.
ఈ నిమ్జ్‌లో ఎలక్ట్రికల్ పరికరాలు, లోహ పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆటోమొబైల్, యంత్ర, ఖనిజేతర, ఎలక్ట్రానిక్స్, వాహన పరిశ్రమలు ఏర్పాటవుతాయని 2017 డిసెంబర్‌లో ఎల్ అండ్ టి ఇఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ తయారు చేసిన ప్రి ఫీజిబిలిటీ రిపోర్ట్ చెపుతున్నది. ఈ జాబితాలో అత్యధికం విపరీతమైన పెట్టుబడి-ఆధారిత, అధునాతన, స్వయంచాలిత యాంత్రీకరణ జరిగిన పరిశ్రమలు. పైకి చూడడానికి వందల కోట్ల, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు కనబడుతుంది గాని అవి సృష్టించగలిగిన ఉద్యోగాలు తక్కువ. ఏవో కొన్ని ఉద్యోగాలు సృష్టించగలిగినా ఆ పరిశ్రమలకు అవసరమైన ఉన్నత సాంకేతిక విద్యార్హతల వల్ల అవి తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తీర్చడంలో గణనీయమైన పాత్ర నిర్వహించలేవు.
ప్రస్తుత నిమ్జ్ విధానానికి కన్నతల్లి అయిన సెజ్ విధానమే చూస్తే సెజ్‌లు ప్రారంభించిననాడు దేశవ్యాప్తంగా యాబై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కాని నడుస్తున్న కంపెనీలకే సెజ్ బోర్డులు పెట్టి, ఉద్యోగ కల్పనకు ఎంత మాత్రం అవకాశం లేని వ్యాపారాలకు సెజ్ బోర్టు తగిలించి లెక్కలు చూపినా సెజ్‌లలో ప్రకటిత యాబై లక్షల ఉద్యోగాలకు గాను పదిహేను సంవత్సరాల తర్వాత పదిహేను లక్షల కన్న ఎక్కువ ఉద్యోగాలు రాలేదు.
జరిగే ఉద్యోగ కల్పన కూడ నిమ్జ్‌లకు ప్రకటిస్తున్న సరళీకత కార్మిక విధానాల వల్ల, కార్మికులను, ఉద్యోగులను రాచి రంపాన పెట్టి, ఏ సౌకర్యాలూ వసతులూ సరైన పని పరిస్థితులూ లేని ఉద్యోగ కల్పనే అవుతుంది. పోనీ వందల, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయనుకున్నా ఆ పెట్టుబడులు, అవి సాధించే లాభాలు అనేక రాయితీలతో, మినహాయింపులతో వస్తున్నాయి గనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వాటితో ఒనగూడే ప్రయోజనమేమీ లేదు. అంటే తెలంగాణ భూమీ పోయి, తెలంగాణకు ఉద్యోగాలూ రాక, తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ లేక ఈ నిమ్జ్‌లు తెలంగాణకు ఏ మేలు చేయడానికి వస్తున్నట్టు?
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028