Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కొద్దిమంది పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది కార్మికుల, రైతుల కడుపులు కొట్టే చర్యలకు మోడీ సర్కార్ పూనుకున్నది. ప్రజలపై భారాలు మోపే విధంగా నిత్యావసర నియంత్రణ చట్టానికి సవరణలు చేసింది. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే నల్ల చట్టాలను చేసింది. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మిక చట్టాలు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వ్యవసాయం లాంటి అంశాలను కనీసం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా కేంద్రం లాగేసుకుంది. ఇది మన ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తు తున్నాయి. 2020 నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలో 25కోట్ల మంది కార్మికులు భాగస్వాములై ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించారు. గత 60రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, షాజహాన్‌పూర్, టిక్రీ, పల్వాల్, ఘాజీపూర్, నోయిడా సరిహద్దుల్లో రైతులు ఎముకలు కొరికే చలిలో రక్తం గడ్డకట్టినా, అనేకమంది చనిపోతున్నా, వీరోచితంగా పోరాడుతున్నారు. రైతాంగ పోరాటానికి దేశ విదేశాల్లో భారీ స్పందన వస్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని రైతులు తెగేసి చెపుతున్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, పంటలకు కనీస మద్దతు ధర లాంటి డిమాండ్ల పరిష్కారం లభించనిదే ఉద్యమాన్ని విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు.
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ''కార్మిక-కర్షక పోరాటాల''ను ఉధృతం చేయాలని, క్షేత్రస్థాయిలో కార్మిక-కర్షక మైత్రిని బలపర్చాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని కర్తవ్యంగా తీసుకున్నది. ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోసం 2021 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ కార్మిక-కర్షక పోరుయాత్రల పేరుతో పారిశ్రామిక ప్రాంతాలు, క్లస్టర్స్, మండల, గ్రామస్థాయి వరకు ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ఈ పోరు యాత్రలు 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తీసుకొవచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, 4 లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ 2020 బిల్లును బేషరతుగా రద్దు చేయాలని సాగుతున్నాయి.
పోరుయాత్రలో పెట్టిన డిమాండ్లకు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తున్నది. వర్గల్ మండలంలో వారం అంగడి జరుగుతున్న సందర్భంగా పోరుయాత్ర సభ జరిగింది. వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో రైతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాపై భారాలు మోపి, మమ్ములను బతకనీయకుండా నిర్ణయాలు చేస్తుంటే మీరు ఇలా వచ్చి మాట్లాడి అలా వెళ్తే ఎలా? మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, పోరాటానికి పిలుపునివ్వాలని జాతా నాయకులకు వారి స్పందనలు తెలియజేశారు. దుబ్బాకలో మీరు సంఘం పెట్టండి, మేము సంఘటితమవుతాం అంటూ ముందుకొచ్చి జాతా నాయకులకు సంఘీభావ నిధి అందించారు. ఆ ప్రాంతంలో బీజేపీ అనుబంధ సంఘమైన బిఎంఎస్ నాయకులు సైతం పోరు యాత్ర చేస్తున్న సీఐటీయూ నాయకత్వాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మికులు గతంలో వారి వేతనాలు, పని పరిస్థితులు వరకే పరిమితమై స్పందించేవారు. నరేంద్రమోడీ తెచ్చిన విధానాలను, ప్రజలెదుర్కొంటున్న సమస్యలను లింక్ చేసి ఈ యాత్ర జరగడంతో కార్మికవర్గం కేవలం ఆర్థిక సమస్యలపైనే కాకుండా రైతాంగ సమస్యలపై కూడా స్పందిస్తున్నారు. నల్గొండ జిల్లా కొవ్వూరు గ్రామంలోని ప్రజల్ని కార్మికులు, రైతులు కలిసి యాత్ర సభకు సమీకరించారు. ఖమ్మం జిల్లా, నాగులవంచలో జాతా చేరుకునే వరకు చాలా ఆలస్యమైంది. అయినా ప్రజలు, ఆ గ్రామంలోని రైతులు జాతా కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులు మాకు సంఘం పెట్టాలని యాత్ర నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సీఐటీయూ చేరుకోని అనేకమంది కార్మికుల వద్దకు ఈ పోరు యాత్ర చేరుకుంటుంది. కరోనా నేపథ్యంలో వచ్చిన సుదీర్ఘకాల విరామం తర్వాత ప్రజల వద్దకు నేరుగా వెళ్ళేందుకు ఈ యాత్రలు సాధనాలుగా ఉపయోగపడ్తున్నాయి. కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సాగుతున్న పోరుయాత్రలో అనేక జిల్లాల్లో ప్రజలు, కార్మికులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విధానాల పట్ల కూడా ఆగ్రహంతో ఉన్నారు. మమ్ముల్ని పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని తీసుకొచ్చి మమ్ముల్ని మల్టీపర్పస్ వర్కర్‌గా మార్చడమే కాకుండా, మాతో పాఠశాలల మరుగుదొడ్లు కడిగించే పద్ధతి తీసుకువచ్చిందని గ్రామ పంచాయతీ కార్మికులు, వేతనాన్ని రూ.24,000 పెంచాలని, కేటగిరీల వారీగా వేతనాలు అమలుచేయాలని మున్సిపల్ కార్మికులు, టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చి మమ్ముల్ని తొలగించిందని స్వచ్ఛ కార్మికులు, ప్రభుత్వం మమ్ముల్ని కార్మికులుగా గుర్తించ నిరాకరిస్తుందని స్కీమ్ వర్కర్లు, ఆంధ్రప్రదేశ్‌వలె మాకు కూడా వేతనాలు ఇచ్చే విధంగా పోరాటానికి పిలుపునివ్వాలని ఆషా వర్కర్లు, ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని, నగదు బదిలీతో పాటు అన్నిరకాల ప్రయివేటీకరణలు ఆపాలని, అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం టీచర్లకు రూ.30 వేలు, హెల్పర్లకు రూ.21 వేలు చెల్లించాలని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయబడిన కాలానికి నెలకు రూ.10,000 చొప్పున చెల్లించాలని, తమ వేతనాలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు, తొలగించిన 7,600 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు, నెలకు 26 రోజులు పని కల్పించాలని, జీఎస్‌టీ నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని, జీవనభృతి ఎలాంటి షరతులు లేకుండా బీడీ పరిశ్రమలో పని చేస్తున్న అన్ని క్యాటగిరీల కార్మికులకు వర్తింప చేయాలని బీడీ కార్మికులు, బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు నిధులను అక్రమంగా దారి మళ్ళించకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని బిల్డింగ్ వర్కర్స్, సమగ్ర శాసనంతో పాటు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డ్‌లు ఏర్పాటు చేయాలని హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ రంగం కార్మికులు, 75 షెడ్యూల్డ్ రంగాల పరిశ్రమల్లో ఆరేండ్లుగా కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని పారిశ్రామిక కార్మికులు, పోరుయాత్రలో నాయకులకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల వివిధ వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇది నిదర్శనం.
కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు, ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి అన్ని తరగతుల ప్రజలు ఈ పోరు యాత్రల సందర్భంగా సంఘీభావం వ్యక్తం చేస్తు న్నారు. విద్యార్థులు, మహిళలు, యువత, వామపక్షాలు, మేథావులు, సామాజిక శక్తులు, సంస్థలు, విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు మద్దతు గా ఉంటామని ప్రకటిస్తున్నారు. ఈ ఐక్యత మరింత బలపడి రానున్న కాలంలో కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం కావడానికి కార్మిక-కర్షక పోరు యాత్రలు నాంది కానున్నాయి.
- పాలడుగు భాస్కర్
సెల్ : 9490098033