Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోసకాయ... నీరు ఎక్కువగా ఉండి పుష్కలమైన పోషకాలతో కూడిన పేదోడి ఆహారం. పక్వానికి రాకపోతే కొంచెం వగరుగా, పండితే ఎక్కువ తీపిదనంతో ఉండటం దీని సహజ లక్షణం. మన తాతల కాలం నుంచి నేటి దాకా దోసకాయలను టైం పాస్ కోసం, కూర కోసం వాడుకోవటం అందరికీ తెలిసిందే. అయితే వగరుగా ఉన్న దోసకాయను తినాలంటే దాన్ని కోసి... ముక్కలపై ఉప్పు, కారం చల్లుతారు. ఇంకా రుచి రావాలంటే దాని మీద కాసింత నూనె వేసి.. పెనం మీద వేసి కాలుస్తారు. ఒకవేళ పచ్చడి చేసుకోవాలంటే రోట్లో వేసి దంచుతారని అప్పుడెప్పుడో మా నాయనమ్మ చెప్పింది. ఒకవేళ ఆ దోసగింజలకే నోరుంటే... 'ఏందిరా బై నాకీ గోస...' అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేసేదే. ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ పార్టీ అదే గోసను అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది. గతంలో ముందూ వెనుకా, మంచీ చెడూ ఆలోచించుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కార్‌కు బాజప్తాగా అనేక విషయాల్లో మద్దతిచ్చింది కారు పార్టీ. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు... ఇలా అనేకాంశాల్లో 'కమలం'తో కలిసి నడిచింది 'గులాబీ'. ఇంత చేసినా మోడీ భారు... రాష్ట్రానికి ఒక్క పైసా అదనంగా ఇవ్వకపాయే. జీఎస్టీ పరిహారాలు ఎగ్గొట్టవట్టే. హైదరాబాద్‌కు వరదలొస్తే కనీసం పరామర్శించిన దిక్కులేదాయే. ఇయ్యన్ని గిట్లుండంగ... మొన్నటికి మొన్న దుబ్బాకలో గెలిసిన దూకుడుతో జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో కమల దళం ఆగుతలేదు. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మరోవైపు అమిత్ షా, ఇంకోవైపు యోగి ఆదిత్యనాథ్... ఇలా హైదరాబాద్‌పై ముప్పేట దాడి చేయబట్టిరి. దీంతో కండ్లు తెరిసిన టీఆర్‌ఎస్ బాస్... 'మేధావులారా ఆలోచించండి, యువకులారా ఉద్రేక ప్రసంగాలకు రెచ్చిపోకండి... ప్రజలారా విజ్ఞతతో వ్యవహరించండి...' అంటూ పలుమార్లు వేడుకోవాల్సి వచ్చే. ఇవే విషయాలను, ఇంకా చెప్పాలంటే... ఇంతకు మించిన అనేక ప్రజానుకూల అంశాలను అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర శక్తులు, మేధావులు, ప్రతిపక్షాలు గులాబీ బాస్ చెవుల పడేద్దామని గతంలో భావిస్తే... 'నేను అపాయింట్‌మెంట్ ఇవ్వనుగాక ఇవ్వను...' అనుకుంటూ ఆయన భీష్మించుక కూర్చుండిపాయే. గిప్పుడేమో ఆ ఉత్తరాది వాళ్లను చూసి అదే సారు... 'దోస గింజల గోస'ను అనుభవిస్తుండే. గందుకే గిప్పటికైనా తీరు మార్చుకుని... మంచి ఎవరు జెప్పినా వినాలంటూ మొత్తుకుంటున్నరు మన తెలంగాణ జనాలు...
- బి.వి.యన్.పద్మరాజు