Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే కండ్లు నులుముకుంటూ తలుపు తెరిచింది లక్ష్మి. పాల వాడు వచ్చి లక్ష్మీ చేతిలో పాల ప్యాకెట్లు పెట్టాడు. అమ్మగారు ఈరోజు 12వ తేదీ, ఇప్పటివరకు నాకు పైసలు ఇయ్యలేదు. రేపు ఇయ్యకుంటే మీకు చార్జిషీటు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. పొద్దున్నే వీడు ఏం మాట్లాడుతున్నాడో అనుకుంటూ లోనికి వెళ్ళింది. కాసేపట్లో వంట తయారు చేసి భర్త శేఖర్‌కు క్యారేజి రెడీ చేసి ఇచ్చింది. శేఖర్ హడావిడిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
లాక్‌డౌన్‌తో కాలేజీ బంద్ కావడంతో ఇంట్లోనే ఉన్న కొడుకు చిన్నాను పిలిచింది లక్ష్మి. బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకురారా అని అడిగింది.
నేను పోనమ్మా అన్నాడు చిన్న.
ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా! కూరగాయలు తెస్తే ఏమైందిరా? అని గట్టిగా అడిగింది తల్లి కొడుకును.
నేను పోనని చెప్పాను కదా! మళ్లీ అడిగావంటే నీకు చార్జిషీటు ఇస్తాను చూడు అంటూ చిన్నా మిద్దెపైకి వెళ్ళిపోయాడు. లక్ష్మికి తల తిరిగి పోయింది. పొద్దున పాలవాడు, ఇప్పుడు వీడు... ఈ చార్జిషీటు ఏందబ్బా అనుకుంటూ తనే బజారుకు వెళ్ళింది.
కూరగాయలు ఏరుతుండగా లక్ష్మీ పక్కన ఒక మహిళ గట్టిగా అరుస్తోంది. ఏమిటివి కూరగాయలా లేక వెండి బంగారాలా? ఇంత రేట్లు పెట్టి ఎట్లా కొనాలి? అని అంటోంది! దాంతో షాపు ఓనర్ అమ్మ మీరు కొంటె కొనండి లేకపోతే మానండి. అంతేగాని లొల్లి చేయకండి. అని ప్రాధేయపడ్డాడు.
లొల్లి చేయక ఊకుంటామా ఏంది? ఇట్లే చేసినవంటే నీకు చార్జిషీటు ఇస్తాను. అంటూ ఆమె వెళ్ళిపోయింది. లక్ష్మికి మళ్లీ షాక్ కొట్టినట్లయింది. ఇక్కడ కూడా చార్జిషీటే... అనుకుంటూ కొన్న కూరగాయలతో ఇంటికి చేరింది. భోజనం చేసి తీరిగ్గా టీవీ పెట్టింది. ఈ ప్రభుత్వంపై మేము చార్జిషీటు ఇస్తున్నాం. అంటూ పువ్వుగుర్తు పార్టీ నాయకుడు ఉపన్యాసం దంచుతున్నాడు. చార్జిషీటు అన్న మాట వినగానే లక్ష్మి చేతిలోని రిమోట్ విసిరికొట్టింది!
సాయంత్రం శేఖర్ గొణుక్కుంటూ ఇంటికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. లక్ష్మీ చారు తీసుకొని వచ్చింది. శేఖర్ ఇంకా గొణుక్కుంటూనే జేబులో నుంచి ఓ కాగితం తీశాడు.
ఏంటి ఆ కాగితం? అడిగింది లక్ష్మి.
చార్జిషీటు! మా బాస్ ఇచ్చాడు. శేఖర్ మాటలు పూర్తి కానే లేదు లక్ష్మి నెత్తి కొట్టుకుంది.
ఏమైందే! ఎందుకు నెత్తి కొట్టుకుంటున్నవు? అడిగాడు శేఖర్.
పొద్దుటి నుంచి ఈ చార్జిషీటు పేరు విని విని చెవులు పగిలిపోయాయి! అన్నది లక్ష్మి.
అవునా! ఈ రోజు మా బాస్ అందరికీ చార్జిషీట్లు ఇచ్చాడు. ఆఫీసులో పనిచేయటానికి కుర్చీలు, టేబుళ్లు సక్రమంగా లేవుగాని చార్జిషీట్లు మాత్రం ఇచ్చాడు. అకస్మాత్తుగా ఈ చార్జిషీట్లు ఎందుకు గుర్తొచ్చాయో అర్థం కావటం లేదు అన్నాడు శేఖర్ చిరాగ్గా.
ఎందుకు గుర్తుకు రావు? అన్నీ గెలకటానికి ఆ పువ్వు గుర్తు పార్టీ వాళ్లు ఉన్నారు కదా! వాళ్లు చార్జిషీటు ఇస్తామంటూ ఉపన్యాసాలు దంచారు. అప్పటి నుంచి ఇదే వరస. అయినా ఈ చార్జిషీటు ఎందుకు ఇస్తారు? అడిగింది లక్ష్మి.
ఏవైనా నిబంధనలు, చట్టాలు ఉల్లంఘిస్తే చార్జిషీట్లు ఇస్తారు. ఈ పువ్వు గుర్తు వాళ్ళు దేశాన్ని ఏమి ఉద్ధరించారని ఇతరులకు చార్జిషీటు ఇస్తారు? దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ, దేశ ప్రజల రెక్కల కష్టాన్ని అంబానీలకు, ఆదానిలకు ధార పోస్తున్నారు. ఆఖరికి దేశ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. అందుకే తమ తప్పులు బయటపడకుండా దొంగే దొంగ అని అరిచినట్లు తామే చార్జిషీటు ఇస్తామంటున్నారు. నిజానికి చార్జిషీటు వాళ్లకే ఇవ్వాలి. చార్జిషీట్ కాదు, పనిష్మెంట్ కూడా వాళ్లకే ఇవ్వాలి. అన్నాడు శేఖర్ కోపంగా.
- ఉషాకిరణ్