Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో ఆర్థిక కోర్కెలు, జీతాల కోసం, రైతాంగ గిట్టుబాటు ధరలు, ఇతర సమస్యలపై సమ్మెలు జరిగాయి. ఈసారి మొదటిసారి రాజకీయ కోర్కెతో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమ్మె జరుగుతున్నది. పాలన సక్రమంగా లేదని కార్మికులు, కర్షకులు ఈ సమ్మెకు పూను కుంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. కోవిడ్ రాకముందునుంచే ఇది ఉన్నది. మోడీ అధికారంలోకి వచ్చాక జీడీపీ తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి మైనస్ పది శాతంలోకి వెళ్తుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం అనాలోచితంగా లాక్‌డౌన్ విధించడం వల్ల కార్యకలాపాలు స్థంభించిపోయాయి. పరిశ్రమలు బందయ్యాయి. వృత్తులు ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి నిలిచిపోయింది. వ్యవసాయం తప్ప పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయింది. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. దీన్నుంచి బయటపడేందుకు ప్రజలకు నగదు సహాయం చేసేందుకు తిండి గింజలు పంపిణీ చేసేందుకు, ప్రభుత్వం ముందుకు రాలేదు. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లింది. ఇతర వ్యవస్థలు న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు సంక్షోభంలోకి వెళ్లాయి. మోడీ విధానాల వల్ల పార్లమెంటు, చట్టసభలు సక్రమంగా పనిచేయడం లేదు. అన్నింటిపై విధివిధానాలు పాటించడంలేదు. కర్రపెత్తనం నడుస్తున్నది. వ్యవసాయ చట్టాల ఆమోదం దీనికి నిదర్శనం. కనీసం చర్చ జరగ లేదు. ఓటింగ్ నిర్వహించ లేదు. మెజార్టీ ఉన్నా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. పార్లమెంటరీ వ్యవస్థలను జేబుసంస్థలుగా మారుస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పులు చూస్తే న్యాయం జరుగుతుందా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతున్నది. రామమందిరం, ఆర్టికల్ 370 వంటి అంశాల్లో సుప్రీం కోర్టు న్యాయబద్ధతపై అనుమానాలున్నాయి. సీబీఐ పెంపుడు కుక్కలా పనిచేస్తున్నది. కాగ్, కేంద్ర సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. కాషాయదళం ఏం చెప్తే అది చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. సామాజిక సంక్షోభం వస్తున్నది. ఎన్ని మతాలు, కులాలున్నా సామరస్యంగా మెలిగే వాళ్లం. కానీ మత ఉద్రిక్తతలు, మతకల్లోలాలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక దాడులు పెచ్చురిల్లుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. ఉపాధి లేకుండా పోతున్నది. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, కార్మిక చట్టాల సవరణ జరిగింది. ఈ సవరణలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కోలుకోలేని విధంగా చేస్తున్నవి. తప్పుడు చట్టాలు, వ్యవసాయ, పారిశ్రామికరంగాన్ని దెబ్బతీసే చట్టాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ వీధుల్లోకి వచ్చి పోరాడాలి. ప్రకటనలకే పరిమితమైతే ప్రయోజనం లేదు.
దేశంలో భయానకమైన పరిస్థితి ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం పోరాడాలి. కానీ కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది పివి నరసింహారావు ప్రభుత్వం. దాన్ని వేగంగా అమలు చేస్తున్నది మోడీ సర్కారు. సరళీకృత ఆర్థిక విధానాలను ఏ రూపంలోనూ కాంగ్రెస్ వ్యతిరేకించడం లేదు. మతతత్వ సమస్యలున్నాయి. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. కానీ కాంగ్రెస్ దానిపై పోరాడటం లేదు. ఆ పార్టీ బలహీనమైపోతున్నది. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అవి కాంగ్రెస్ సిట్టింగ్‌స్థానాలే అయినా 9 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అయినా కాంగ్రెస్ గెలవడం లేదు. దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. విధానాల పరంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ రావడం లేదు. సోనియా, రాహుల్ నాయకత్వంపైనా వ్యతిరేకత వస్తున్నది. పెద్ద సంక్షోభంలో కాంగ్రెస్ ఉన్నది. నాయకత్వలోపం కారణం కాదు. విధానపరమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు లేదు. బీజేపీని ఎదుర్కొనే విధానం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ కర్తవ్యాన్ని కార్మికవర్గం చేపడుతున్నది. అందులో భాగమే ఈ సార్వత్రిక సమ్మె.
- తమ్మినేని వీరభద్రం