Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ వల్ల ప్రజలు, కార్మికులు ఉపాధిలేక, ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే, కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 'ఇప్పుడు కాకపోతే మరెప్పుడు' చేయలేం అనే నినాదంతో మొత్తం ప్రభుత్వ రంగాన్ని అమ్మి వేయడంతో పాటు, విచ్చలవిడిగా విదేశీ నిధులకు ద్వారాలు తెరిచింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను అంతే తీవ్రస్థాయిలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని భారతదేశ కార్మికవర్గానికి నాయకత్వం వహిస్తున్న 10జాతీయ కార్మిక సంఘాలు (బిఎంఎస్ మినహా), వివిధ రంగాలకు చెందిన ఫెడరేషన్స్ సంయుక్తంగా నవంబర్ 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెతో ప్రభుత్వం తన విధానాల నుంచి వెనక్కి మళ్ళనట్టయితే, బహుళ దిన సమ్మెలకు కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాయి.
పరాయి పాలనలో వందల సంవత్సరాలు మగ్గిన భారత ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం పోరాడిన పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని, మన పాలకులే మొత్తం పరాయి దేశాల పెట్టుబడిదారులకు, స్వదేశ పెట్టుబడిదారులకు ప్రజల సొమ్మంతా (ప్రభుత్వ రంగ సంస్థలు) దోచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకోవాలని, ఈ సమ్మె ఒక దేశభక్తియుత సమ్మెగా పిలుపునిచ్చారు. అటువంటి దేశభక్తియుత సమ్మెను బలపరుస్తున్నామని, దేశవ్యాప్తంగా పని చేస్తున్న 200లకు పైగా వున్న రైతు సంఘాలు ప్రకటన చేశాయి. నవంబర్ 26, 27 తేదీలలో దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని వ్యవసాయ, రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఇంతటి మహత్తర సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వామపక్షాలు ప్రకటించాయి. ఇటీవలే మన రాష్ట్రంలోని పాలక పార్టీగా వున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సైతం బీజేపీ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన సమ్మె సరైందని ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సమ్మెను సపోర్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సమ్మెలో పాల్గొనాలంటూ పోస్టర్స్ ఆవిష్కరించారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్ కెవి, టీఎన్‌టీయూసీ, రెండు ఐఎఫ్‌టీయూలు జాతీయ సంఘాలతో పాటు సమ్మె చేస్తామని, సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఆ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా వున్నాయి. మొత్తంగా దేశంలో పనిచేస్తున్న ఆర్టీసీలన్ని తమ ఉనికిని కోల్పోయి, బలవన్మరణం పాలయ్యేలా చేస్తున్నారు. ఎం.వి. యాక్ట్ సవరణ చట్టంలో పర్మిట్స్ విధానంలో తీసుకొచ్చిన మార్పులను ఆసరా చేసుకొని టూరిస్ట్ బస్‌లను కూడా పరిమితమైన పన్నుతో దేశమంతా స్టేజి కారేజీలుగా నడుపుకొనేందుకు అవకాశం కల్పించబోతున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో విద్యుత్ బస్‌లను ప్రోత్సహిస్తూ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు లాభాలు దోచిపెట్టేలా విధానాలు రూపొందించి, ఆర్టీసీలను కుంగదీస్తున్నారు. భారతదేశ చట్టాలలో లేని 'అగ్రిగేటర్స్' (యాప్ ఆధారంగా ఆపరేట్ చేసే సంస్థలు) వ్యవస్థను తీసుకొచ్చి, కార్లు తోలే డ్రైవర్స్‌ను దోచుకునేందుకు ద్వారాలు తెరిచారు. ఇప్పుడు 'ఉబర్' కంపెనీకి భారతదేశంలో బస్‌లు నడపడానికి 'అగ్రిగేటర్'గా అనుమతి ఇచ్చారని, కరోనా నేపధ్యంలో ఆలస్యమైందని, త్వరలో బస్‌లను నడుపనున్నామని ఆ సంస్థ ప్రకటించింది. 'లండన్ మోడల్ ట్రాన్స్‌పోర్టు' పేరుతో మొత్తం బస్ రవాణా వ్యవస్థను అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కరోనా కాలంలోనే కేంద్రం డీజిల్‌పై రూ.13కు పైగా ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. రోజువారీ ధరల స్థిరీకరణ పేరుతో లీటర్‌కు రూ.6కు పైగా ధరలు పెరిగాయి. దీని ఫలితంగా ఆర్టీసీల ఇంధన ఖర్చు అంతకంతకు పెరుగుతూ పోతున్నది. ఆర్టీసీ యాక్ట్ 1950 చట్ట ప్రకారం ఆర్టీసీలకు 1:2 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులు నిలిపివేశాయి. నిధుల లేమిని ఎదుర్కొంటున్న ఆర్టీసీలు బస్‌ల సంఖ్యను పెంచలేక, తన ఆపరేషన్స్‌ను తగ్గించు కుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో 837బస్‌లు తగ్గించుకోవడం ఒక ఉదాహరణ. ఇన్ని రకాల పన్నులు చెల్లిస్తూ, ప్రజల కోసం ప్రయాణికులు ఉన్నా లేకున్నా బస్‌లు నడుపుతున్న ఆర్టీసీలకు ఆదాయానికి, ఖర్చులకు మధ్య తీవ్రమైన వ్యత్యాసము వస్తున్నది. దీనినే ప్రభుత్వాలు ఆర్టీసీకి నష్టంగా చూపిస్తూ, కార్మికులపై విపరీతమైన పని భారాలు పెంచుతున్నారు. జీతాలకు డబ్బులు లేవని 12వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదు. ప్రజలు పెరుగుతున్న దామాషా లో బస్సుల సంఖ్య పెరగనందున, ప్రజలు ప్రయివేటు వైపు వెళ్ళక తప్పని స్థితిని సృష్టిస్తున్నారు.
ప్రజా రవాణా సంస్థలు నిర్వీర్యం అయితే నష్టపోయేది కార్మికులు మాత్రమే కాదు. ఆయా రాష్ట్రాలలోని ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రజల ప్రయాణ అవసరాలకు ప్రయివేటుపై ఆధారపడవలసి వస్తుంది. విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ విద్యార్థులకిచ్చే రాయితీలు లేకపోతే సగం మంది పిల్లలు చదువులకు దూరమవుతారు. అలాగే నిత్యం డబ్బులు వచ్చే రూట్లలోనే ప్రయివేటు బస్‌లు నడుపుతారు తప్ప మారుమూల ప్రాంతాలలో వున్న గ్రామాలకు బస్ సౌకర్యం వుండదు. ఆ ప్రాంతాలు అన్నీ అభివృద్ధికి దూరం అవుతాయి. అన్ని రంగాలపై దీని ప్రభావం వుంటుంది. ఇంకా అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవలసి వస్తుంది.
అందుకని ఆర్టీసీ రక్షణ కోసం నవంబర్ 26న ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజలు కూడా మద్దతు పలకాలి. సమ్మెకు పిలుపివ్వని కార్మిక సంఘాలు కూడా పునరాలోచించాలి. ఈ సమ్మెలో భాగస్వాములు కావాలి.
- పుష్పా శ్రీనివాస్